చరిత్ర సృష్టించిన ఉగాండా.. టి20 ప్రపంచ కప్‌కు అర్హత

Nov 30,2023 22:20 #Sports

దుబాయ్: 2024లో జరగనున్న టి20 ప్రపంచకప్‌కు ఆఫ్రికానుంచి మరో జట్టు అర్హత సాధించింది. కెన్యా, జింబాబ్వే వంటి జట్లను చిత్తుచేసి ఏకంగా ఉగండా జట్టు వచ్చే ఏడాది అమెరికా, వెస్టిండీస్‌ వేదికగా జరిగే టి20 వరల్డ్‌ కప్‌కు అర్హత సాధించింది. ఆఫ్రికా రీజియన్‌ క్వాలిఫయర్‌-2023 పోటీలలో ఉగండా జట్టు గురువారం రువాండాను ఓడించడంతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచి ప్రపంచకప్‌ బెర్త్‌ను ఖాయం చేసుకుంది. రువాండాతో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన రువాండా.. 18.5 ఓవర్లలో 65 పరుగులకు ఆలౌటైంది. ఆ జట్టులో ఎరిక్‌ దుసిన్‌(19) టాప్‌ స్కోరర్‌. ఉగాండా బౌలర్లలో అల్పేష్‌ రంజానీ , దినేశ్‌ నక్రానీ, సెనెయోందొ, కెప్టెన్‌ మసాబా తలా రెండు వికెట్లు తీశారు. అనంతరం లక్ష్యాన్ని ఉగాండా.. 8.1 ఓవర్లలో ఒక వికెట్‌ మాత్రమే కోల్పోయి ఛేదించింది. ఏడు దేశాల మధ్య జరిగిన టోర్నీలో నమీబియా ఆడిన ఐదు మ్యాచుల్లో ఐదింటిని గెలుచుకుని పది పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. ఇప్పటికే అర్హత సాధించిన సంగతి తెలిసిందే. తాజాగా ఉగాండా జట్టు ఆరు మ్యాచ్‌లలో ఐదు గెలిచి పది పాయింట్లతో రెండో స్థానలో ఉంది. నమీబియా, ఉగాండాలు క్వాలిఫై అవడంతో జింబాబ్వే, కెన్యా, నైజీరియా, టాంజానియా, రువాండాలు నిష్క్రమించాయి.

➡️