రైతు వద్దకు ధాన్యం చేరే దశలో తగ్గుతున్న ధరలు

Nov 27,2023 23:38

ప్రజాశక్తి – భట్టిప్రోలు
ఖరీఫ్‌లో రైతులు సాగుచేసిన వరి పంట చేతికందుతున్న తరుణంలో క్రమ క్రమంగా ధాన్యం ధరలు తగ్గుతున్నాయి. వేమూరు నియోజకవర్గంలో కొల్లూరు, వేమూరు అమర్తలూరు, చుండూరు, భట్టిప్రోలు మండలాల్లో వరి పైరు కోతకు సిద్ధమైంది. అక్కడక్కడ కోతలు కూడా ప్రారంభం అయ్యాయి. కొందరు రహదారి అనుకూలంగా ఉన్న ప్రాంతాల్లో హార్వెస్టర్లు వినియోగిస్తున్నారు. మరికొందరు మనుషుల ద్వారా కోతల కోస్తున్నారు. ఈ నేపథ్యంలో గత పది రోజుల క్రితం కొత్త ధాన్యం ధర 75కేజీల బస్తా రూ.1800 ఉండగా ప్రస్తుతం రూ.1500కు దిగజారిందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పెరిగిన వ్యవసాయ ధరలతో ధాన్యం ధరలు కూడా తగ్గితే నష్టాలు చవి చూడాల్సి వస్తుందని వాపోతున్నారు. ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాల ద్వారా కొనుగోలు చేస్తామని ప్రకటించినప్పటికీ ఆ మేరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వలన దళారులు రాజ్యం ఏలుతున్నారని ఆరోపిస్తున్నారు. పూర్తిస్థాయిలో వరి కోతలు సిద్ధమై రైతులు ధాన్యాన్ని నూర్పిడి చేసే సమయం వస్తే ధర మరింత తగ్గుతుందేమోనని భయ పడుతున్నారు. ప్రభుత్వం దీనిపై చర్యలు తీసుకొని మద్దతు తన ప్రకటించిన విధంగా కొనుగోలు చేస్తే తప్ప దళారులు గిట్టుబాటు ధరకు కొనే పరిస్థితి లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆ మేరకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు. ఈ ఏడాది అధిక శాతం రైతులు 5204 బీపీటీ వరి వంగడాన్ని సాగు చేశారు. గత ఏడాది బీపీటీలు రైతు భరోసా కేంద్రాల ద్వారా కొనుగోలు చేయడంలో జాప్యం జరగటం వలన సాధారణ రకాన్ని సాగు చేసేవారు. క్రమంగా బీపీటీకి ధాన్యం ధరలు పెరగటంతో ఈ ఏడాది రైతులు అధిక శాతం బీపీటీ వరి వంగడం వైపు మొగ్గుచూపారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉండి పంటలు ఆశాజనకంగా ఉన్నప్పటికీ ధాన్యం ధరలో ప్రైవేట్ మిల్లర్లు, వ్యాపారస్తులు ఇష్టానుసారంగా కొనుగోలు చేసి రైతులను మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతానికి వాతావరణ పరిస్థితులు అనుకూలంగానే ఉన్నప్పటికీ పూర్తిస్థాయిలో కోతలు ముగించుకుని కుప్పలు వేసే సమయానికి ఎలాంటి వాతావరణ పరిస్థితులు మారతాయోనని, ఓ ప్రక్క మదన పడుతుండగా మరోపక్క తగ్గుతున్న ధాన్యం ధరలు కలవర పెడుతున్నాయని రైతులు వాపోతున్నారు. ధాన్యం ధరలపై స్త్రీకరణ చేపట్టి మద్దతు ధర గిట్టుబాటు అయ్యే విధంగా ప్రభుత్వం చూడాలని కోరుతున్నారు.

➡️