మళ్లీ గాజాలో ఇజ్రాయిల్‌ బాంబు దాడులు !

Dec 2,2023 10:49 #again, #bomb attacks, #Gaza, #Israel
  • 109మంది మృతి, వందలాదిమందికి గాయాలు
  • నివాస ప్రాంతాలే లక్ష్యంగా దాడులు విస్తరిస్తామంటూ ప్రకటన
  • కిక్కిరిసిన ఆస్పత్రులు, బెడ్‌లు లేక నేలపైనే రోగులు

గాజా : ఏడు రోజుల పాటు అమలైన తాత్కాలిక కాల్పుల విరమణ గడువు ముగిసిన వెంటనే ఇజ్రాయిల్‌ మరోసారి బాంబుదాడులకు తెగబడింది. స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం ఉదయం 7గంటలకు కాల్పుల విరమణ గడువు ముగిసిపోయింది. వెంటనే తాజాగా జరిగిన దాడుల్లో 109 మంది పాలస్తీనియన్లు మరణించారని గాజా ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. శుక్రవారం ఉదయం నుండే గాజా వ్యాప్తంగా అనేక నివాస భవనాలను లక్ష్యంగా చేసుకుంటూ ఇజ్రాయిల్‌ వైమానిక బలగాలు దాడులు జరిపాయి. మరణించిన వారిలో అత్యధికులు సామాన్యులే. రఫాలో నివాస భవంతిపై దాడి జరగడంతో అందులోని తొమ్మిదిమంది మరణించారు. సెంట్రల్‌ గాజాలో జరిగిన దాడిలో ఏడుగురు చనిపోయారు. వందలాదిమంది గాయపడ్డారు. శుక్రవారం నాటి దాడుల్లో మరో పాలస్తీనా జర్నలిస్టు చనిపోయాడని క్వాడ్స్‌ న్యూస్‌ నెట్‌వర్క్‌ తెలిపింది. ఈ యుద్ధంలో ఇప్పటివరకు 70మందికి పైగా పాలస్తీనా జర్నలిస్టులు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటికే బాంబు దాడులు ప్రారంభమైన ప్రాంతాల్లో, దక్షిణ గాజాలో పలుచోట్ల దాడులు మరింత విస్తరించబడతాయని సంకేతాలిస్తూ ఇజ్రాయిల్‌ సైన్యం కరపత్రాలు జారవిడిచింది. కాల్పుల విరమణను పునరుద్ధరించేందుకు కృషి చేస్తున్నట్లు ఖతార్‌ ప్రకటించింది. దాడులు పునరుద్దరించిన తర్వాత ఇప్పటివరకు 200కిపైగా లక్ష్యాలపై దాడి చేసినట్లు ఇజ్రాయిల్‌ సైన్యం ప్రకటించింది. ఆ లక్ష్యాల్లో నివాస ప్రాంతాలు, శరణార్ధ శిబిరాలు వున్నాయి. ఈ దాడుల్లో 109మంది మరణించారని గాజా ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. ఖాన్‌ యూనిస్‌, రఫా నగరాలతో సహా గాజా ఉత్తర, దక్షిణ ప్రాంతాల్లో లక్ష్యాలపై పదాతి, వైమానిక, నావికా బలగాలు దాడులు జరిపా యని సైన్యం తెలిపింది. జబాలి యా శరణార్ధ శిబిరంలో నిర్వాసితు లందరూ తలదాచు కుంటున్న స్కూలుపై దాడి జరిగింది. స్కూలును మొత్తంగా కమ్మివేసేలా పొగ అలుముకోవడం వీడియోలో కనిపిస్తోంది. అత్యంత తీవ్రమైన మానవతా సంక్షోభం నెలకొన్న సమయంలో రఫా క్రాసింగ్‌ను తెరిచేందుకు అనుమతించాల్సిందిగా గాజా ఆరోగ్య శాఖ ప్రతినిధి అష్రఫ్‌ అల్‌ ఖుద్రా విజ్ఞప్తి చేశారు. కాల్పుల విరమణ సమయంలో గాజాలోకి ప్రవేశించిన వైద్య సాయం కేవలం ఒక రోజుకు మాత్రమే సరిపోతుందని చెప్పారు. గాజాలో ఆరోగ్య సేవలం రంగం స్తంభించిపోతోందన్నారు. కేవలం మూడు ఆస్పత్రులు మాత్రమే పనిచేస్తున్నాయని, అవి కూడా పెద్ద సంఖ్యలో రోగులకు సేవలందించేలా లేవన్నారు. ఇప్పటికే ఆస్పత్రులు కిక్కిరిసిపోవడంతో తాజా దాడుల్లో గాయపడిన వారందరూ బెడ్‌లు లేక నేలపైనే ఎక్కడబడితే అక్కడ పడుకుని వుండడం కనిపిస్తోంది. దాడుల నేపథ్యంలో ఈజిప్ట్‌ నుండి వచ్చే సాయం, ఇంధనం సరఫరాలన్నీ నిలిచిపోయాయని సహాయక అధికారులు తెలిపారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని పునరుద్ధరించేందుకు తాము కూడా కృషి చేస్తున్నామని అమెరికా పేర్కొంది. ఈ విషయంలో ఇజ్రాయిల్‌, ఈజిప్ట్‌, ఖతార్‌లతో కలిసి పనిచేస్తున్నామని జాతీయ భద్రతా మండలి ప్రతినిధి తెలిపారు. అమెరికా ప్రభుత్వ మద్దతుతోనే గాజాలో ఇజ్రాయిల్‌ బాంబు దాడులకు తెగబడుతోందని ఇరాన్‌ విదేశాంగ శాఖ ప్రతినిధి విమర్శించారు.

ఇజ్రాయిల్‌ అధ్యక్షుడితో ప్రధాని మోడీ భేటీ

ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం ఇజ్రాయిల్‌ అధ్యక్షుడు ఇజాక్‌ హెర్జోగ్‌తో భేటీ అయ్యారు. చర్చలు, దౌత్యం ద్వారా ఇజ్రాయిల్‌ – పాలస్తీనా సమస్యకు సత్వర, శాశ్వత పరిష్కారం కనుగొనేందుకు భారత్‌ మద్దతిస్తుందని చెప్పారు. దుబారులో కాప్‌ 28 సదస్సు నేపథ్యంలో వీరి సమావేశం జరిగింది. ప్రస్తుతం సాగుతున్న యుద్దంపై ఇరువురు నేతలు అభిప్రాయాలను పంచుకున్నారు. గాజాలోని ప్రజలకు మానవతా సాయాన్ని అందజేయడాన్ని కొనసాగించా ల్సిన ఆవశ్యకతను ప్రధాని నొక్కి చెప్పారని, బందీల విడుదలను మోడీ స్వాగతించారని విదేశాంగ శాఖ ప్రతినిధి అరిందమ్‌ బగ్చి ఎక్స్‌లో పోస్టు పెట్టారు. రెండు దేశాల ఏర్పాటే ఈ సమస్యకు పరిష్కారమని, భారత్‌ అందుకు మద్దతిస్తుందని చెప్పారు.

➡️