Animal Movie Review: యానిమల్‌ రివ్యూ

Dec 1,2023 18:06 #movie, #Ranbir Kapoor, #review

 

ప్రముఖ బాలీవుడ్‌ నటుడు రణబీర్‌ కపూర్‌ తాజాగా నటించిన పాన్‌ ఇండియా మూవీ ‘యానిమల్‌’. ఈ చిత్రంలో రణబీర్‌కి జోడీగా నటి రష్మిక నటించింది. హీరో విజరు దేవరకొండకు మంచి గుర్తింపు తెచ్చి పెట్టిన ‘అర్జున్‌రెడ్డి’ మూవీ డైరెక్టర్‌ సందీప్‌రెడ్డి వంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ మూవీ ట్రైలర్‌లోనే సినిమాలో వయోలెన్స్‌ ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది. యాక్షన్‌, వయోలెన్స్‌, ప్రేమ అన్నీ కలగలిసిన ఈ చిత్రం డిసెంబర్‌ 1వ తేదీన థియేటర్లలో విడుదలైంది. మరి ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు అలరించిందో తెలుసుకుందాం!

కథ

ప్రముఖ వ్యాపారవేత్త బల్బీర్‌ సింగ్‌ (అనీల్‌ కపూర్‌). బిజినెస్‌ పనుల్లో బిజీగా ఉంటూ.. ఫ్యామిలీ కోసం అస్సలు టైం కేటాయించడు. అతని కుమారుడు రణ్‌ విజరు సింగ్‌ (రణబీర్‌ కపూర్‌)కి తన తండ్రి అంటే పిచ్చిప్రేమ. ఆ ప్రేమను ఫుల్‌ అగ్రెసివ్‌గానే చూపిస్తాడు. దీంతో విజరు ప్రేమను తండ్రి అర్థంచేసుకోలేడు. ఓ చిన్న సంఘటన వల్ల విజరు తండ్రికి దూరమై బోర్డింగ్‌ స్కూల్‌కి వెళతాడు. తిరిగి వచ్చిన తర్వాత తండ్రీ – కొడుకులిద్దరికీ గొడవలవుతాయి. దీంతో విజరు తాను ప్రేమించిన గీతాంజలి (రష్మిక)ని పెళ్లి చేసుకుని అమెరికాకు వెళతాడు. కొన్నాళ్ల తర్వాత తండ్రిపై హత్యాప్రయత్నం జరుగుతుంది. ఈ విషయం తెలుసుకున్న విజరు అమెరికా నుంచి వస్తాడు. తన తండ్రిపై ఎందుకు అటాక్‌ జరిగింది? ఎవరు చేశారు? శత్రువుల్ని కనిపెట్టాక విజరు ఏం చేశాడు? చివరికి కొడుకు ప్రేమను తండ్రి అర్థం చేసుకున్నాడా? లేదా అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ

దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా తెరకెక్కించిన చిత్రం ఎలా ఉంటుందో ‘అర్జున్‌రెడ్డి’ మూవీనే ఉదాహరణ. ఇంచుమించు ‘యానిమల్‌’ చిత్రం కూడా అలానే ఉంది. ఇందులో రణబీర్‌ ఫుల్‌ అగ్రెసివ్‌ క్యారెక్టర్‌లో నటించాడు. తన నటనతో మెప్పించాడు కూడా. అర్జున్‌రెడ్డి సినిమాలో ప్రియురాలు దూరమైతే ఎలా ఫీలవుతాడో చూపిస్తే.. ఈ చిత్రంలో తండ్రి ప్రేమకు దూరమైన కొడుకు మనస్తత్వం ఎలా ఉంటుంది? పెద్దయ్యాక ఎలాంటి పనులు చేస్తాడు అన్నదాన్ని సందీప్‌రెడ్డి చూపించాడు. ఈ చిత్రం ఫుల్‌ మాస్‌ అండ్‌ యాక్షన్‌ మూవీ. ఇక ఈ సినిమా విషయానికొస్తే.. తండ్రీ కొడుకుల మధ్య ఓ ఎమోషనల్‌ సాంగ్‌తో కథ ప్రారంభమవుతుంది. హీరో పైకి సాఫ్ట్‌గా ఉన్నా.. ఫుల్‌ అగ్రెసివ్‌. తాను స్కూల్లో చదివే రోజుల్లోనే తన అక్కని ఎవరో ర్యాగింగ్‌ చేస్తున్నారని తెలుసుకున్న విజరు.. ఏకంగా కాలేజీకి గన్‌తో వెళ్లి బెదిరిస్తాడు. ఈ ఒక్క సంఘటనతోనే విజరు క్యారెక్టర్‌ ఎలా ఉంటుందో ఓ అంచనాకు రావచ్చు. ఇక హీరోయిన్‌ రష్మిక ఎంట్రీ సాదాసీదాగానే ఉంది. అయితే హీరోహీరోయిన్ల మధ్య రొమాన్స్‌ సన్నివేశాలు మరీ బోల్డ్‌గా ఉన్నాయి. ఫ్యామిలీ ఆడియన్స్‌కి ఈ సన్నివేశాలు ఇబ్బందిగా ఉంటాయి. ఓ భారీ యాక్షన్‌ సీన్‌తో విరామం వస్తుంది. ఇక సెకండాఫ్‌లో విజరు విశ్వరూపం తెరపై కనిపిస్తుంది. భార్యాభర్తలుగా విజరు, గీతాంజలి నటన అద్భుతంగా ఉంది. విలన్‌గా బాబీ డియోల్‌ పాత్ర ఎంట్రీతో కథనంలో వేగం పెరుగుతుంది. హింస కూడా అదేస్థాయిలో ఉంటుంది. తెలుగులో బాలకృష్ణ మూవీకి ఏమాత్రం తీసిపోని విధంగా యాక్షన్‌, హింసను ఈ చిత్రంలో మరోసారి చూడొచ్చు. అక్క, భార్య, తండ్రి మీద చూపించే ప్రేమ మనసుకి హత్తుకునేలా సున్నితంగా కాకుండా.. హింసతో ఎక్కువ మంది జనాల్ని చంపుతూ విధ్వంసంతోనే విజరు తన ప్రేమను చూపిస్తాడు. దీన్నే దర్శకుడు సందీప్‌రెడ్డి హైలెట్‌ చేసి చూపించాడు. దాదాపు సినిమా మొత్తం ఇదే రక్తపాతంతో కథ నడుస్తుంది. ఇక క్లైమాక్స్‌ ప్రేక్షకులు ఊహించిందే. కథ పాతదే అయినా.. దర్శకుడు నేటితరానికి తగ్గట్టుగా భారీ తారాగణంతో యాక్షన్‌ సీన్స్‌తో తెరకెక్కించడం వల్ల యూత్‌కి నచ్చుతుంది. అయితే ఫ్యామిలీ ఆడియన్స్‌ ఈ చిత్రం నచ్చకపోవచ్చు.

ఎవరెలా చేశారంటే

రణబీర్‌ విజరు పాత్రలో అద్భుతంగా నటించాడు. హీరోయిన్‌ రష్మిక తన పాత్రకు న్యాయం చేసింది. ఇక తండ్రిగా అనీల్‌ కపూర్‌ బాగా నటించారు. బాబీ డియోల్‌ పాత్ర సినిమాకి హైలెట్‌. ఇక తదితర నటీనటులు తమ పాత్ర పరిధిమేరకు నటించారు. హర్షవర్ధన్‌ రామేశ్వర్‌ నేపథ్య సంగీతం ఆకట్టుకుంది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.

➡️