ప్రజాశక్తి – పంగులూరు
తమ బ్యాంకు ద్వారా వ్యవసాయానికి విస్తారంగా రుణాలు ఇస్తున్నామని బ్యాంక్ ఆఫ్ బరోడా చిన్నమల్లవరం బ్రాంచ్ మేనేజర్ గడ్డం రవికుమార్ అన్నారు. రైతులు అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరారు. బ్యాంక్ ఆఫ్ బరోడా చిన్న మల్లవరం బ్రాంచ్ లో “ప్రజాశక్తి”తో సోమవారం ఆయన మాట్లాడారు. ఈ సంవత్సరంలో తమ బ్రాంచ్ ద్వారా రూ.50లక్షల వ్యవసాయ రుణాలు ఇచ్చామని తెలిపారు. వీటిలో రూ.7లక్షలతో ట్రాక్టర్ లోనూ రూ.50లక్షలతో నాలుగు కార్లు ఇచ్చామని తెలిపారు. వాటితో పాటు డ్వాక్రా మహిళలకు రూ.60లక్షలు, ఇతర రుణాలు రూ.20లక్షలు ఇచ్చినట్లు చెప్పారు. ఐదు ఎకరాల కన్నా ఎక్కువగా భూమి ఉన్న రైతులు తమ బ్యాంకు ద్వారా ఇంటి రుణాలు తీసుకోవచ్చని చెప్పారు. ఇల్లు తాకట్టు పెట్టి మార్టిగేజ్ లోన్లు, రెండున్నర ఎకరాలు ఉన్నవారికి ట్రాక్టర్ లోన్లు, నాలుగు ఎకరాల భూమి ఉన్నవారికి అగ్రికల్చర్ కారులోనూ ఇస్తున్నామని చెప్పారు. వీటికి ఆరు నెలలకు ఒకసారి పేమెంట్ చెల్లించే అవకాశం ఉందని తెలిపారు. క్రాప్‌లోన్లు అత్యధికంగా ఎకరానికి రూ.1.40లక్షలు ఇస్తున్నామని తెలిపారు. ఐదు సంవత్సరాలు కలిపి రూ.3లక్షల వరకు మార్టిగెజ్ చేయకుండా, రూ.3లక్షలు దాటితే మార్టిగేజ్ చేసుకొని క్రాప్ లోన్లు ఇస్తున్నామని అన్నారు. రూ.3లక్షలలోపు వ్యవసాయ రుణాలకు లక్షకు రూ.3వేలు సబ్సిడీ ఇస్తారని తెలిపారు. రుణం రికవరీ అయిన వెంటనే సబ్సిడీని లబ్ధిదారుని అకౌంటుకు జమ చేస్తామని చెప్పారు. బ్యాంకులో ఎక్కువ లావాదేవీలు జరుపుకునే కస్టమర్లకు ఫ్రీ అప్రూవ్డ్ పర్సనల్ లోన్లు మంజూరు చేస్తామని తెలిపారు. ఈ రుణాలు 15నిమిషాల్లోనే మంజూరు చేసి కస్టమర్ల అకౌంట్లో జమ చేస్తామని చెప్పారు. తమ బ్యాంకు ద్వారా ఖాతాదారులకు అవసరమైన సేవలు అన్ని ఎలాంటి ఇబ్బందులు లేకుండా సత్వరమే అందిస్తున్నట్లు తెలిపారు.