గొంతెత్తిన కార్మిక, కర్షక లోకం
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : కార్మిక, రైతు సంఘాల జాతీయ ఐక్య వేదిక పిలుపు మేరకు ఆదివారం దేశ వ్యాపితంగా పలు నగరాల్లో మహా పడావ్ (రాత్రి, పగలు ధర్నా)లు మొదలయ్యాయి. సిమ్లా నుంచి చెన్నై వరకు, ఇటు కొల్‌కతా నుంచి రాంచీ వరకు రైతులు కార్మికులు పెద్దయెత్తున వీటిలో పాల్గొంటున్నారు. దేశాన్ని కాపాడాలి, జీవనోపాధి కల్పించాలి, ప్రైవేటీకరణ ఆపాలి, కనీస వేతనం రూ.26,000గా నిర్ణయించాలి. వివాదాస్పదమైన నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలి, రైతుల పంటకు స్వామినాథన్ కమిషన్ సూచించిన ప్రకారం సి2 ప్లస్ 50శాతం ఎంఎస్‌పికి చట్టబద్ధత కల్పించాలి, ధరల పెరుగుదలను అరికట్టాలి, లఖింపూర్ ఖేరి రైతుల హత్యకు ప్రధాన కారకుడైన కేంద్ర హౌం శాఖ సహాయ మంత్రి అజయ్ కుమార్ మిశ్రాను మంత్రివర్గం నుంచి తొలగించి, ప్రాసిక్యూట్ చేయాలి వంటి డిమాండ్లు మార్మోగాయి. 26, 27 తేదీల్లో రాత్రి పగలు ధర్నాలు, 28న రాజ్‌భవన్ అభియాన్ కింద రాష్ట్రాల రాజధానుల్లో ధర్నాలు, గవర్నర్ల ద్వారా ప్రధానికి డిమాండ్ల చార్టర్‌ను పంపనున్నారు. ఆగస్టు24న ఢిల్లీలోని తల్కటోరా స్టేడియంలో జరిగిన అన్ని కేంద్ర కార్మిక సంఘాల సమాఖ్య, సంయుక్త కిసాన్ మోర్చాల జాతీయ ఐక్య వేదిక సదస్సు నవంబరు26 నుంచి 28 వరకు మహా పడావ్ నిర్వహించాలని పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఢిల్లీలో మహాపడావ్ నుద్దేశించి ఎఐకెఎస్ అధ్యక్షుడు అశోక్ థావలే మాట్లాడుతూ, రైతులు పండించే పంటకు కనీస మద్దతు ధర, కార్మికులకు న్యాయమైన వేతనాలు ఇవ్వాలన్న డిమాండ్లు ఈ దేశ ప్రజలకు అత్యంత ముఖ్యమైనవని అన్నారు. దేశాన్ని కాపాడాలని మూడు రోజుల పాటు కార్మికులు దేశవ్యాపితంగా పోరాడనున్నారని చెప్పారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మిక చట్టాలనన్నిటినీ రద్దు చేసి వాటి స్థానంలో నాలుగు లేబర్ కోడ్లను తీసుకొచ్చి కార్మికుల కనీస వేతన హక్కును హరించివేసిందని, అన్ని ఉద్యోగాలను కాంట్రాక్టు ఉద్యోగాలుగా మార్చేసి, ఉద్యోగ భద్రత లేకుండా చేస్తోందని, మరో వైపు ప్రైవేటీకరణను యథేచ్ఛగా కొనసాగిస్తున్నదని ఆయన అన్నారు. ఈ చర్యలను ఆపాలని కార్మిక, కర్షక సంఘాల జాతీయ ఐక్య వేదిక కోరింది. పంటలకు కనీస మద్దతు ధర గ్యారంటీ చేస్తూ చట్టం తెస్తామని ఏడాదిపాటు రైతులు నిర్వహించిన చారిత్రాత్మక పోరాట సందర్భంగా ప్రధాన మంత్రి ఇచ్చిన హామీ ఇంతవరకు అమలుకు నోచుకోలేదని థావలే విమర్శించారు. దేశీయ, విదేశీ కార్పొరేట్లకు దేశాన్ని బిజెపి అమ్మేస్తోందని ఆయన విమర్శించారు. మరో వైపు కులం, మతం, భాష పేరుతో విద్వేషాలను రెచ్చగొట్టి ప్రజల మధ్య ఐక్యతను చీల్చేందుకు యత్నిస్తోందని, ప్రజాస్వామ్యం, లౌకికవాదం, ఫెడరలిజంపై దాడులు చేస్తోందని, రాజ్యాంగ మౌలిక స్వభావాన్ని దెబ్బతీస్తోందని అన్నారు. ఇటువంటి విచ్ఛిన్నకర చర్యలకు వ్యతిరేకంగా కార్మికులు, కర్షకులు చేయి చేయి కలిపి పోరాడుతున్నారని థావలే పేర్కొన్నారు. విద్యుత్ చట్ట సవరణ బిల్లును వెనక్కి తీసుకోవాలని, ప్రిపెయిడ్ స్మార్ట్ మీటర్లను ఉపసంహరించుకోవాలని మహాపడావ్ డిమాండ్ చేస్తోందన్నారు. చెన్పైలో పెద్ద సంఖ్యలో మహాపడావ్‌కు హాజరైన కార్మిక, కర్షకులనుద్దేశించి ఎఐకెఎస్ ప్రధాన కార్యదర్శి విజూ కృష్ణన్, యుపిలోని లక్నోలో మహాపడావ్ నుద్దేశించి పి కృష్ణ ప్రసాద్, భువనేశ్వర్‌లో హన్నన్‌మొల్లా, పాట్నాలో బాదల్ సరోజ్, సిమ్లాలో ఇంద్రజిత్ సింగ్, అగర్తలాలో పబిత్రాకర్, ముంబయిలో అజిత్ నావలే మాట్లాడారు. మిగతా పట్టణాల్లోనూ మహాపడావ్‌లు ప్రారంభమైనట్లు వార్తలొస్తున్నాయి. హర్యానా, పంజాబ్ రైతులు చండీగఢ్‌లో మహాపడావ్‌కు గుంపులు గుంపులుగా ట్రాక్టర్ ట్రాలీలల్లో తరలివస్తున్నారు. హిమాచల్ ప్రదేశ్‌లోని సిమ్లాలో సెక్రటేరియట్ ఎదుట కార్మికులు, రైతులు మహాపడావ్ చేపట్టారు.