ప్రజాశక్తి-విశాఖ లీగల్ : రాజ్యాంగ స్వేచ్ఛ పేరుతో జరుగుతున్న సవాళ్లను ఎదుర్కోవడానికి న్యాయ వ్యవస్థ మరింత బలోపేతం కావాలని ఢిల్లీ హైకోర్టు పూర్వ న్యాయమూర్తి జస్టిస్ రేఖా శర్మ పేర్కొన్నారు. ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ ఆధ్వర్యాన దసపల్లా హోటల్లో ఆదివారం ‘రాజ్యాంగ విలువలు- ప్రజాస్వామ్య పరిరక్షణ’ అంశంపై జరిగిన జాతీయ సదస్సు నిర్వహించారు. సదస్సును ఆమె ప్రారంభించి కీలకోపన్యాసం చేశారు. స్వేచ్ఛ, ప్రాథమిక హక్కులు, బాధ్యతల నుంచి భారతదేశ రాజ్యాంగ రూపుదిద్దుకుందన్నారు. ప్రతి వ్యక్తీ హక్కులతోపాటు తమ బాధ్యతలను గుర్తెరిగి ప్రవర్తించాలన్నారు. ఒత్తిడి లేని తీర్పులు న్యాయమూర్తుల నిబద్ధతకు గీటురాయిగా నిలుస్తాయన్నారు. న్యాయమూర్తుల నియామకంలో ఎదురవుతున్న సంఘర్షణలు, కొందరు న్యాయమూర్తుల పనితీరు రాజ్యాంగాన్ని ప్రశ్నిస్తున్నట్లు ఉన్నాయని అభిప్రాయపడ్డారు. ఉన్నత న్యాయస్థానాల్లో న్యాయమూర్తులు ఉద్యోగ విరమణ తర్వాత ఎటువంటి పదవులూ నిర్వహించకపోవడం ఉత్తమం అన్నారు. రాజకీయ జోక్యం లేని న్యాయ వ్యవస్థ రావాలన్నారు. ప్రజాస్వామ్యానికి పవిత్ర గ్రంథమైన రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అనుపమ చక్రవర్తి రాజ్యాంగ పరిధిలో నిందితుల హక్కులు అన్న అంశంపై ప్రసంగించారు. మహనీయుల త్యాగఫలంగా రూపొందించిన రాజ్యాంగాన్ని అపహస్యం చేసే సందర్భంగా రాకూడదన్నారు. సుప్రీంకోర్టు న్యాయవాది ప్రశాంత్ భూషణ్ మాట్లాడుతూ, ఇటీవల కోర్టుల్లో తీర్పులు సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా వస్తున్నాయని అత్యున్నత న్యాయస్థానంలోని అనేక కేసుల పరంపరను వివరిస్తూ వాపోయారు. కొలీజియం వ్యవస్థ స్థానంలో జ్యుడీషియల్ అపాయింట్మెంట్ కమిషన్ ఏర్పాటుచేస్తే కొంతవరకు న్యాయవ్యవస్థ పని తీరు బలోపేతం అవుతుందని అభిప్రాయపడ్డారు. ఆర్బిట్రేషన్ వ్యవస్థ ఒక పెద్ద వ్యాపారంలా తయారైందని అన్నారు. ఈ సదస్సులో జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఆలిపాటి గిరిధర్, పలువురు సీనియర్ జూనియర్ న్యాయమూర్తులు, ఐఎఎల్ ప్రతినిధులు కెఎస్ఎస్.సురేష్కుమార్, అజరుకుమార్, విశాఖపట్నం న్యాయవాదుల సంఘం అధ్యక్షులు చింతపల్లి రాంబాబు, ప్రధాన కార్యదర్శి పైల శ్రీనివాసరావు, బార్ కౌన్సిల్ ఉపాధ్యక్షులు రామజోగేశ్వరరావు, మెంబర్లు పి.నర్సింగరావు, ఎస్.కృష్ణమోహన్ పాల్గొన్నారు.