ఛండీగడ్: విజయ్ హజారే వన్డే టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ జట్టు మరో ఓటమిని చవిచూసింది. మంగళవారం జరిగిన గ్రూప్-డి నాల్గో లీగ్ మ్యాచ్‌లో ఆంధ్ర జట్టు 38పరుగుల తేడాతో రాజస్తాన్ చేతిలో ఓడింది. తొలిగా బ్యాటింగ్‌కు దిగిన రాజస్తాన్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 290పరుగులకు ఆలౌటైంది. అభిజిత్ థోమర్(124) సెంచరీకి తోడు రామ్ మోహన్(52) అర్ధసెంచరీతో రాణించారు. తపస్వీకి నాలుగు, శశికాంత్, బి. కుమార్‌కు రెండేసి వికెట్లు దక్కాయి. ఛేదనలో ఆంధ్ర జట్టు 4.4ఓవర్లలో 252పరుగులకు ఆలౌటైంది. అశ్విన్ హెబ్బర్(68), హనుమ విహారి(60) మాత్రమే బ్యాటింగ్‌లో రాణించారు. అనికిత్ చౌందరికి నాలుగు, రాహుల్ చాహర్, సుతార్‌కు మూడేసి వికెట్లు దక్కాయి. హైదరాబాద్‌కు నిరాశ.. గ్రూప్-బిలో హైదరాబాద్ జట్టు మళ్లీ నిరాశపరిచింది. సర్వీసెస్ చేతిలో హైదరాబాద్ జట్టు 6వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. తొలిగా బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్ జట్టు 50 ఓవర్లలో 210పరుగులకే కుప్పకూలగా.. ఆ లక్ష్యాన్ని సర్వీసెస్ జట్టు 40.5ఓవర్లలో 4వికెట్ల నష్టానికి 211పరుగులు చేసి విజయం సాధించింది.