ప్రజాశక్తి – పంగులూరు
ప్రభుత్వం మనుషులకు ఆరోగ్యశ్రీ కార్డులు ఇచ్చినట్లుగానే ఇక నుండి పశువులకు కూడా హెల్త్ కార్డులు ఇస్తున్నట్లు పశువైద్యలు డాక్టర్ మురళీకృష్ణ తెలిపారు. పశువులతో పాటు గొర్రెలు, మేకలకు కూడా ఆరోగ్య కార్డులు ఇస్తామని అన్నారు. స్థానిక పశువుల హాస్పిటల్లో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పశువుల చెవులకు వేసిన ట్యాగ్ నంబర్లను పశువుల హెల్త్ కార్డులులో వేసి కార్డును పశు పోషకునికి ఇస్తామని తెలిపారు. పశువును హాస్పటల్‌కు తీసుకొచ్చిన పుడు ఆకార్డు కూడా తీసుకురావాలని చెప్పారు. ఈ కార్డు ద్వారా నట్టల నివారణ, గాలికుంటు, గొంతువాపు, జబ్బ వాపు, బృసెల్లా, ఇతర వ్యాధులకు వైద్యం చేయించుకోవచ్చని చెప్పారు. గొర్రెలు, మేకలకు కూడా ఈ కార్డు ద్వారా వైద్యం చేయించుకోవచ్చని చెప్పారు. పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఆడ దూడలే పుట్టటానికి ఎస్ఎస్ఎస్ ఎద ఇంజక్షన్లను గేదెలకు వేస్తున్నామని చెప్పారు. ఈ ఇంజక్షన్లు గేదెలకు వేస్తే ఆడదూడలె పుడతాయని చెప్పారు. నాలుగు నెలల నుండి 8నెలల్లో లోపు ఆడదూడలకు గర్భకోశ వ్యాధులు రాకుండా బ్రూసెల్లా టీకాలు వేస్తున్నామని తెలిపారు. ఆడ దూడలున్న యజమానులు తమ దూడలకు ఈ టీకా వేయించుకోవాలని సూచించారు. వర్షాలు కురుస్తూ, మంచు కురుస్తూ ఉండటం వలన ఈ సీజన్లో ఎక్కువగా పారుడు వ్యాధి వస్తుందని తెలిపారు. ఈ వ్యాధి నివారణకు ఇంజక్షన్ చేయించుకోవాలని చెప్పారు. నేషనల్ ఐస్టాక్ మిషన్ ద్వారా ప్రభుత్వం గొర్రెలు, పందులు, కోళ్లకు సంబంధించి 50శాతం సబ్సిడీతో రుణాలు మంజూరు చేస్తుందని అన్నారు. రూ.10లక్షల నుండి రూ.కోటి వరకు రుణాలు పొందవచ్చని తెలిపారు. గొర్రెలు, పందులు, కోళ్లు పెంపకం మీద ఆసక్తి ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాలని కోరారు.