ప్రజాశక్తి – బాపట్ల రూరల్
మండల కేంద్రంలో ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రం లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని, భట్టిప్రోలులో పరీక్ష కేంద్రం ఏర్పాటు చేయాలని కోరుతూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఇంటర్మీడియట్ విద్యా శాఖ జిల్లా అధికారి ఎర్రయ్యకు గురువారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పి మనోజ్, ఆర్య మాట్లాడుతూ భట్టిప్రోలులో మూడు ఇంటర్మీడియట్ కళాశాలలు ఉన్నప్పటికీ పరీక్ష కేంద్రం లేకపోవడంతో నగరం, చెరుకుపల్లి వెళ్లేందుకు విద్యార్థులు అవస్థలు పడుతున్నారని చెప్పారు. టిఎస్‌కె బాలికల జూనియర్ కళాశాల నుండి బాలికలు పరీక్ష రాసేందుకు 30నుండి 35కిలోమీటర్లు ప్రయాణించాల్సి రావడంతో ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు. కొల్లూరు, వేమూరు మండలాల నునండి అనేక మంది విద్యార్థినీ, విద్యార్థులు భట్టిప్రోలుకు వస్తుంటారని తెలిపారు. అంత దూరం నుండి చదువుకోవడానికి రావటమే కాక పరీక్షలకు కూడా మరింత దూరాలకు వెళ్లడానికి పడుతున్న ఇబ్బందులను గుర్తించాలని కోరారు. తక్షణమే భట్టిప్రోలులో ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కోరారు.