చండీఘర్ : రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యుఎఫ్‌ఐ) ఎన్నికలపై పంజాబ్ మరియు హర్యానా హైకోర్టు విధించిన స్టేను సుప్రీంకోర్టు మంగళవారం రద్దు చేసింది. మొత్తం ఎన్నికల ప్రక్రియను ఎలా నిర్వీర్యం చేసిందో అర్థం చేసుకోవడంలో హైకోర్టు విఫలమైనట్లు జస్టిస్ అభయ్ ఎస్.ఓకా, జస్టిస్ పంకజ్ మిథాల్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం వ్యాఖ్యానించింది. రివైజ్డ్ నోటిఫికేషన్ జారీ చేసి ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని ఎన్నికల కమిషన్‌ను ఆదేశించింది.
” హర్యానా రెజ్లింగ్ అసోసియేషన్ దాఖలు చేసిన రిట్ పిటిషన్ పెండింగ్‌లో ఉంది. మధ్యంతర ఉత్తర్వులతో హైకోర్టు డబ్ల్యుఎఫ్‌ఐ ఎన్నికలపై స్టే విధించింది. హైకోర్టు ఎన్నికల ప్రక్రియను ఎలా నిర్వీర్యం చేసిందో అర్థం చేసుకోవడంలో విఫలమైంది. రిట్ పిటిషన్ ఫలితాలను అనుసరించి ఎన్నికల నిర్వహణకు అనుమతించడమే సరైన మార్గం. పిటిషన్‌లో జారీ చేసే ఆదేశాలకు లోబడి ఎన్నికల ఫలితాలు ఉంటాయని మేము స్పష్టం చేస్తున్నాం ” అని ధర్మాసనం పేర్కొంది.
డబ్ల్యుఎఫ్‌ఐ ఎన్నికలపై హైకోర్టు విధించిన స్టేను సవాలు చేస్తూ అడహక్ కమిటీ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు గతంలో కేంద్రం, ఇతరుల ప్రతిస్పందనను కోరిన సంగతి తెలిసిందే. డబ్ల్యుఎఫ్‌ఐ ఎన్నికలను రద్దు చేస్తూ సెప్టెంబర్ 25న పంజాబ్ మరియు హర్యానా హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ అడహక్ కమిటీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. డబ్ల్యుఎఫ్‌ఐని నియంత్రించేందుకు భారత ఒలింపిక్ సంఘం తాత్కాలికంగా అడహక్ కమిటీని నియమించింది.