సెప్టెంబర్ త్రైమాసికం గణాంకాల వెల్లడి
న్యూఢిల్లీ : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జులై నుంచి సెప్టెంబర్‌తో ముగిసిన ద్వితీయ త్రైమాసికం (క్యూ2)లో భారత స్థూల దేశీయోత్పత్తి (జిడిపి) 7.6 శాతం పెరిగింది. ఆర్‌బిఐ వేసిన 6.5 శాతం అంచనా కంటే ఎక్కువ. తయారీ, నిర్మాణ రంగాలు మెరుగైన ప్రగతిని కనబర్చాయని కేంద్ర గణాంకాల కార్యాలయం (ఎన్‌ఎస్‌ఒ) గురువారం వెల్లడించిన రిపోర్టులో పేర్కొంది. గతేడాది ఇదే త్రైమాసికంలో 6.2 శాతం వృద్థి చోటు చేసుకోగా.. గడిచిన ఏప్రిల్ ా జూన్ త్రైమాసికంలో 7.8 శాతం పెరుగుదల చోటు చేసుకుంది. దీంతో పోల్చితే స్వల్పంగా తగ్గినట్లయ్యింది. 2011ా12 స్థిర ధరల ప్రకారం.. గడిచిన క్యూ2లో స్థూల దేశీయోత్పత్తి రూ.41.74 లక్షల కోట్లుగా నమోదయ్యింది. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.38.78 లక్షల కోట్లుగా ఉంది.సెప్టెంబర్ త్రైమాసికంలో భారత జిడిపి 6.5 శాతం చోటు చేసుకోవచ్చని అక్టోబర్‌లో జరిగిన మానిటరీ పాలసీలో ఆర్‌బిఐ గవర్నర్ శక్తికాంత దాస్ అంచనా వేశారు. ఏడాదికేడాదితో పోల్చితే తయారీ రంగం 13.9 శాతం వృద్థిని కనబర్చింది. ఇంతక్రితం త్రైమాసికంలో రంగం 4.7 శాతం పెరుగుదలను నమోదు చేసింది. ఇదే సమయంలో 7.9 శాతం పెరుగదల చూపిన నిర్మాణ రంగం.. గడిచిన క్యూ2లో 13.2 శాతం వృద్థిని సాధించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి సెప్టెంబర్‌తో ముగిసిన ప్రథమార్థంలో వాస్తవ జిడిపి 7.7 శాతం వృద్థితో రూ.82.11 లక్షల కోట్లుగా చోటు చేసుకుంది. గతేడాది ఇదే కాలంలో రూ.76.22 లక్షల కోట్ల వాస్తవ జిడిపి నమోదయ్యింది.