- ఎట్టకేలకు బయటకు సొరంగంలో చిక్కుకున్న 41 మంది కార్మికులు బాహ్య ప్రపంచంలోకి
- 17 రోజుల వ్యథాభరిత ఉత్కంఠకు తెర
- ర్యాట్ హోల్ మైనర్లదే కీలక పాత్ర
డెహ్రాడూన్ : సరిగ్గా 17రోజుల క్రితం కుప్పకూలిన ఉత్తర కాశీ సొరంగంలో చిక్కుకుపోయిన 41మంది కార్మికులను ఎట్టకేలకు సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ‘ర్యాట్‌హౌల్’ టెక్నిక్ ఫలించడంతో పైపు ద్వారా కార్మికులందరూ ఒకరి తరువాత ఒకరు బాహ్య ప్రపంచంలోకి వచ్చారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నిపుణుల బృందాలు, అధికార యంత్రాంగం రాత్రనకా పగలనకా శ్రమించి, 400గంటలకు పైగా ముమ్మరంగా కొనసాగించిన సహాయక చర్యలు ఫలించాయి. రాత్రి 8గంటలకు మొదట కార్మికుడు బయటకు రాగా, మొత్తంగా అందరినీ బయటకు తీసుకురావడానికి మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుందని అధికారులు అంచనా వేసినా ఒక గంటలోనే అందరినీ విజయవంతంగా బయటకు తీసుకువచ్చారు. బయటకు తీసుకొచ్చిన వెంటనే వారిని అప్పటికే సిద్ధం చేసి వుంచిన అంబులెన్సుల ద్వారా ఆస్పత్రులకు తరలించారు. వారి శారీరక, మానసిక ఆరోగ్యాలను ఎప్పటికప్పుడు తనిఖీ చేసేందుకు అక్కడ డాక్టర్లు సిద్ధంగా వున్నారు.
ఉత్తరకాశీ జిల్లాలోని సిల్క్‌యారా వద్ద సొరంగం నిర్మాణ పనులు జరుగుతుండగా, ఈ నెల 12న ఒక్కసారిగా సొరంగం కుప్పకూలడంతో 41మంది కార్మికులు లోపల చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే. అప్పటి నుండి వారిని వెలుపలకు తీసుకొచ్చేందుకు అనేక రకాలుగా ప్రయత్నించారు. సొరంగం ముఖ ద్వారం వద్ద భారీగా పడివున్న శిధిలాల దిబ్బలను తొలగించే క్రమంలో అధికారులకు అనేక సవాళ్లు ఎదురయ్యాయి. నేలకు సమాంతరంగా తవ్వుతున్న పనులకు పదే పదే ఆటంకాలు ఏర్పడి ముందుకు సాగకపోవడంతో నిలువుగా కొండను తవ్వేందుకు కూడా సిద్దపడ్డారు. సొరంగానికి అడ్డంగా కూలిన శిథిలాల దిబ్బలను తొలగించేందుకు రప్పించిన అగర్ యంత్రం కూడా అనేకసార్లు సతాయించడంతో అధికారులకు ఈ తొలగింపు చర్యలు సవాలుగా మారాయి. సొరంగంలో 57 మీటర్ల వద్ద శిధిలాల తొలగింపులో యంత్రాలు పనిచేయకపోవడంతో ర్యాట్ హోల్ మైనర్ల సాయంతో మాన్యువల్ డ్రిల్లింగ్ చేపట్టి విజయవంతంగా పూర్తి చేశారు.
కార్మికులు బయటకు వచ్చిన వెంటనే ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ దామి, కేంద్ర సహాయ మంత్రి జనరల్ రిటైర్డ్ వి.కె.సింగ్ వారిని కలుసుకున్నారు. వారిని పూలమాలలతో సత్కరించి, ఆలింగనం చేసుకుని పరామర్శించారు. తమ వారి కోసం కళ్లలో వత్తులు వేసుకుని సొరంగం వద్ద వేచి చూస్తున్న వారి కుటుంబ సభ్యుల సంతోషానికి అవధుల్లేకపోయాయి.
మీ ధైర్యం, ఓర్పు స్ఫూర్తినిస్తున్నాయి ! : ఆ 41 మందికి ప్రధాని మోడీ సందేశం
ఉత్తరకాశీ సొరంగం నుండి విజయవంతంగా బయటపడిన 41మంది కార్మికులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోడీ అభినందించారు. అత్యంత క్లిష్టంగా సాగిన ఈ 17రోజుల కాలంలో వారు చూపిన ధైర్యం, ప్రదర్శించిన ఓర్పు ప్రతి ఒక్కరికీ స్ఫూర్తినిస్తున్నాయని ప్రధాని ప్రశంసించారు. బయటపడిన ప్రతి ఒక్కరూ మంచి ఆరోగ్యంతో బాగుండాలని అభిలషించారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌లో పోస్టు పెట్టారు. సుదీర్ఘమైన నిరీక్షణ తర్వాత మన మిత్రులందరూ వారి కుటుంబ సభ్యులను కలుసుకోవడం చాలా సంతృప్తిని కలిగించిందని వ్యాఖ్యానించారు. ఈ సంక్లిష్ట సమయంలో కుటుంబ సభ్యులు చూపిన సంయమనాన్ని కూడా మరిచిపోలేమన్నారు. అత్యంత క్లిష్టమైన సవాళ్ళతో, ప్రతికూల పరిస్థితుల మధ్య సాగిన ఈ రెస్క్యూ ఆపరేషన్‌లో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరికీ అభివాదం చేస్తున్నానని మోడీ ఆ పోస్ట్‌లో పేర్కొన్నారు. మానవత్వానికి, సమిష్టి నాయకత్వానికి అద్బుతమైన ఉదాహరణగా ఈ కార్యక్రమం, ఇందులో పాల్గొన్నవారు నిలిచారని ప్రశంసించారు.
కార్మికులకు సిపిఎం అభినందనలు
ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీ టన్నెల్‌లో 17 రోజులపాటు ధైర్యంగా, ప్రశాంతంగా ఉండి బయటకు వచ్చిన 41 మంది కార్మికులకు సిపిఎం అభినందనలు తెలిపింది. దుర్భరమైన పరిస్థితుల్లో తవ్వకాల జరిపి, వారిని సొరంగం నుంచి బయటకు తీసుకొచ్చిన కాంట్రాక్టు కార్మికులను హీరోలుగా అభివర్ణించింది. రెస్క్యూ ఆపరేషన్‌లో పనిచేసిన అన్ని టీమ్‌లకు, ఏజెన్సీలకు అభినందనలు తెలిపింది. సెన్సిటివ్ జోన్‌లలో సొరంగాల తవ్వేటప్పుడు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించింది.