రూ. 250 కోట్ల మనీలాండరింగ్‌ కేసులో ఈడి సోదాలు 

  శ్రీనగర్‌ :   జమ్ముకాశ్మీర్‌లోని ఆరు ప్రాంతాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడి) గురువారం సోదాలు చేపట్టింది. రూ. 250 కోట్ల అక్రమ నగదులావాదేవీల కుంభకోణం కేసులో జెకె స్టేట్‌ కార్పోరేటివ్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌ మాజీ చైర్మన్‌ సహా పలువురి నివాసాల్లో సోదాలు జరుపుతున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కేసు జెకె బ్యాంకుకు సంబంధించినదని, రివర్‌ జీలం కోఆపరేటివ్‌ హౌసింగ్‌ బిల్డింగ్‌ సొసైటీ పేరుతో ఈ కుంభకోణం జరిగినట్లు అధికారులు తెలిపారు. పిఎంఎల్‌ఎ చట్టం కింద ఫెడరల్‌ ప్రోబ్‌ ఏజన్సీ (ఎఫ్‌పిఎ) ఆదేశాలతో శ్రీనగర్‌లోని ఈడి అధికారులు ఈ సోదాలు చేపట్టారు. ఈ కేసులో నకిలీ హౌసింగ్‌ సొసైటీ చైర్మన్‌ హిలాల్‌ ఎ మిర్‌, అప్పటి జెకె అండ్‌ స్టేట్‌ కో ఆపరేటివ్‌ లిమిటెడ్‌ చైర్మన్‌ మొహమ్మద్‌ షఫీ దార్‌ మరియు ఇతరులపై అవినీతి నిరోధక శాఖ ( ఎసిబి) ఇప్పటికే చార్జిషీటు దాఖలు చేసిన సంగతి తెలిసిందే.

కుంభకోణం వివరాలు ..

ఎసిబి నివేదిక ప్రకారం..  శాటిలైట్‌ టౌన్‌షిప్‌ నిర్మాణం కోసం శ్రీనగర్‌ శివార్లలో 37.5 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకోవడానికి రూ. 300 కోట్లు ఆర్థిక సాయం అందించేలా జెకె కో ఆపరేటివ్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌కి ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ మిర్‌ సెక్రటరీ కో ఆపరేటివ్స్‌, అడ్మినిస్ట్రేషన్‌ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ కో- ఆపరేటివ్‌ సొసైటీస్‌కి ఓ దరఖాస్తు సమర్పించారు. జెకె సహకార సంఘాల రిజిస్ట్రార్‌ ఈ దరఖాస్తును ఆమోదించారు. శ్రీనగర్‌లోని జెకె కో ఆపరేటివ్‌ బ్యాంక్‌ ( బ్యాలెన్స్‌ షీట్‌, లాభనష్టాలు, వ్యాపారం సొసైటీ నిర్విహిస్తున్న కార్యకలాపాలు, పాన్‌ నెంబర్‌, ఆదాయపు పన్ను రిటర్న్‌, బోర్టు తీర్మానాలు, నిర్మాణ వివరాలు ) వంటి కనీస నిబంధనలు పాటించకుండా రూ. 223 కోట్లు రుణాన్ని మంజూరు చేసింది. రివర్‌ జీలం కో ఆపరేటివ్‌ హౌస్‌ బిల్డింగ్‌ సొసైటీ జమ్ముకాశ్మీర్‌లోని రిజిస్ట్రార్‌ కో- ఆపరేటివ్‌ సొసైటీలో కూడా నమోదు చేయించలేదని, రుణం కోసం దార్‌, మిర్‌ ఇతరులు నకిలీ రిజిస్ట్రేషన్‌ పత్రాలను తయారు చేసినట్లు విచారణలో తేలింది. రుణం మొత్తాన్ని భూయజమానుల ఖాతాల్లోకి జమ చేసినా భూమిని బ్యాంకులో తనఖా పెట్టలేదని అన్నారు.

➡️