పుట్టింట్లో ఓ వారం రోజులు గడిపి వెళ్దామని రామాపురం నుంచి రవీ, రజనీ వాళ్ళ అత్తయ్య సుభద్ర వచ్చింది. రవీ, రజనీ చాలా చురుకైన పిల్లలు. వాళ్లిద్దరూ అంటే సుభద్రకు ప్రాణం. కానీ, తాను వచ్చిన దగ్గర నుండీ తన అన్నా, వదినా దేనికో దానికి ఆ పిల్లలను కసురుకోవడం గమనించి చాలా బాధపడింది.ఆ రోజు.. ‘నాన్నా మా బడిలో వార్షికోత్సవం సందర్భంగా పోటీలు పెడ్తున్నారు. నాకు ఉపన్యాస పోటీలో పాల్గొనాలని ఉంది’ అని చెప్పారు పిల్లలు. ‘ఒరే రవీ… నీకసలే మొహమాటం ఎక్కువ. ఇక నువ్వేం మాట్లాడుతావు?’ అని కసిరాడు రవి తండ్రి రఘుపతి. ‘రజనీ నువ్వు వట్టి పిరికి గొడ్డువి. అక్కడ న్యాయ నిర్ణేతలను చూసి జడుసుకుని నీకు నోట మాట కూడా రాదు. ఇక నువ్వేం పోటీలో పాల్గొంటావు?’ అన్నది తల్లి సావిత్రి. పిల్లలిద్దరూ చాలా నిరాశపడి ముడుచుకుపోయారు. అది గమనించిన సుభద్ర ఆ సాయంత్రం పిల్లలిద్దరినీ తన దగ్గర కూర్చో బెట్టుకున్నది. వాళ్ళ ఆసక్తులు ఏమిటో, వాళ్ళ ప్రతిభ ఏమిటో, దేనికి భయపడ్తున్నారో, దేనికీ సిగ్గుపడ్తున్నారో గమనించింది. ‘పిల్లలూ! ఏదైనా విషయం పట్ల మనకు పూర్తి అవగాహన లేనప్పుడు మనలో కొన్ని అనుమానాలు, భయాలు చోటు చేసుకుంటాయి.
మీరు చిన్న పిల్లలు. మీకు అన్ని విషయాలు తెలియకపోవచ్చు. తెలియని విషయం తెలియదని ఒప్పేసుకుని, తెలియాల్సిన విషయాలను తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. ఏ విషయం పట్ల అయినా మనకు స్పష్టమైన అవగాహన ఉంటే మనలోని అనుమానాలు, భయాలు మటుమాయం అవుతాయి. మీరేమీ భయపడకండి. మీరు ఎలా ఉపన్యసించాలో నేను చెప్తాను’ అని ప్రోత్సహించింది. ‘ఉపన్యాస పోటీలో కేవలం మీరు చెప్పే అంశానికే కాదు, మీరు నిల్చున్న తీరుకు, మీరు వాడిన భాషకు కూడా మార్కులుంటాయి. మీరు మీ భావాలను వ్యక్తీకరించే తీరును కూడా న్యాయనిర్ణేతలు గమనిస్తారు. అసలు ఇలా ఉపన్యాస పోటీలు ఎందుకు పెడతారో తెలుసా? భవిష్యత్తులో మీరు ఎప్పుడు, ఎవరితో, ఎక్కడ ఏమి మాట్లాడాలన్నా ధైర్యంగా మాట్లాడానికే’ అని చెప్పింది. వాళ్ళు మాట్లాడాల్సిన అంశం గురించిన వివిధ అంశాలు వివరించింది. ‘ఇంకో విషయం గుర్తుంచుకొండి. ఏ పోటీలోనైనా యాభైమంది పాల్గొన్నా, వందమంది మాట్లాడినా ప్రథమ, ద్వితీయ, తృతీయ, ప్రోత్సాహ బహుమతులు మాత్రమే ఉంటాయి. పోటీలో మనం పాల్గొనడం, బహుమతి కోసం కృషి చెయ్యడం ముఖ్యం. బహుమతి వస్తే సంతోషమే. రాకపోతే మాత్రం కుంగిపోకూడదు. నలుగురిలో ధైర్యంగా నిలబడి ఎలా మాట్లాడాలో అనుభవం వస్తుంది. ఆ అనుభవంతో ఈసారి మరో పోటీ పెట్టినప్పుడు ధైర్యంగా పాల్గొనవచ్చు. సరేనా?’ అన్నది సుభద్ర. మర్నాడు పిల్లలిద్దరూ పోటీలో పాల్గొడానికి ఉత్సాహంగా సిద్ధమయ్యారు. పెద్దలు, పిల్లలను ఏ రకంగా ప్రోత్సహించాలో అర్థమైన రఘుపతి, సావిత్రి పిల్లలను తీసుకుని బడిలో దింపిరావడానికి బయలుదేరారు.- సమ్మెట ఉమాదేవి