‘ఆడుదాం ఆంధ్రా’కు నేటి నుంచి రిజిస్ట్రేషన్లు : కలెక్టర్‌

ప్రజాశక్తి – రాయచోటి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోయే ఆడుదాం ఆంధ్ర క్రీడా సంబరానికి నేటి నుంచి జిల్లాలో రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయని కలెక్టర్‌ గిరీష పిఎస్‌ తెలిపారు. సోమవారం రాయచోటి కలెక్టరేట్‌లో ఆడుదాం ఆంధ్ర క్రీడోత్సవాల నిర్వహణపై కలెక్టర్‌ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ధతో రాష్ట్రవ్యాప్తంగా ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాలను ప్రతిష్టాత్మకంగా చేపట్టారు. ప్రతి సచివాలయం పరిధిలో వాలంటీర్లు రిజిస్ట్రేషన్‌ చేస్తారన్నారు. జిల్లాలోని 501 సచివాలయాల పరిధిలో డిసెంబర్‌ 15 నుంచి క్రీడల నిర్వహణకు శ్రీకారం చుడుతున్నామని చెప్పారు. ప్రతి ఒక్కరిని క్రీడల ద్వారా ఆరోగ్యకరమైన జీవన శైలిని ప్రోత్సహించడమే ఆడుదాం ఆంధ్ర ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ప్రతిభావంతులైన క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. 15 ఏళ్లు పైబడిన ఆసక్తి కలిగిన వారు వెబ్‌ సైట్‌, యాప్‌ ద్వారా నమోదు చేసుకోవచ్చునని చెప్పారు. సచివాలయ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు క్రీడల నిర్వహణ ఉంటుందని తెలిపారు. ఇందులో పురుషులు, మహిళలకు విడివిడిగా క్రీడలు నిర్వహిస్తారని తెలిపారు. డిసెంబర్‌ 15 నుంచి 2024 ఫిబ్రవరి 3 వరకు క్రికెట్‌, కబడ్డీ ఖోఖో, వాలీబాల్‌, బ్యాడ్మింటన్‌ 5 అంశాలలో క్రీడా పోటీలు జరుగుతాయని పేర్కొన్నారు. ఐదు క్రీడ అంశాలే కాకుండా స్థానికంగా డిమాండ్‌ మేరకు సాంప్రదాయ క్రీడలను కూడా నిర్వహించడానికి కషి చేస్తున్నట్లు చెప్పారు. సచివాలయం స్థాయిలో క్రీడలన్నీ 12 రోజులపాటు కొనసాగుతాయని ప్రతి సచివాలయంలో పురుషులు రెండు టీములు మహిళలు రెండు టీములు మొత్తంగా నాలుగు టీములు ఆడేలా షెడ్యూల్‌ వేశారన్నారు. క్రీడలలో ఆసక్తి కల్గిన ప్రజలు ఎవరైనా రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చు అన్నారు. సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు అర్హులు కారని తెలిపారు. సచివాలయం స్థాయిలో గెలుపొందిన జట్లకు మండల, నియోజకవర్గం, జిల్లా, రాష్ట్రస్థాయిలో పోటీలు జరుగుతాయని చెప్పారు. ఆసక్తి ఉన్న 15 ఏళ్లకు పైబడిన వారు ఇవాల్టి నుంచి సమీపంలోని గ్రామ లేదా వార్డు సచివాలయంలో, వాలంటీర్ల ద్వారా కానీ, aaసబసaఎaఅసష్ట్రతీa.aజూ.స్త్రశీఙ.ఱఅ వెబ్‌సైట్‌ ద్వారా లేదా యాప్‌ ద్వారా సులభతరంగా నమోదు చేసుకోవచ్చని చెప్పారు. సచివాలయం స్థాయి, మండల స్థాయిలో ఆడి గెలిచిన జట్లకు వారు ఆడిన క్రీడా కిట్లు ఇస్తారని తెలిపారు. గ్రామ, మండల స్థాయిలో విజేతలు నియోజకవర్గ స్థాయిలో ఆడతారని చెప్పారు. నియోజకవర్గంలో క్రికెట్‌, వాలీబాల్‌, కబడ్డీ, ఖోఖో నాలుగు అంశాల పోటీలలో విజేతలకు మొదటి బహుమతిగా రూ.35వేలు, రెండో బహుమతి రూ.15వేలు, మూడో బహుమతి రూ.10వేలు నగదు బహుమతి ఇస్తారని చెప్పారు. జిల్లాస్థాయి విజేతలకు మొదటి బహుమతి రూ. 60 వేలు, రెండో బహుమతి రూ. 30 వేలు, మూడో బహుమతి రూ. 10 వేలు. రాష్ట్రస్థాయి విజేతలకు మొదటి బహుమతి రూ. 5 లక్షలు, రెండో బహుమతి రూ.3 లక్షలు, మూడో బహుమతి రూ.2 లక్షలు ఇవ్వనున్నారని తెలిపారు. క్రీడలు ఆడేందుకు అవసరమైన అన్ని క్రీడా సామగ్రిని ఆయా మండలాలకు తరలించారని త్వరలో వాటిని సచివాలయాలకు తరలిస్తారని చెప్పారు. జనవరి 20 నుంచి జిల్లా కేంద్రంలోని క్రికెట్‌ స్టేడియంలో కూడా మూడు నాలుగు రోజులపాటు క్రీడలు జరిపేలా ఏర్పాట్లు చేస్తున్నారన్నారు. క్రికెట్‌, వాలీబాల్‌ కబడ్డీ, ఖోఖో, బ్యాడ్మింటన్‌ క్రీడలకు సంబంధించిన కిట్లు అన్ని వచ్చాయని వాటిని మండలాలకు చేర్చారని తెలిపారు. కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ ఫర్మన్‌ అహ్మద్‌ ఖాన్‌, మున్సిపల్‌ కమిషనర్‌ గంగా ప్రసాద్‌, జిల్లా స్పోర్ట్స్‌ అధికారి చంద్రశేఖర్‌ పాల్గొన్నారు.

➡️