అమరావతి : దక్షిణాది చిత్ర పరిశ్రమలో సీనియర్ నటి ఆర్.సుబ్బలక్ష్మి (87) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె కొచ్చిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం రాత్రి తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆమె మనవరాలు సోషల్ మీడియాలో తెలిపారు. ‘నా బలం, మా అమ్మమ్మను నేను కోల్పోయాను’ అంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. దీంతో ఇండిస్టీకి చెందిన ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.సుబ్బలక్ష్మి తెలుగు,తమిళ, మాలయాళ భాషల్లో మొత్తం 70కు పైగా చిత్రాల్లో నటించారు. తెలుగులో ‘కళ్యాణ రాముడు’ సినిమాలో కనిపించారు. నాగచైతన్య హీరోగా వచ్చిన ‘ఏ మాయ చేసావె’లో సమంతకు అమ్మమ్మగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక చివరిసారి విజయ్ ‘బీస్ట్’ సినిమాలో సుబ్బలక్ష్మి కనిపించారు. వెండితెరపైనే కాకుండా బుల్లితెరపై కూడా ఎన్నో సీరియల్స్‌లో నటించి ఆకట్టుకున్నారు. సినీ పరిశ్రమలోకి రాకముందు జవహర్ బాలభవన్‌లో సంగీత, నాట్య శిక్షకురాలిగా పనిచేశారు. 1951లో ఆల్ ఇండియా రేడియోలో ఉద్యోగినిగా సేవలందించారు. దక్షిణ భారత దేశం నుంచి ఆల్ ఇండియా రేడియోలో పనిచేసిన తొలి లేడీ కంపోజర్‌గా సుబ్బలక్ష్మి రికార్డు సృష్టించారు. అంతే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్టుగా కూడా పేరు తెచ్చుకున్నారు.