- కట్టుదిట్టమైన భద్రత నడుమ పర్యటన
ప్రజాశక్తి- తిరుమల : ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తిరుమలలో వెంకటేశ్వరస్వామిని సోమవారం దర్శించున్నారు. సంప్రదాయ వస్త్రధారణతో వచ్చిన ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ప్రధాని కొద్దిసేపు ఆలయంలో గడిపారు. ఆ తర్వాత ఆలయ పండితుల నుంచి ఆశీర్వాదాలు తీసుకున్నారు. శ్రీవారి ఆలయానికి వచ్చిన మోడీకి టిటిడి చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి మహాద్వారం వద్ద స్వాగతం పలికారు. టిటిడి ఇఒ ధర్మారెడ్డి శ్రీవారి పట్టువస్త్రంతో ప్రధానిని సత్కరించారు. తీర్థప్రసాదాలు, శ్రీవారి చిత్రపటం, 2024 టిటిడి కేలండర్, డైరీలను టిటిడి అధికారులు మోడీకి అందజేశారు. షెడ్యూల్ సమయం కంటే అర్ధగంట ముందే శ్రీవారిని మోడీ దర్శించుకున్నారు. అనంతరం అతిథి గృహానికి చేరుకున్నారు. మోడీ పర్యటన దృష్ట్యా అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. 2014లో ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోడీ 2015, 2017, 2019లో శ్రీవారిని దర్శించుకున్నారు. ఇప్పుడు నాలుగోసారి వచ్చారు.
- సాదర వీడ్కోలు
తిరుమల, తిరుపతి పర్యటన అనంతరం తిరుగు పయనమైన ప్రధాని మోడీకి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్.జవహర్‌రెడ్డి, డిజిపి రాజేంద్రనాథ్ రెడ్డి, జిల్లా కలెక్టర్ కె.వెంకటరమణారెడ్డి, జిల్లా ఎస్ప్పి పి.పరమేశ్వర రెడ్డి సాదర వీడ్కోలు పలికారు. తిరుపతి ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక నావికాదళ విమానంలో ప్రధాని తెలంగాణకు ఎన్నికల ప్రచారం నిమిత్తం వెళ్లారు.