కార్మికులకు రెండు మీటర్ల దూరంలో సహాయక బృందం

Nov 29,2023 08:41 #Uttarkashi tunnel, #workers

న్యూఢిల్లీ   :  ఉత్తరాఖండ్‌లోని సిల్కియారా టన్నెల్‌లో చిక్కుకున్న కార్మికులను రక్షించేందుకు చేపడుతున్న సహాయకచర్యలు తుది దశకు చేరుకున్నాయి. మరో ఏడుఅడుగులు (రెండు మీటర్లు) డ్రిల్లింగ్‌ మాత్రమే మిగిలి ఉందని ఎన్‌డిఆర్‌ఎఫ్‌ సభ్యులు, లెఫ్టినెంట్‌ జనరల్‌ (రిటైర్డ్‌) సయ్యద్‌ అటా హుస్సేన్‌ మంగళవారం తెలిపారు. సహాయక బృందం శిథిలాలను తొలగిస్తున్నారని అన్నారు. ఈ సందర్భంగా ‘ర్యాట్‌ హోల్‌ మైనింగ్‌’ బృందానికి కృతజ్ఞతలు తెలిపారు.

కార్మికులను చేరుకునేందుకు కొంతదూరమే మిగిలి ఉందని, రాత్రి నుండి కార్మికులు నిరంతరం శ్రమించి 58 మీటర్లు డ్రిల్లింగ్‌ చేపట్టారని లెఫ్టినెంట్‌ సయ్యద్‌ తెలిపారు. తమకు బయటి శబ్దాలు వినిపిస్తున్నాయని చిక్కుకున్న కార్మికులు తెలిపారని ఆయన వివరించారు. టన్నెల్‌కి సమీపంలోని చిన్యాలిసౌర్‌లో మెడికల్‌ సెంటర్‌ను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. వైమానిక సిబ్బంది చినూక్‌ హెలికాఫ్టర్‌ (హెవీ లిఫ్ట్‌ చాపర్‌) ని సిద్ధం చేసినట్లు తెలిపారు. అత్యవసర చికిత్స కోసం కార్మికులను రిషికేస్‌లోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌కు ఈ హెలికాఫ్టర్‌ ద్వారా తరలిస్తామని చెప్పారు. అయితే రాత్రి సమయంలో వినియోగించడం కుదరదని అన్నారు.

➡️