సమస్యల పరిష్కారమే ఎస్‌ఎఫ్‌ఐ లక్ష్యం

Nov 29,2023 21:35

ప్రజాశక్తి -పూసపాటిరేగ : విద్యారంగ సమస్యల పరిష్కారమే ఎస్‌ఎఫ్‌ఐ లక్ష్మమని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు సిహెచ్‌ వెంకటేష్‌ అన్నారు. మండల కేంద్రంలో బుధవారం ఎస్‌ఎఫ్‌ఐ మండల మహా సభలు నిర్వహించారు ఆయన మాట్లాడుతూ ఎస్‌ఎఫ్‌ఐ 1970 నుంచి అలుపెరుగని పోరాటాలు చేస్తుందన్నారు. గత సంవత్సర కాలంలో మన జిల్లాలో అనేక సమస్యల పైన చేసిన పోరాటాల్లో ఎస్‌ఎఫ్‌ఐ విజయాలు సాధిస్తూ వచ్చిందన్నారు. సైకిల్‌ యాత్రలో గుర్తించిన సమస్యలను పరిష్కారం చేసుకోవడానికి నిరాహార దీక్షలు చేసి అధికారులు సమస్యలను పరిష్కరించేలా చేశామని అది ఎస్‌ఎఫ్‌ఐ పోరాట తత్వానికి నిదర్శనమని కొనియాడారు. జిల్లాలో సంక్షేమ హాస్టల్‌లో మౌలిక సదుపాయాలు కల్పించాలని, మెస్‌ ఛార్జీలు పెంచాలని, ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు నియోజకవర్గ కేంద్రంలో ఏర్పాటు చేయాలని, ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు లేని మండలాల్లో ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ఏర్పాటు చేయాలని, గిరిజన విశ్వవిద్యాలయానికి నిధులు కేటాయించి నిర్మాణం ప్రారంభించాలని డిమాండ్‌ చేశారు. నూతన మండల కమిటీని ఎన్నుకున్నామని చెప్పారు. డిసెంబర్‌ 16, 17 తారీకుల్లో ఇదే నియోజకవర్గంలో జరగనున్న ఎస్‌ఎఫ్‌ఐ 31వ జిల్లా మహాసభలను విద్యార్థులు, ప్రజలు, మేధావులు జయప్రదం చేయాలని కోరారు.నెల్లిమర్లలో జరిగే ఈ మహాసభలకు ఈ మండలం నుంచి మండల మహాసభ ఎన్నుకోబడిన ప్రతినిధులు హాజరవుతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కమిటీ సభ్యులు రఘు, మండల నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

➡️