ఎమ్మెల్యే కన్నబాబు సోదరుని తక్షణమే అరెస్టు చేయాలి : సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు

ప్రజాశక్తి-విజయవాడ : భూ విక్రయ దందాలో కాకినాడలోని యువ డాక్టర్‌ కిరణ్‌ ఆత్మహత్యకు కారకుడైన ఎమ్మెల్యే కన్నబాబు సోదరునిపై చర్య తీసుకోవాలని, తక్షణం అరెస్టు చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు డిమాండ్‌ చేశారు. దీనికి సంబంధించి సోమవారం ఓ ప్రకటనను విడుదల చేశారు. రాష్ట్రంలో అధికార పార్టీ భూదందాలు పెరిగాయని శ్రీనివాసరావు ఆరోపించారు. వీటిపై చర్యలు తీసుకోవాలని కోరారు. భూ దురాక్రమణదారుల పట్ల పోలీసులు కఠినంగా వ్యవహరించాలన్నారు. సామాన్యుల భూములకు రక్షణ కల్పించాలని డిమాండ్‌ చేశారు.

ప్రజాశక్తి- కాకినాడ : భూమి విక్రయంలో తనను మోసగించారనే మనస్తాపంతో కాకినాడలో ఒక యువ వైద్యుడు ఆత్మహత్య చేసుకున్నారు. ఎంఎల్‌ఎ కన్నబాబు సోదరుడు కల్యాణ్‌ కృష్ణ వల్లే తన కుమారుడు బలవన్మరణానికి పాల్పడినట్టు మృతుని తల్లి ఆరోపించారు. వైద్యుని తల్లి కథనం ప్రకారం… కాకినాడలోని అశోక్‌ నగర్‌ గోకులం సమీపంలో డాక్టర్‌ నున్న కిరణ్‌ చౌదరి తన తల్లి శేషారత్నంతో కలిసి నివసిస్తున్నారు. రష్యాలో వైద్య విద్య అభ్యసించిన కిరణ్‌ అవివాహితులు. ఆయన జిజిహెచ్‌లో మార్చురీ విభాగంలో పని చేస్తున్నారు. శనివారం రాత్రి తన ఇంట్లో పురుగు మందుతాగి విగతజీవిగా పడిపోయారు. దీన్ని తల్లి గమనించి ఆయనను ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమించి ఆదివారం మృతి చెందారు. గొల్లప్రోలు మండలం చందుర్తి, కాకినాడ రూరల్‌ నియోజకవర్గం కరప మండలం కోరాడ గ్రామంలో ఉన్న సుమారు 12.50 ఎకరాల భూమిని కిరణ్‌ అమ్మకానికి పెట్టారు. సామర్లకోట మండలం అచ్చంపేటకు చెందిన పెదబాబుకు ఈ భూమికి సంబంధించిన దస్తావేజులు అప్పగించారు. ఆ తర్వాత వారు డబ్బులు చెల్లించకుండా ఎదురు తిరగడంతో ఆత్మహత్య చేసుకున్నారు. ఈ వ్యవహారంలో కాకినాడ రూరల్‌ ఎంఎల్‌ఎ సోదరుడు కల్యాణ కృష్ణ పాత్ర కీలకంగా ఉందని కిరణ్‌ తల్లి ఆరోపించారు. ఇప్పటికే భూ విక్రయాల్లో ఎంఎల్‌ఎ కన్నబాబు ప్రధాన అనుచరుడు గాలిదేవర బాలాజీ కూడా కూరాడ భూమి విక్రయానికి సంబంధించి డబ్బులు ఇవ్వ కుండా తన కుమారుడిని ఇబ్బందులకు గురి చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తన కుమారుని మృతికి కారణమైన వారిపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు.

➡️