నరేంద్ర మోడీ నాయకత్వంలోని బిజెపి ప్రభుత్వం, విద్యుత్‌రంగ సంస్కరణలతో, అత్యంత వేగంగా ముందుకు సాగుతోంది. రైతాంగం ఆందోళనతో 2021 నవంబర్‌లో, వ్యవసాయ చట్టాలను అనివార్యంగా వెనక్కు తీసుకోవలసిన పరిస్థితి మోడీ ప్రభుత్వానికి ఏర్పడింది. ఆ సందర్భంగా రైతుల ప్రయోజనాలకు భిన్నంగా విద్యుత్ సవరణ బిల్లును అమలు చేయనని ఆయన హామీ ఇచ్చారు. అయితే, దొడ్డిదోవన ఆ విధానాలనే అమలులోకి తెచ్చారు. ఫలితంగా మరో పోరాటం అనివార్యమైంది. నిజానికి ఈ విధానాలకు బిజెపి ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయి హయాంలోనే బీజం పడింది. 1948 నుండి అమలవుతున్న విద్యుత్ చట్టం వ్యవసాయ అభివృద్ధికి అధిక రాయితీలు ఇవ్వడం, దేశ ఆహార భద్రతను, పేదలకు రాయితీతో కూడిన విద్యుత్తును అందించే లక్ష్యంగా ఉంటుంది. దీంతోపాటు, వినియోగదారులకు సరసమైన ధరలకు, విద్యుత్‌ను అందించడానికి ఉపకరిస్తుంది. ఈ విధానాన్ని అమలు చేయడానికి అవసరమైన ఖర్చును ఇతర మార్గాల ద్వారా తిరిగి పొందుతుంది. అయితే, బిజెపి ప్రభుత్వాలు విద్యుత్‌ను కార్పొరేట్లకు అప్పచెప్పాలనే లక్ష్యంతోనే పనిచేస్తున్నాయి. వ్యవసాయ చట్టాలతో సహా అనేక చట్టాల మాదిరిగానే, తీవ్రమైన కరోనా మహమ్మారి, కఠినమైన లాక్‌డౌన్‌తో ప్రజలు కొట్టు మిట్టాడుతున్న సమయంలో, గుత్త పెట్టుబడి దారుల ఆదేశానుసారం, లేబర్ కోడ్స్ తీసుకు వచ్చారు. 17 ఏప్రిల్ 2020, తిరిగి 8 ఆగస్టు 2022న విద్యుత్ రంగంలో కూడా కార్పొరేట్లకు అనుకూలంగా బిల్లును ప్రవేశపెట్టారు. విద్యుత్, ఇతర సరుకుల కంటే భిన్నంగా ఉంటుంది. ప్రజలు తమ అవసరాల కోసం, విద్యుత్తును నిల్వ చేయడం సాధ్యం కాదు. అందువల్ల వినియోగదారులను పూర్తిగా గుత్తాధిపత్యంపై ఆధారపడేలా చేస్తుంది. కాలిఫోర్నియా, ఇతర ప్రాంతాలలో విద్యుత్ రంగంలో గుత్తాధిపత్యం అనే ప్రయోగం, సంస్కరణల ఉద్దేశం ప్రభుత్వ రంగానికి పోటీగా ఉండడమే. హోల్‌సేల్ విద్యుత్ మార్కెట్‌లో, ప్రైవేటు పవర్ జనరేటర్ల గుత్తాధిపత్యానికి సంబంధించిన ఈ కసరత్తు ద్వారా విద్యుత్‌ను ఒకవైపు యుటిలిటీ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలకు విక్రయిస్తారు. మరొకవైపు రిటైల్ మార్కెట్లో విద్యుత్‌ను అంతిమ వినియోగదారులకు ప్రైవేటు సర్వీస్ ప్రొవైడర్‌కు విక్రయిస్తారు. ఈ రంగంలో వేగవంతమైన మార్పులు, వినియోగదారుల జీవితాలలో గందరగోళానికి దారితీస్తాయని హెచ్చరించడానికి కారణం లేకపోలేదు. ఖీవిద్యుత్ సంస్కరణలు ప్రతిఘటనలను ఎదుర్కొంటు న్నందున భారతదేశంలోని పాలక వర్గాలు మొదట కేంద్రపాలిత ప్రాంతాల్లో సంస్కరణలను అమలు చేయడానికి ప్రయత్నించాయి. దాదర్ మరియు నాగర్ హవేలీ లోని ఆస్తులన్నీ గుజరాత్‌కు చెందిన టొరెంట్ కంపెనీకి బదిలీ చేశారు. మహారాష్ట్రలో అదానీలకు, చండీగఢ్‌లో ఆర్.పి గోయంకా గ్రూప్‌కు, జమ్మూ కాశ్మీర్, పాండిచ్చేరిలలో ప్రైవేటు కంపెనీలకు అప్పగించే ప్రయత్నాలను, విద్యుత్ కార్మికులు, వినియోగదారులు ఐక్య పోరాటాల ద్వారా విజయవంతంగా ప్రతిఘటించారు. అదానీలు, అంబానీలతోపాటు, టాటాలు కూడా విద్యుత్ రంగంలోకి పెద్దఎత్తున ప్రవేశించారు. అదానీ ప్రైవేట్ లిమిటెడ్ తన సైట్‌లో 13,650 మెగావాట్ల సామర్థ్యంతో, యన్‌టిపిసి తరువాత రెండవదిగా, తమది భారత దేశంలోనే అతి పెద్ద ధర్మల్ పవర్ ఉత్పత్తిదారుగా పేర్కొంది. అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ కూడా పునరుత్పాదక ఇంధన రంగంలో అతి పెద్ద భాగస్వామిగా ఉంది.
వ్యవసాయ వినియోగదారులు, రైతులకు లభించే సబ్సిడీలపై ప్రజల్లో వ్యతిరేక అభిప్రాయాన్ని కలిగించడం భారత కార్పొరేట్ల, పాలక వర్గాల లక్ష్యంగా ఉంది. కార్మికులు, కర్షకుల ఐక్య పోరాటాల ద్వారా తమకు ఎదురైన నష్టాల నుండి బయట పడేందుకు వారు ప్రయత్నిస్తున్నారు. స్మార్ట్ మీటర్లు దీనిలో భాగమే. అది ప్రీపెయిడ్ మీటర్లకు నాంది పలికింది. వీటికి అంగీకరించకపోతే దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామజ్యోతి యోజన వంటి పథకాలు, ప్రభుత్వ స్కీములలో, సబ్సిడీలతోపాటు నిధుల కేటాయింపుల్లో కూడా కోతలు విధిస్తామని కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలను బెదిరిస్తోంది. స్మార్ట్ మీటర్లను ప్రతి ఆరు సంవత్సరాలకు ఒకసారి మార్చాల్సి వస్తుంది. ఫలితంగా సుమారు రెండు లక్షల కోట్ల రూపాయల భారీ వ్యయం రాష్ట్రాల పైన, వినియోగదారులపైనా పడుతుంది. అదే సమయంలో విద్యుత్ రంగంలోని దిగ్గజ కంపెనీల ఖజానాలు నిండుతాయి. ప్రీ పెయిడ్ మీటర్లు సున్నాకు చేరుకుంటే, అది తక్షణం వినియోగం నుండి తొలగించాల్సి ఉంటుంది. తిరిగి కనెక్షన్ పొందడానికి రూ.500 చెల్లించాల్సి ఉంటుంది.
ప్రధానంగా వేసవి, కరువు పరిస్థితులలో పంటలకు నీరందాల్సిన సమయంలో ఇటువంటి పరిస్థితి ఏర్పడితే ఎలా ఉంటుందో ఊహించండి. ఈ విధానాన్ని అమలు చేసిన కాలిఫోర్నియాలో గడ్డకట్టే చలికాలంలో, హీటర్ల వాడకం తప్పనిసరైన వేళ ప్రజానీకానికి విద్యుత్ సరఫరా చేయడానికి కంపెనీలు నిరాకరించాయి. రేట్లు ఎక్కువగా పెంచి అదనంగా చెల్లించిన వారికే కరెంటు ఇచ్చారు. లాభాలను ఆర్జించాలనే ఉద్దేశంతో మాత్రమే నడిపే కంపెనీలు, ప్రజల సమస్యలపై కనీసం ఆందోళన చెందవు. ఇది తీవ్రమైన పరిస్థితులకు దారితీయవచ్చు. వినియోగదారులు అనివార్యంగా, అదనంగా చెల్లించే విధంగా చేస్తారు. ఇవే విధానాలు కొనసాగితే, మన దేశంలోనూ అటువంటి పరిస్థితి ఏర్పడదని గ్యారంటీ ఏమీ లేదు. 2025 ఏప్రిల్ నాటికి వ్యవసాయ ఫీడర్లన్నిటినీ వేరు చేయడం, బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ లక్ష్యం. గడువులోగా దానిని చేరుకోవడానికే బెదిరింపులకు పాల్పడుతోంది. వారి బెదిరింపులకు లొంగని రాష్ట్రాలకు, కేటాయింపుల్లో, సబ్సిడీలలో కోత విధిస్తుంది.
ఈ విధానాల వల్ల రైతులకు ఒరిగేదేమిటి? అన్ని గొట్టపు బావులు, నీటిపారుదల మోటార్లు, స్మార్ట్ మీటర్లతో అనుసంధానిస్తారు. మీటరును మార్చడానికి ప్రతి ఆరు సంవత్సరాలకు ఒకసారి పునరావృతమయ్యే ఖర్చు రూ.15 వేలు వినియోగదారులపై పడుతుంది. ఇది రైతులకు, పేదలకు ఇచ్చే ఉచిత విద్యుత్ శాశ్వత రద్దుకు దారితీస్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రస్తుతం చేస్తున్న విధంగా, ప్రత్యక్ష నగదు బదిలీ వంటివి తాత్కాలిక ప్రలోభాలుగానే మారతాయి. విజయనగరంలో రైతులు 3 హెచ్‌పి పంపునకు నెలకు రూ.7,500 వస్తున్నట్లు చెబుతున్నారు. అయితే, వైసిపి ప్రభుత్వం రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, రైతుల ఖాతాలకు నేరుగా నగదు జమ అవుతుందని చెబుతోంది. అయితే, దీనికి గ్యారంటీ ఏమిటి? అందుకే ఈ విధానం వ్యవసాయానికి, ఆహార భద్రతకు మరణ శాసనం అవుతుంది. ఇది అన్ని వర్గాలు ఏకమై ప్రతిఘటించాల్సిన విషయం. కేరళ ఎల్‌డిఎఫ్ ప్రభుత్వం టోటెక్స్ (టోటల్ ఎక్స్‌పెండీచర్ మోడల్) నమూనా, స్మార్ట్ మీటర్లను నిరోధించడానికి మార్గాన్ని చూపింది. రైతులు, వినియోగదారులపై ప్రతికూల ప్రభావం పడే విధానాలను అనుమతించబోమని కేరళ ప్రభుత్వం తేల్చిచెప్పింది. కేంద్రప్రభుత్వం నిర్దేశించిన రోడ్ మ్యాప్‌తో రహస్యంగా ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించిన ఉన్నతాధికారుల బుకాయింపులను, మోసం చేసే కేంద్ర ప్రభుత్వ ప్రయత్నాలను సిఐటియు, ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సకాలంలో బయట పెట్టాయి. ఇటువంటి ప్రతిఘటనలు మరెన్నో రావాలి. విధ్వంస చర్యలకు, మోసంతో కూడిన కార్పొరేట్ దోపిడీకి వ్యతిరేకంగా అందరం ఏకం కావాలి.
వ్యాసకర్త : డా|| విజూకృష్ణన్, ఎఐకెఎస్ జాతీయ కార్యదర్శి