ప్రజాశక్తి-విజయనగరం : పరిశ్రమలకు సకాలంలో అనుమతులు జారీ చేయడంతోపాటు, యూనిట్ల స్థాపనపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను కలెక్టర్ నాగలక్ష్మి ఆదేశించారు. జిల్లా పరిశ్రమలు, ఎగుమతుల ప్రోత్సాహక మండలిసమావేశం కలెక్టరేట్ సమావేశమందిరంలో శుక్రవారం జరిగింది. జిల్లాలో కొత్త పరిశ్రమలు, పారిశ్రామిక వాడల స్థాపన విస్తరణకు ఉన్న అవకాశాలను, భూముల కేటాయింపు, ఇతర అంశాలపై ఈ సమావేశంలో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ నాగలక్ష్మి మాట్లాడుతూ పిఎంఇజిపి పథకం కింద ఇప్పటివరకు అనుమతులు మంజూరు చేసిన యూనిట్లను వెంటనే ప్రారంభింపజేసేందుకు కృషి చేయాలని కోరారు. దీనిపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించాలని సూచించారు. పరిశ్రమలు, ఎపిఐఐసి ఆధ్వర్యంలో పారిశ్రామిక వాడల స్థాపనకు పెండింగ్‌లో ఉన్న ప్రతిపాదనలు కార్యరూపం దాల్చడానికి తగిన చర్యలను వెంటనే చేపట్టాలని సూచించారు. కొత్తవలస మండలం బలిఘట్టం, రెల్లి, పెదరావుపల్లి, కంటకాపల్లి గ్రామాల్లో ప్రతిపాదిత భూములను కేటాయించడానికి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. భూముల మ్యుటేషన్‌పైనా, వివిధ పారిశ్రామిక క్లష్టర్ల ఏర్పాటుపై చర్చించారు. కంటకాపల్లి క్లష్టర్, భోగాపురం మండలం దిబ్బపాలెంలో పాడైపోయిన పైప్‌లైన్ అంశం, పిఎంఇజిపి, ఆసుపత్రులు, ఆరోగ్య పరీక్షా కేంద్రాల సెంటర్‌కు స్థలం కేటాయింపు, బీమాలిలో మామిడి తాండ్ర తయారీ క్లష్టర్, షాపింగ్ మాల్స్‌లో అగ్నిప్రమాదాల నివారణా చర్యలు, డిపిఐఐటి సర్వే, అర్ధన్నపాలెంలో ఎంఎస్‌ఎంఇ పార్క్, టెక్నాలజీ సెంటర్ ఏర్పాటు, వివిధ పరిశ్రమలకు భూముల కేటాయింపు అంశం, భూముల స్థితిలో మార్పులు తదితర అంశాలపై చర్చించారు. సమావేశంలో ఆర్‌డిఒ ఎంవి సూర్యకళ, పరిశ్రమలశాఖ జిల్లా మేనేజర్ ఆర్.పాపారావు, డిడి నాగేశ్వర్రావు, వివిధ శాఖల అధికారులు, కమిటీ సభ్యులు, పరిశ్రమల శాఖ సిబ్బంది పాల్గొన్నారు.