ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలకు పేర్లు నమోదు చేసుకోండి

Nov 27,2023 21:42

లోగోలను విడుదల చేస్తున్న కలెక్టర్‌, తదితరులు

          పుట్టపర్తి అర్బన్‌ : ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలకు క్రీడా జట్లు తమ పేర్లను నమోదు చేసుకోవాలని కలెక్టర్‌ కోరారు. క్రీడా పోటీలకు సంబంధించిన లోగోలు కలెక్టర్‌ సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ డిసెంబర్‌ 15 తేదీ నుండి ఆడుదాం ఆంధ్ర క్రీడ పోటీలు ప్రారంభం అవుతాయన్నారు. రాష్ట్రంలో తొలిసారిగా గ్రామస్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు క్రికెట్‌, వాలీబాల్‌, కబడ్డీ, ఖోఖో, బ్యాట్‌మింటన్‌ క్రీడలు నిర్వహించడం జరుగుతుందన్నారు. డిసెంబర్‌ 15 నుంచి వచ్చే ఏడాది ఫిబ్రవరి 3వ తేదీ వరకు పోటీలు నిర్వహిస్తామన్నారు. ఈ పోటీలలో పాల్గొనుటకు ఈనెల 27 నుంచి డిసెంబర్‌ 13వ తేదీ వరకు రిజిస్ట్రేషన్లు చేయడం జరుగుతుందని చెప్పారు. పోటీలలో పాల్గొనుటకు జిల్లాకు చెందిన 15 సంవత్సరాలు నిండిన స్త్రీ, పురుషులు అర్హులన్నారు. రిజిస్ట్రేషన్ల నమోదు సమీప వార్డు సచివాలయాలలో వాలంటీర్‌ ద్వారా నమోదు చేసుకోవచ్చన్నారు. క్రీడలను ప్రోత్సహించడానికి క్రీడ స్ఫూర్తిని పెంచడానికి ప్రభుత్వం ఈ పోటీలను నిర్వహిస్తోందన్నారు. నియోజకవర్గ స్థాయిలో గెలుపొందిన ప్రథమ, ద్వితియ, తృతియ బహుమతులు అందజేస్తామన్నారు. అలాగే జిల్లా స్థాయి, రాష్ట్రస్థాయిలో గెలుపొందిన జట్లకు కూడా బహుమతులు ఉంటాయన్నారు. యువత క్రీడలలో పాల్గొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్‌ కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా క్రీడా సాధికారిక సంస్థ అధికారి ఉదరు భాస్కర్‌, గ్రామ వార్డు సచివాలయాల నోడల్‌ అధికారి శివారెడ్డి, బీసీ సంక్షేమ అధికారి నిర్మల జ్యోతి, డిపిఆర్‌ఒ వేలాయుధం తదితరులు పాల్గొన్నారు.

➡️