- కార్మిక, కర్షక మహాధర్నాలో వక్తల పిలుపు
- వంతపాడుతున్న పార్టీలు ఆలోచించుకోవాలి
- ఉత్సాహంగా పాల్గొన్న కార్మికులు, రైతులు
రైతుల, కార్మికుల, వ్యవసాయ కార్మికుల బతుకులపై ముప్పేటా దాడి చేస్తున్న కేంద్రంలో మోడీ ప్రభుత్వాన్ని వచ్చే ఎన్నికల్లో గద్దె దించాలని ఎపి కార్మిక సంఘాల ఐక్య వేదిక, ఎపి రైతు సంఘాల సమన్వయ సమితి సోమవారం విజయవాడలో నిర్వహించిన సంయుక్త మహా ధర్నా పిలుపునిచ్చింది. రాజ్యాంగాన్ని, లౌకిక, ప్రజాస్వామ్యాన్ని, పౌరుల హక్కులను కాలరాస్తున్న బిజెపి ఓటమి లక్ష్య సాధనలో తొలిమెట్టు ఈ మహాధర్నా అని పేర్కొంది. మోడీ వినాశకర విధానాలతో దేశం ప్రమాదంలో పడిందని, బిజెపిని ఓడించి దేశాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత కార్మిక, కర్షకులపై ఉందని ధర్నాలో ప్రసంగించిన కార్మిక, కర్షక నేతలు నొక్కి చెప్పారు. మోడీ విధానాలను చంకనేసుకొని మోస్తున్న ఈ రాష్ట్రంలోని పార్టీలు వాస్తవాలు తెలుసుకొని ప్రజలతో కలిసి రావాలని, లేకపోతే ఆయా పార్టీలకు సైతం బుద్ధి చెబుతారని హెచ్చరించారు. మోడీ ప్రభుత్వం తెచ్చిన మూడు నల్ల వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీ సరిహద్దులో రైతులు సంవత్సరంపాటు వీరోచితంగా ఉద్యమించి వెనక్కికొట్టారు. చట్టాల రద్దు సందర్బంలో కేంద్ర సర్కారు రైతులకు ఇచ్చిన హామీలు నేటికీ అమలు కాలేదు. దాంతో నాడు రైతు పోరాటం ప్రారంభించిన నవంబర్ 26 స్ఫూర్తితో దేశ వ్యాప్తంగా ఆందోళనలకు ట్రేడ్ యూనియన్లు, సంయుక్త కిసాన్ మోర్చా పిలుపునిచ్చాయి. అందులో భాగంగా విజయవాడ జింఖానా గ్రౌండ్స్‌లో 27,28 తేదీలలో రెండు రోజుల రాష్ట్ర స్థాయి మహాధర్నా చేపట్టారు. ధర్నాకు రైతు సంఘాల కన్వీనర్, మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు, కార్మిక సంఘాల నేతలు జి. ఓబులేషు, సిహెచ్ నర్సింగరావు అధ్యక్షవర్గంగా వ్యవహరించారు. ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి- అమరావతి