ప్రజాశక్తి – బాపట్ల
నియోజకవర్గంలో ఇసుక మాఫియా ఆగడాలకు అంతులేదని మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి అన్నారు. ఆయన తన నివాస గృహంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అసైన్డ్ భూములు లీజులు తీసుకొని ఇష్టానుసారంగా ఇసుక తవ్వకాలు చేస్తున్నారని అన్నారు. దీనిపై అధికారులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. గంజాయి వాడకం పెరిగిపోయి యువతలో అనేక పెడ ధోరణులకు దారితీస్తుందని అన్నారు. వీటిని పోలీసులు కట్టడి చేయాల్సిన అవసరం ఉందన్నారు. బాపట్ల నియోజకవర్గంలోని మూడు మండలాల్లో ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగలేదని అన్నారు. ఎన్నికల హామీ ప్రకారం ప్రతి పార్లమెంట్ స్థానాన్ని జిల్లా చేయడం, మెడికల్ కళాశాల ఏర్పాటు పాలసీ మేటర్ అన్నారు. బాపట్ల జిల్లాగా ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. ప్రతి గ్రామ పంచాయితీకి సచివాలయం, ఆర్బికె ఏర్పాటు చేయడం స్వాగతించ దగ్గ విషయమని తెలిపారు. సమావేశంలో గాదె మధుసూదనరెడ్డి, అల్లం గోపీకృష్ణ, గోవతోటి విజయ్, రోటరీ క్లబ్ మాజీ అధ్యక్షులు జిట్టా శ్రీనివాసరావు, గిరిజా రాణి, పాటిబండ్ల శేఖర్, చింతా కిషోర్ పాల్గొన్నారు.