ప్రజాశక్తి – రేపల్లె
ఓటు రాజ్యాంగం కల్పించిన హక్కు అని, 18ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు కావాలని తహశీల్దారు డి మల్లికార్జునరావు కోరారు. నీ ఓటు, నీ భవిష్యత్తు కార్యక్రమంలో భాగంగా తహశీల్దారు కార్యాలయం నుంచి చేపట్టిన ఓటరు నమోదు అవగాహన ర్యాలీని ఆయన ప్రారంభించారు. ర్యాలీలో ఏపీఆర్ కాలేజ్ విద్యార్థులు ఓటరు నమోదుపై నినాదాలు చేశారు. దేశ భవిష్యత్తును నడిపించేది యువతేనని అన్నారు. యువత ఓటరుగా నమోదు చేసుకొని ప్రజాస్వామ్య వ్యవస్థలో భాగస్వాములు కావాలని అన్నారు. డిసెంబర్ 2,3 తేదీల్లో నిర్వహిస్తున్న ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమంలో 2024 జనవరి 1 నాటికి 18ఏళ్లు పూర్తికానున్న వాళ్లు ఓటరుగా నమోదు కావాలని కోరారు. మండలంలో 18ఏళ్లు నిండి ఓటరు జాబితాలో పేరు నమోదు లేకుండా ఏ ఒక్కరు లేకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని అన్నారు. ఓటరుగా ఆన్లైన్ ద్వారా, ఆఫ్లైన్ విధానంలోనూ నమోదు చేసుకోవచ్చని తెలిపారు. నేషనల్ ఓటర్ సర్వీస్ పోర్టల్ వెబ్సైబ్ ద్వారా ఆన్లైన్లో కూడా ఓటరుగా నమోదు చేసుకోవచ్చని సూచించారు. అవసరమైన పత్రాలతో పోలింగ్ స్టేషన్కు వెళ్లి తప్పనిసరిగా తమ పేరును ఓటర్ల జాబితాలో చేర్చుకోవాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బి విజయసారథి, సిఐ నజీర్ బేగ్, ఎస్ఐ హరిబాబు పాల్గొన్నారు.
నగరం : మండలంలోని అన్నీ పోలింగ్ కేంద్రాల వద్ద ఓటరు నమోదుపై ఈనెల 2, 3తేదీల్లో స్పెషల్ క్యాంపెయిన్ నిర్వహించనున్నట్లు తహశీల్దారు ఎం ప్రమీల తెలిపారు. ప్రతీ ఒక్క ఓటరు తమ ఓటు వివరాలు బిఎల్ఓల వద్ద సరిచూసుకోవాలని చెప్పారు. చేర్పులు, మార్పులు ఉంటే ఈ 2రోజుల్లో సరిచేసుకొనే అవకాశం ఉన్నట్లు తెలిపారు. ఓటు హక్కు వినియోగంపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో డిప్యూటీ తహశీల్దారు ఎం శ్రీనివాసరావు, కళాశాల ప్రిన్సిపాల్ హరికృష్ణ పాల్గొన్నారు.
చెరుకుపల్లి : ఈనెల 2, 3తేదీల్లో ఓటర్ల జాబితా సవరణలకు అవకాశం కల్పిస్తున్నట్లు తహశీల్దారు బి వెంకటేశ్వర్లు తెలిపారు. ఎన్నికల కమిషనర్ ఆదేశాల మేరకు పోలింగ్ బూతుల వద్ద బూత్ లెవల్ అధికారులు అందుబాటులో ఉంటారని తెలిపారు. అవసరమైన ఓటర్లందరూ దరఖాస్తులు చేసుకోవచ్చని తెలిపారు.