శ్రీశ్రీ అవగాహనలో గురజాడ

Nov 27,2023 08:45 #sahityam

”గురజాడను కవిగా గుర్తించ లేని ‘వెధవాయ’ను మనిషిగా నేను గుర్తించలేను” అన్నారు మహాకవి శ్రీశ్రీ.

(శ్రీశ్రీ గురజాడ సంస్మరణ సంచిక, 1976)

53 ఏళ్ళ మాత్రమే జీవించిన గురజాడ అప్పారావు (1862-1915) 30 ఏళ్ళ సాహిత్య జీవితంలో రాయగలిగింది పట్టుమని 1600 పుటలైతే; ఆ సాహిత్యం మీద వచ్చిన విమర్శ కనీసం 25 వేల పుటలుంటుంది. తెలుగు వాళ్ళు గురజాడను ఎంతగా సొంతం చేసుకున్నారో దీనివల్ల తెలుస్తుంది. ఈ 25 వేల పుటల గురజాడ సాహిత్య విమర్శలో శ్రీశ్రీ రాయగలిగింది. 100 పుటలు మాత్రమే! అయితే ఈ 100 పుటల శ్రీశ్రీ విమర్శ గురజాడకు ఆధునిక తెలుగు సాహిత్య చరిత్రలో సుస్థిరస్థానం ఏర్పరిచింది. ఒకరకంగా శ్రీశ్రీ గురజాడ సాహిత్యలాలసుడు. ఆయన గురజాడ మీద రాసిన వ్యాసాలు, చేసిన ప్రసంగాలు, ఇతరుల అడిగిన ప్రశ్నలను చెప్పిన సమాధానాలు ఈ నిజాన్ని రుజువు చేస్తున్నాయి.

ఒక కొత్త భూఖండాన్ని కనిపెట్టడానికి బయలుదేరిన సాహస యాత్రికుడు (1955), గురజాడ మహాప్రవక్త (1954), ఆయన ఒక విప్లవ కవి కూడా (1954) వంటి నిర్వచనాలు గురజాడంటే శ్రీశ్రీకి గల గౌరవాన్ని చాటుతున్నాయి. గురజాడ 53 ఏళ్ళకే మరణించడం పట్ల శ్రీశ్రీ రెండు మూడు పర్యాయాలు బాధపడ్డారు. ”ఆయన మరణం ఒక్క ఆంధ్రదేశానికే కాదు, యావదార్భరత దేశానికే తీరని నష్టం. 1915 నవంబరు నెలలో ప్రపంచం ఒక మహారచయితను కోల్పోయిందనే చెప్పాలి” (1954); ”మరో 20 ఏళ్ళయినా గురుజాడ అప్పారావు గారు బ్రతికిఉంటే మన సాహిత్య క్షేత్రం ఎంత సస్యశ్యామలమయ్యేదో” (1976) అని శ్రీశ్రీ ఆవేదన చెందారు.ఆధునిక కవిత్వానికి పితామహుడు ఎవరు అనే ప్రశ్నకు గురజాడ అప్పారావే అని, ఆధునిక తెలుగు కవిత్వానికి మార్గదర్శనీయుడు ఎవరంటే ”ఒకే ఒక్క మార్గదర్శి అతడే గురజాడ” అని సమాధానం చెప్పారు. (1983) 20వ శతాబ్దంలో తెలుగు సాహిత్యానికి మార్గ నిర్దేశం గురజాడేనన్నది శ్రీశ్రీ అభిప్రాయం, ”తెలుగు సాహిత్యాన్ని ఇరవయ్యో శతాబ్దంలోని ప్రవేశపెట్టిన ఘనత గురజాడకే దక్కుతుంది” అని గట్టిగా చెప్పారు. (1975).బసవరాజు అప్పారావు, కవికొండల వెంకటరావు, చింతా దీక్షితులు తనకు మార్గ దర్శకులని, వీళ్ళ మీద గురజాడ ప్రభావముందని, వీళ్ళ ద్వారానే తాను గురజాడ చదివానని, అప్పటి నుంచి గురజాడ ప్రభావం తన మీద బలంగా పడిందని శ్రీశ్రీ రెండు, మూడు పర్యాయాలు చెప్పుకున్నారు. గురజాడ అనే మేడను అధిరోహించడానికి ఆ ముగ్గురూ మెట్లగా ఉపయోగపడ్డారని స్పష్టంగా చెప్పారు. (1970). తిక్కన, వేమన, గురజాడల తన కవిత్రయమని శ్రీశ్రీ చాలాసార్లు చాటుకున్నారు. కారణాలు కూడా చెప్పారు. వాళ్ళు తెలుగు కవులయినా, ”మనం కడచిన వెయ్యేళ్ళలో ప్రపంచానికి కనీసం ముగ్గురు మహాకవులను ప్రసాదించాం” అని కూడా అన్నారు (1972). 1954 నుండి 1980 దాకా ఈ అభిప్రాయం చెబుతూనే వచ్చారు. అంతేకాదు, ”వేమన, గురజాడలిద్దరూ ఏనాడో సామ్యవాదానికి రాచబాట వేసేశారు” అని మరణించే ముందు (1983) శ్రీశ్రీ ప్రకటించడం విశేషం.శ్రీశ్రీ మహాత్మాగాంధీó, గురజాడల మధ్య ఆసక్తికరమైన పోలిక తుచ్చారు.

”దరిద్ర నారాయణుని చిహ్నమంటూ కొల్లాయి కట్టుకొని నిరాడంబర మూర్తియై గాంది óగారు అవతరించినప్పుడు ప్రపంచమంతా ఆయనను ఉగ్గదించింది. కవితారంగంలో గురజాడ అలాంటి నిరాడంబరత అవలంబించారు” (1954). ”గాంధీజీ నిత్య జీవితంలో నిరాడంబరతను స్వీకరించినట్లే గురజాడ కవితా శిల్పంలో వ్యర్థాలంకారాలనూ, వాచలత్వాన్ని, కరచరణాలు కట్టి పడవేసే కట్టుబాట్లను తొలగించారు” (1960).శ్రీశ్రీ గురజాడను రవీంద్రనాధ్‌ ఠాగూర్‌ కన్నా ఒక మెట్టు పైన నిలపడానికి ప్రయత్నించారు. అలాగే ఠాగూరు, సుబ్రహ్మణ్య భారతి కన్నా గురజాడ గొప్ప రచయిత అని అభిప్రాయపడ్డారు. ఠాగూర్‌, గురజాడల మధ్య అంతరం ఎంత? అనే ప్రశ్నకు ”టాగూర్‌ కన్నా భవిష్యత్తులోకి గురజాడ ఎక్కువ దృష్టి సారించారు” అని సమాధానం చెప్పారు. (1984)” బెంగాల్‌లో టాగూరు, తమిళనాడులో సుబ్రహ్మణ్య భారతిలాంటి వారికి మనం యావద్భారత కీర్తి అంటగడు తున్నాం. ఆ దృష్టితో చూస్తే నా ఉద్దేశంలో మీరందరి కన్నా గొప్పవాడు గురజాడ అప్పారావు” (1982) అని తన అభిప్రాయాన్ని పునరుద్ఘాటించారు. అంతేకాదు ఆయన ఒక ఫిర్యాదు కూడా చేశారు. ”టాగూర్‌కు దేశామంతటా మందిరాలు నెలకొల్పారు గాని మన గురజాడ పేరున ఏం చేశారు? (1982) మనవాళ్ళు. 50 ఏళ్ళ తర్వాతనైనా దీనిని గురించి ఆలోచించాలి.” గురజాడకు శ్రీశ్రీ ఎంత అత్యున్నత స్ధానం ఇచ్చారంటే- ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన గోధే, ఇల్సిన్‌ వంటి రచయితలతో తులతూగే మేధావి” అనడానికి సంకోచించలేదు (1954).గురజావడ సాహిత్యమంతా శ్రీశ్రీకి ఇష్టమైనదే అయినా ప్రత్యేకించి గురజాడ నాటకాలతో ‘కన్యాశుల్కం’; కథలలో ‘మీ పేరేమిటి?’? కవితలలో ‘దేశభక్తి’ గురించి ఆయన చాలా అభిప్రాయాలు చెప్పారు.

గురజాడ సాహిత్యంలో ‘కన్యాశుల్కం’ నాటకం మీద వ్యాసంతోనే శ్రీశ్రీ విమర్శ మొదలైంది. ”జీవితంలో ఏ సందర్భాÛనికైనా సరిపోయే మాటలు ఎక్కడో ఒకచోట మహా కవిలో దొరకుతాయి” (1945) అని కన్యాశుల్కం నాటకానికి అన్వయించారు. కన్యాశుల్కంలో గిరీశం, రామప్పంతులు, లుబ్ధావధాన్లు వంటివారు ట్రాజిక్‌ హీరోలని; వాళ్ళది, ”శిథిలీకృతమవుతున్న ఒకానొక సాంఘిక వ్యవస్థ యొక్క కరాళనృత్యం” అనీ; ”కన్యాశుల్కం బీభత్సరస ప్రధానమైన విషాదాంత నాటకం” అని నిర్వచించారు (1945). ఈ నిర్వచనాలు తర్వాత కాలంలో ప్రజల నాలుకల మీద నాట్యం చేస్తున్నాయి. 1956 నాటికల్లా కన్యాశుల్కం నాటకం మీద శ్రీశ్రీ అవగాహన మరింత పరిపక్వమైంది. ”సమకాలిక జీవితాన్ని వాస్తవానికి అనుగుణంగా చిత్రించిన ప్రధమ నాటకం కన్యాశుల్కము” అని 1956లో నిర్ధారించారు. సంస్కృత ‘మృచ్ఛకటికం’ తర్వాత కన్యాశుల్కం నాటకం భారతదేశంలో రచింపబడేలేదు” అని 1957లో శ్రీశ్రీ ప్రకటించారు. ఇదే అభిప్రాయాన్ని 1960లో కూడా పునరుక్తి చేశారు. కన్యాశుల్కం కేవలం నాటకం కాదనీ, ఒక పెద్ద జీవిత ఖండమని మరో సందర్భంలో నిర్వచించారు (1965). ఈ అభిప్రాయాలన్నీ ఒక ఎత్తయితే, గురజాడను కన్యాశుల్కమే మహాకవిని చేసింది అనడం చాలా ఆలోచలను రేకెత్తిస్తుంది (1983).

”విశ్వ సాహిత్యంలో మధురవాణితో పోల్చగలిగిన పాత్ర మరొకటి లేదు” అంటూనే ”ఎమలీజోలా సృష్టించిన ‘నానా’ అనే 19 శ. పరాసు వేశ్య వసంతసేనగా ప్రారంభించి, మధురావాణిగా మారుతుంది” అని ఆయన తన అవగాహనను విస్తరించారు. (1947). ”కన్యాశుల్కంలోని ఇతర పాత్రలే బైరాగిని సృష్టించాయి” (1948) వంటి అనేక అభిప్రాయాలు కన్యాశుల్కం నాటకంలోని లోతులకు శ్రీశ్రీ ఎలా వెళ్ళారో చెబుతాయి.గురజాడ తక్కువ కథలు రాసినా ‘ఒక్కొక్క ఒక్కొక్క వజ్రపు తునక’ అని అన్నారు శ్రీశ్రీ. అయినా వాటిలో తనకు వచ్చిన కథ ‘మీ పేరేమిటి?’ అన్నది అని కూడా అన్నారు. ఆ కథలో మహత్తర కథనకౌశలం, కన్యాశుల్కం నాటకంలోని నాటకీయత ఆ కథలో ఉందనీ పేర్కొన్నారు. ‘నాకు నచ్చిన కథ’ అనే వ్యాసంలో ఒక కథలో భగవంతుని పేరిట పోరాడుకోవడం మాని, మానవుని పేరిట ఐక్యం కావాలన్నదే గురజాడ ఇచ్చిన సందేశమని వివరించారు. మన జాతిని ఇప్పటికీ చేతకాకుండా పోతున్నది ఇదే! ఆ కథలో గ్రామ రాజకీయాలు ఉన్నాయని గుర్తించారు (1970). ‘దేశభక్తి’ గేయం అంటే, శ్రీశ్రీకి ఎనలేని గౌరవం, ఇష్టం. ఎంత ఇష్టమంటే గురజాడ రచనలన్నీ నష్టమై పోయి ఒక్క దేశభక్తినీ మిగిలినా చాలు.. అతడు ప్రపంచ కవులలో ఒక్కడుగా లెక్కించదగిన మహాకవి అని రుజువు కావడానికి.. అనేంత (1958). ‘దేశభక్తి’ కవిత ప్రపంచ మహాజనుల జాతీయగీతమని వర్ణించారు. తెలుగు కవి ప్రపంచానికిచ్చిన కవిత్వపు కానుక అని పేర్కొన్నారు. ఆ గీతం ఒక్కటే ఒక మహాకావ్యమన్నారు మరోసారి (1959).’దేశమును ప్రేమించుమన్నా అని అనడమే ఒక సాహసం అన్నారు శ్రీశ్రీ (1967). ”ఎందుకంటే దేశభక్తిలో భావవాదం పేరుకు పోయిన దశలో భౌతికవాదం ప్రవేశం పెట్టారు గురజాడ. దేశమంటే మనుషులని గుర్తుచేశారు. మనుషుల్ని ప్రేమించడే దేశాభిమానమని ఆధిపత్యవాదుల వాదానికి ప్రత్నామ్నాయ వాదాన్ని ప్రవేశపెట్టారు. కన్యాశుల్కం నాటక ప్రదర్శన జరిగినప్పటి నుంచి గురజాడ సాహిత్యం మీద విమర్శ వస్తూనే ఉంది. అందులో శ్రీశ్రీ అభిప్రాయాల విలువ సాటిలేనిది. గురజాడకు సంబంధించినంత వరకు శ్రీశ్రీ ప్రేరణాత్మక విమర్శకుడు.

”ఏ కవికైనా అతని చుట్టూ ఒక సమాజం, ఆ సమజానికొక చరిత్రా, ఆ చరిత్రకొక పరిణామం ఉంటాయి. సామాజిక చారిత్రక పరిణామ గమనంలో కవియొక్క సాహిత్య స్థానం నిర్ణీతమవుతుంది. కవి ప్రగతిశీలి, ప్రతిభాశాలి అయితే ఆగమనాన్ని అతడు మరింత వేగవంతం చేస్తాడు. సామాజిక పరిణామానికి విప్లవపంథాలో వేగం సాధించిన మహాకవిగా గురజాడ అప్పారావుకి నేను నమస్కరిస్తున్నాను.”శ్రీశ్రీ. (గురజాడ ఆధిక్యానికి కారణాలు, 1954)(నవంబరు 30 : గురజాడ వర్థంతి) – రాచపాళెం చంద్రశేఖర రెడ్డి

తాజా వార్తలు

➡️