ఎయిడ్స్‌పై అవగాహన కలిగి ఉండాలి

ప్రజాశక్తి – తణుకురూరల్‌

ఎయిడ్స్‌పై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి, ఎయిడ్స్‌ రహిత సమాజం కోసం పాటుపడాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖా మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. శుక్రవారం తణుకు జిల్లా కేంద్ర ఆసుపత్రి ప్రాంగణంలో ప్రపంచ ఎయిడ్స్‌ నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆసుపత్రి ఇన్‌ఛార్జి సూపరింటెండెంట్‌ వెలగల అరుణ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కారుమూరి మాట్లాడుతూ రోగులు క్రమం తప్పకుండా మందులు వాడి వారి జీవనకాలం పెంచుకోవాలన్నారు. ఎయిడ్స్‌ వ్యాధిగ్రస్తుల పట్ల వివక్ష చూపరాదన్నారు. తణుకు సేఫ్‌ కేర్‌ సెంటర్‌కు బెస్ట్‌ అవార్డు రావడంతో సెంటర్‌ మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ సుంకవల్లి రామకృష్ణ, సిబ్బందిని మంత్రి కారుమూరి ఘనంగా సత్కరించారు. అనంతరం ఐఎంఎ సీనియర్‌ వైద్యులు తాతిన రామబ్రహ్మం ప్రతిజ్ఞన చేయించగా మంత్రి కారుమూరి జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎఎంసి మాజీ ఛైర్మన్‌ చిట్టూరి వెంకట సుబ్బారావు, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ గౌరవాధ్యక్షులు దాట్ల సుందరరామరాజు, ఎఎంసి ఛైర్మన్‌ నత్తా కృష్ణవేణి, ఎంఎ అధ్యక్షులు ఎం.రఘు, కార్యదర్శి డా.రమేష్‌కుమార్‌ పాల్గొన్నారు. భీమవరం :హెచ్‌ఐవి సోకిన వ్యక్తులు వివక్షతకు గురికాకుండా వారు సమాజంలో ఒక భాగమని గుర్తించి వారికి ఆత్మ స్థయిర్యాన్ని ఇవ్వాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డి.మహేశ్వరరావు తెలిపారు. శుక్రవారం ఎయిడ్స్‌ దినోత్సవం సందర్భంగా స్థానిక ఏరియా ప్రభుత్వాసుపత్రి నుంచి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ర్యాలీ అనంతరం ఆసుపత్రిలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిఎంహెచ్‌ఒ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు హెచ్‌ఐవి సోకకుండా ఎన్నో ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తోందని, సోకిన వారికి ఎన్నో సంక్షేమ, ఆరోగ్య కార్యక్రమాలు అందిస్తోందని తెలిపారు. ఎయిడ్స్‌పై ప్రతి ఒక్కరికీ పూర్తి అవగాహన ఉండాలన్నారు. గర్భిణులు తప్పకుండా హెచ్‌ఐవి పరీక్షలు చేయించుకోవాలన్నారు. విశిష్ట వైద్య సేవలందించిన వైద్యాధికారులు, వైద్య సిబ్బందికి, స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు 30 మందికి ప్రశంసాపత్రాలు, బహుమతులను డిఎంహెచ్‌ఒ అందజేశారు. భీమవరం దివ్య జ్ఞాన సమాజం వారి సహకారంతో 50 మంది హెచ్‌ఐవి, ఎయిడ్స్‌ పేషెంట్లకు పోషకాహార కిట్లను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏరియా హాస్పిటల్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ఎం.వీరాస్వామి, ఎఆర్‌టి వైద్యాధికారి డాక్టర్‌ బి.ప్రసాద్‌, తణుకు బ్లడ్‌ బ్యాంకు అధినేత శ్రీనాథ్‌ పాల్గొన్నారు. అలాగే కృష్ణ యువజన సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఎయిడ్స్‌ దినోత్సవం నిర్వహించారు. ఆసుపత్రి నుంచి సబ్‌ జైల్‌ వరకూ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో కృష్ణ యువజన సంక్షేమ సంఘం ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ పి.అర్చన, పట్టణ పోలీసులు, 100 మంది కెజిఆర్‌ఎల్‌ కళాశాల విద్యార్థులు, అధ్యాపకులు ర్యాలీలో పాల్గొన్నారు. 20 మంది హెచ్‌ఐవి బాధితులకు పౌష్టికాహార కిట్లను భీమవరం లయన్స్‌ క్లబ్‌, కియాస్‌ ఉద్యోగుల సహకారంతో అర్చన, లయన్స్‌ క్లబ్‌ కమిటీ మెంబర్స్‌ చేతుల మీదుగా అందజేశారు. నరసాపురం:ఎయిడ్స్‌పై అవగాహన కలిగి ఉండాలని ప్రభుత్వ చీఫ్‌ విప్‌ ముదునూరి ప్రసాదరాజు అన్నారు. ప్రపంచ ఎయిడ్స్‌ దినోత్సవం సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నరసాపురం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి నుంచి నరసాపురం బస్టాండ్‌ వరకూ శుక్రవారం ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వ చీఫ్‌విప్‌ ముదునూరి ప్రసాదరాజు ప్రారంభించి మాట్లాడారు. గతంలో ఈ వ్యాధి గురించి భయపడే పరిస్థితి ఉండేదన్నారు. ప్రస్తుతం శక్తివంతమైన మందులు రావడం వల్ల వ్యాధి కాలక్రమేణ తగ్గుతూ వస్తోందన్నారు. దీన్ని పూర్తిగా నిర్మూలించాలని ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. అనంతరం ఈ కార్యక్రమంలో పాల్గొన్న కాలేజీలు ఎన్‌ఎస్‌ఎస్‌ పిఒలకు ప్రశంసాపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో మున్సిపల్‌ ఛైౖర్‌ పర్సన్‌ బర్రె శ్రీ వెంకటరమణ, మున్సిపల్‌ కమిషనర్‌ కె.వెంకటేశ్వరరావు, ఆస్పత్రి అభివద్ధి కమిటీ సభ్యులు గొట్టుముక్కల సూర్యనారాయణ రాజు పాల్గొన్నారు.

➡️