రాష్ట్రజట్టులో స్థానం కొట్టు ముమ్మరంగా సాగిన మహిళా కబడ్డీ శిక్షణ క్యాంపు
నేటి నుంచే మహిళా కబడ్డీ రాష్ట్ర జట్టు ఎంపిక పోటీలు
ప్రజాశక్తి – గోనెగండ్ల : వాళ్లందరూ జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన గ్రామీణ పేద కుటుంబాల విద్యార్థినిలు.అయితేనేమి కబడ్డీ ఆట పై మక్కువతో కొందరు,ఆట ద్వారా ఉన్నత ఉద్యోగం సాధించాలని కొందరు జాతీయ జట్టుకు ఎంపికై భారత జట్టు తరఫున ఆడాలనే కోరికతో మరికొందరు గోనెగండ్లలో రాష్ట్రస్థాయి మహిళా కబడ్డీ జట్టు ఎంపిక పోటీల కొరకు నిర్వహిస్తున్న జిల్లాస్థాయి క్యాంపులో శిక్షణ పొందుతున్నారు. అలాంటి గ్రామీణ కబడ్డీ క్రీడాకారులపై ప్రజాశక్తి నేటి ప్రత్యేక కథనం.
మండల కేంద్రమైన గోనెగండ్ల లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మైదానంలో ఈనెల 29,30 డిసెంబర్ 01వ తేదీన70వ మహిళా కబడ్డీ పోటీలు కర్నూలు జిల్లా మరియు ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరగనున్నాయి.ఈ పోటీలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉమ్మడి 13 జిల్లాల నుంచి 180 మంది క్రీడాకారిణిలు హాజరుకానున్నారు.సుమారు 50 మంది సిబ్బంది హాజరై పోటీలను నిర్వహించనున్నారు.ఈ టోర్నమెంటులో అన్ని జిల్లాల నుంచి అత్యంత ప్రతిభ కనబరిచిన క్రీడాకారిణిలను గుర్తించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కబడ్డీ జట్టుకు ఎంపిక చేయనున్నారు.అందులో భాగంగా కర్నూలు జిల్లాలోని వివిధ మండలాల నుంచి 20 మందిని ఎంపిక చేసి మండల కేంద్రమైన గోనెగండ్ల లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మైదానంలో జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆర్గనైజింగ్ సెక్రెటరీలు కుబేర నాయుడు జాకీర్ హుస్సేన్ ఆధ్వర్యంలో గత కొద్ది రోజులుగా ప్రత్యేక శిక్షణా క్యాంపును ఏర్పాటు చేశారు.క్యాంపులో కబడ్డీ శిక్షకులు దేవేంద్ర ఇస్మాయిల్ శివ ప్రతిరోజు మెలకులు నేర్పుతున్నారు.వీరి శిక్షణతో రాటు తేలి రాష్ట్ర జట్టులో స్థానం సంపాదించడంతోపాటు తద్వారా పోలీసు,రైల్వే శాఖలో ఉన్నత ఉద్యోగాలు సాధించాలని కొంతమంది జాతీయ జట్టుకు ఎంపికై భారత జట్టు తరఫున ఆడాలని మరి కొంతమంది ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
భారత కబడ్డీ జట్టుకు ఆడటమే లక్ష్యం : వి కవిత, హెబ్బటం గ్రామం
నా పేరు వి కవిత హోలగుంద మండలం హెబటం గ్రామం.మా నాన్న తాపీ మేస్త్రి అమ్మ వ్యవసాయ కూలీ.నేను ఆదోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్నాను.కబడ్డీ అంటే నాకు చాలా ఇష్టం.నేను గతంలో అండర్-14,అండర్- 17 అండర్ -19 జూనియర్ నేషనల్ తో పాటు యూనివర్సిటీ కి కూడా ఆడాను.ప్రస్తుతం రాష్ట్ర స్థాయి మహిళా కబడ్డీ జట్టుకు ఎంపికై తద్వారా భారత మహిళా కబడ్డీ జట్టులో ఆడాలన్నదే నా లక్ష్యం.
ఎస్సై ఉద్యోగం సాధించడమే ధ్యేయం : పి రేవతి
మాది అనంతపురం జిల్లా.నేను కెవి సుబ్బారెడ్డి కళాశాలలో బిపిడి చేస్తున్నాను.కర్నూలు జట్టు తరపున జూనియర్, సీనియర్ నేషనల్,ఎస్జీఎఫ్, అండర్ -19 విభాగంలో ఆడాను. ప్రస్తుతం రాష్ట్ర జట్టులో చోటు సంపాదించి జాతీయ మహిళా జట్టుకు ఆడి ఎస్సై ఉద్యోగం సాధించాలన్నదే నా ధ్యేయం.
ఉన్నత ఉద్యోగం సాధించాలి : కోతిరాళ్ల నందిని, గోనెగండ్ల
నా పేరు కె నందిని మా నాన్న కోతి రాళ్ల వీరన్న అమ్మ ఉమామహేశ్వరి.మాది రైతు కుటుంబం.నేను ఆరేకల్ మహాత్మా జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలలో పదవ తరగతి చదువుతున్నాను.గతంలో జిల్లా స్థాయి పోటీలలో ఆడడంతో పాటు అండర్-14 విభాగంలో చిత్తూరు జిల్లాలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీలలో ప్రతిభ కనబరచి జాతీయ స్థాయికి కూడా ఎంపిక కావడం జరిగింది.ప్రస్తుతం ఈ క్యాంపులో మా కోచ్ లు నేర్పే మెలకువలు ద్వారా రాష్ట్ర జట్టుకు ఎంపికై జాతీయస్థాయిలో ఆడడంతో పాటు ఇండియన్ రైల్వేస్ లేదా పోలీసు శాఖలో ఉన్నత ఉద్యోగాన్ని సాధించాలన్నది నా కోరిక.
నేషనల్ ప్లేయర్ కావాలన్నదే : ఆశ కీర్తి, కులుమాల గ్రామం
నా పేరు కీర్తి.మాది గోనెగండ్ల మండలం కులుమాల గ్రామం. మా తల్లిదండ్రులది వ్యవసాయ కుటుంబం.నేను ఆరెకల్ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్నాను.నాకు అథ్లెటిక్స్ తో పాటు కబడ్డీ అంటే చాలా ఇష్టం.ఈ క్యాంపులో మా గురువులు ఇచ్చే శిక్షణ ద్వారా రాష్ట్ర జట్టుకు ఎంపికై కబడ్డీలో నేషనల్ ప్లేయర్ కావాలన్నదే నా ఆశ.