ఈ మంచినీటి బావికి 84 ఏళ్ళు

Nov 27,2023 23:46

ప్రజాశక్తి – పంగులూరు
చుట్టుపక్కల గ్రామాల్లో ఎక్కడ మంచినీళ్లు దొరక్కపోయినా ఈ బావిలో మాత్రం మంచినీరు పుష్కలంగా ఉంటాయి. వేసవిలో కూడా కావాల్సినంత నీటిని అందిస్తూ పంగులూరు గ్రామ ప్రజలకు 8దశాబ్దాలకుపైగా దాహార్తిని తీరుస్తూ ఉంది. గ్రామంలోని పోలేరమ్మ గుడి వెనుక వైపున ఉన్న ఈ మంచినీటి బావిని 1941లో అప్పటి పంచాయతీ సర్పంచ్ బాచిన వీర రాఘవయ్య, ఉప సర్పంచ్ రావూరి బుల్లయ్య ఆధ్వర్యంలో నిర్మించారు. అప్పట్లో గ్రామంలో ప్రతి ఇంటిలో, ప్రతి వీధిలో బావులు ఉండేవి. అయితే గ్రామ ప్రజలు ఆ బావులు నీటిని వాడుకకు ఉపయోగించేవారు. త్రాగటానికి మాత్రం ఈ బావి నుండే గ్రామం మొత్తం నీటినీ తీసుకు వెళ్తుండేవారు. గ్రామ ఊర చెరువు ఒడ్డున దళిత కాలనీకి ఆనుకొని, చెరువుగట్టుపై తీసిన రెండు మంచినీటి బావుల నీరు కూడా బాగానే ఉండేవి. అయినా గ్రామం ప్రజలు మొత్తం కావిళ్ళతో మంచినీటిని తీసుకు వెళ్లేవారు. మధ్యలో ఒక సంవత్సరంలో కొద్ది రోజులు మాత్రం ఈ బావి ఎండిపోయింది. అంతకుమించి ఈ బావి ఎప్పుడు తాగునీటిని అందిస్తూనే ఉంది. ఇటీవల కాలంలో పంగులూరు రోటరీ క్లబ్ వారు ఈ బావినీటి ద్వారా మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేశారు. స్వచ్ఛమైన తాగునీటిని గ్రామ ప్రజలకు అందిస్తున్నారు. అయితే కొంతకాలంగా ఈ బావికి చుట్టూ నిర్మించిన బేషిన్ గచ్చు పగిలిపోయి శిధిలావస్థకు చేరింది. దీంతో రోటరీ క్లబ్ కమిటీ రూ.60వేలతో బావి బేషిన్‌కు పూర్తి మరమ్మతులు చేయించారు. రోటరీ గంగ ద్వారా గ్రామ ప్రజలందరికీ మంచినీటిని అందించేందుకు కార్యక్రమాన్ని చేపట్టినట్లు రోటరీ క్లబ్ అధ్యక్షులు కరణం హనుమంతరావు, కోశాధికారి గుర్రం ఆంజనేయులు, రోటరీ కన్వీనర్ చిలుకూరు వీర రాఘవయ్య తెలిపారు. పంగులూరు పంచాయతీలో ఇంత సుదీర్ఘ కాలం వాడుకలో ఉండి, ప్రజలకు తాగునీటిని అందిస్తున్న బావి ఇది ఒక్కటే అనడంలో ఎలాంటి సందేహం లేదు.

➡️