మరోసారి గవర్నర్‌ తీరుని నిలదీసిన కేరళ ప్రభుత్వం

Nov 29,2023 16:47 #Governor, #kerala, #Supreme Court

న్యూఢిల్లీ :   రాష్ట్ర గవర్నర్‌ ఆరిఫ్‌ ఖాన్‌ ఏడు బిల్లులను రాష్ట్రపతికి ఆమోదం కోసం రిజర్వు చేయడాన్ని కేరళ ప్రభుత్వం సుప్రీంకోర్టులో మరోసారి  నిలదీసింది. గవర్నర్లు బిల్లులను నిరవధికంగా నిలిపివేయడం సరికాదని  ఇటీవల సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.   దీంతో విచారణకు  ఒక్కరోజు ముందు గవర్నర్ కేరళ ప్రజారోగ్య బిల్లుకు ఆమోదం తెలిపారు.  మిగిలిన ఏడు బిల్లలును రాష్ట్రపతి  ఆమోదం కోసం రిజర్వు చేశారు.

గవర్నర్‌ వైఖరిపై కేరళ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌లపై బుధవారం సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఈ బిల్లులను రిజర్వ్‌ చేయడానికి కారణం లేదని కేరళ ప్రభుత్వం తరపున వాదనలు వినిపించిన సీనియర్‌ న్యాయవాది కె.కె. వేణుగోపాల్‌ కోర్టుకు తెలిపారు. కొన్ని బిల్లులు రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 213 ప్రకారం గవర్నర్‌ ఆర్డినెన్స్‌లుగా జారీ చేసినవని అన్నారు. ప్రస్తుత అటార్నీ జనరల్‌ ఆర్‌. వెంకట రమణి కేరళ పరిస్థితులపై చేసిన వాదనను కూడా వేణుగోపాల్‌ తీవ్రంగా వ్యతిరేకించారు. అక్షరాస్యత, ప్రజారోగ్య సంరక్షణలో కేరళ ప్రభుత్వం నెంబర్‌ వన్‌గా ఉందని, ఎజి ఆరోపణలు అవివేకంగా ఉన్నాయని అన్నారు.ప్రస్తుత పిటిషన్‌ను విస్తృత పరిచేందుకు సవరణ దరఖాస్తును సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ అంశాన్ని సవరణ దరఖాస్తులో చేర్చేందుకు సుప్రీంకోర్టు అనుమతించింది.

➡️