ప్రజాశక్తి – అద్దంకి
పట్టణంలోని వివిధ ప్రజా సమస్యలపై పట్టణ ప్రజా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, అఖిలపక్షం ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ బి శ్రీనివాసులుకు బుధవారం వినతి పత్రం అందజేశారు. పట్టణ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు మన్నం త్రిమూర్తులు, ప్రజారోగ్య వేదిక అధ్యక్షులు కావూరి రఘు చంద్, కాంగ్రెస్ నాయకులు కోరే సురేంద్రనాథ్, సిపిఎం మండల కార్యదర్శి తంగిరాల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ పట్టణంలో అనేక సమస్యలు ప్రజలను అన్ని విధాల వెంటాడుతున్నాయని అన్నారు. తమ పరిధిలో పరిష్కారం అయ్యే పనులకు తక్షణం పరిష్కారం చూపాలని కోరారు. సంబంధిత అధికారులతో చర్చించి సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. రెండు సంవత్సరాల కిందట ఇంటింటికి త్రాగునీటి కులాయిలో భాగంగా పగలగొట్టిన సిమెంట్ రోడ్లు రిపేర్ చేయాలని కోరారు. 15ఏళ్ల కిందట నామ్ రోడ్డు నిర్మాణ పనులు చేపట్టి నేటికీ అస్తవ్యస్త పనులతో నేటికీ నిర్మాణ పనులు పూర్తికాకుండా రోడ్డు ఫాల్స్ నిర్మాణ పనులతో 200మందికిపైగా ప్రమాదాల్లో అమాయకులు మృత్యువాత పడి వికలాంగులుగా ఉన్నారని అన్నారు. పట్టణంలోని నామ్ రోడ్డులో కొంతవరకైనా ప్రమాదాల నివారించుటకు కొన్ని మార్గదర్శక సూత్రాలను అవలంబింప చేయమని, రోజు రోజుకీ వేస్ట్ డంపుగా మారిపోతున్న జీవనది గుండ్లకమ్మను ప్రస్తుత సమస్యల నుండి ప్రక్షాళన చేయాలని కోరారు. మున్సిపాలిటీ అయిన తర్వాత కూడా 80సంవత్సరాల నుండి సౌకర్యాలు లేని ఇరుక గదిలో గ్రంధాలయం కొనసాగుతున్నదని అన్నారు. దీనికి శాశ్వత నూతన గ్రంథాలయ భవనంకు చర్యలు పట్టాలని కోరారు. దోమల బెడదను అరికట్టాలని కోరారు. అంతర్గత రోడ్లు ప్రారంభంలో ఉన్న విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లతో ట్రాఫిక్ ఇబ్బందులు కలుగుతున్నాయని తెలిపారు. రోడ్ల మలుపు వద్ద సూచికలు లేకపోవుట వలన ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు. ట్రాఫిక్‌కు అడ్డంగా ఉన్న ట్రాన్స్‌ఫార్మర్లను అక్కడి నుండి మార్చాలని కోరారు. స్టేట్ బ్యాంకు మెయిన్ బ్రాంచ్ దగ్గర, రాంనగర్, నాగులపాడు వద్ద ఉన్న ట్రాన్స్‌ఫార్మర్లను మార్చాలని కోరారు. సమస్యలు పరిష్కరించకుంటే ఆందోళన చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. కార్యక్రమంలో దాస భారతీయ జానపద కళాక్షేత్రం అధ్యక్షులు చెన్నుపల్లి నాగేశ్వరరావు, రావూరి రంగయ్య, కెఎల్డి ప్రసాద్ పాల్గొన్నారు.