రూ.13,878 కోట్ల లోటు

Dec 2,2023 09:36 #crore, #Revenue Deficit
  • ప్రభుత్వ సబ్సిడీతో భర్తీ చేస్తాం
  • విద్యుత్‌ టారిఫ్‌ యథాతథం
  • ఎఆర్‌ఆర్‌లో డిస్కంల ప్రతిపాదన

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రానున్న ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.13,878.11కోట్ల రూపాయల లోటుతో వార్షిక ఆదాయ అవసర నివేదికల(ఎఆర్‌ఆర్‌)ను డిస్కమ్‌లు ప్రతిపాదించాయి. ఈ మేరకు డిస్కమ్‌లు అందించిన ప్రతిపాదనల వివరాలను ఆంధ్రప్రదేశ్‌ రెగ్యులేటరీ కమిషన్‌ మీడియాకు శుక్రవారం విడుదల చేసింది. . ఏఆర్‌ఆర్‌పై ప్రజాభిప్రాయ సేకరణ జరిపి మార్చి 31న కొత్త టారిఫ్‌ను ఇఆర్‌సి ప్రకటించే సంగతి తెలిసిందే. అయితే, తమ ప్రతిపాదనల్లో డిస్కమ్‌లే విద్యుత్‌ టారీఫ్‌లో ఎటువంటి మార్పులను సూచించలేదు. లోటు మొత్తాన్ని ప్రభుత్వమిచ్చే సబ్సిడీలతో భర్తీ చేసుకుంటామని పేర్కొన్నాయి. రాన్ను ఆర్థిక సంవత్సరంలో విద్యుత్‌ అమ్మకం 74,522.67 మిలియన్‌ యూనిట్లు(ఎంయు)గా ఉంటుందని తెలిపాయి. ఇందులో వ్యవసాయానికి అందించే ఉచిత విద్యుత్‌ 12,321.58ఎంయులుగా పేర్కొన్నాయి. 83,118.13 ఎంయుల విద్యుత్‌ను కొనుగోలు చేయాల్సిఉంటుందని, దీనికోసం రూ.39,017.60 కోట్లు అవుతుందని పేర్కొన్నాయి. ట్రాన్స్‌మిషన్‌, లోడ్‌ డిస్పాచ్‌ ధర రూ.5,722.88కోట్లుగా, డిస్ట్రిబ్యూషన్‌ నెట్‌వర్క్‌ ధర రూ.9514.42కోట్లుగా, ఇతర ఖర్చులు రూ.2321.13కోట్లుగా పేర్కొన్నాయి. . ఈ మొత్తం కలుపుకుని వచ్చే ఏడాది రూ.56,576.03కోట్లు ఖర్చు అవుతుందని చూపించాయి. ఇందులో వివిధ వనరుల ద్వారా రూ.42,697.92కోట్ల ఆదాయం వస్తుందనిరూ.13,878.11కోట్లు లోటు ఉంటుందని వివరించాయి. ఎఆర్‌ఆర్‌ ప్రకారం రాష్ట్ర ట్రాన్స్‌మిషన్‌ నష్టాలు 2.60శాతంగా ఉంది. పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌ ఇండియా లిమిటేడ్‌(పిజిసిఐఎల్‌) అంతరాష్ట్ర నష్టాల శాతం 0.9గా ఉంది. మొత్తంగా సరఫరా నష్టాలు 6.84శాతంగా టాన్స్‌మిషన్‌, డిస్ట్రిబ్యూషన్‌ నష్టాలు 10.34శాతంగా చూపించారు. . గతేడాది(2023-24) ఆర్ధిక సంవత్సరంలో ఆదాయ లోటు రూ.11,800కోట్లుగా ప్రతిపాదించగా, ఎపిఈఆర్‌సి రూ.10,135కోట్లకు అనుమతి ఇచ్చిందని వివరించాయి. ఉచిత వ్యవసాయ విద్యుత్‌ సరఫరా ఖర్చు, ఇతర సబ్సిడీ వినియోగదారులకు చెల్లించాల్సిన నగదుతో పాటు లోటును ప్రభుత్వం భర్తీ చేసిందని గుర్తుచేశాయి.

➡️