ట్రెజరీల్లో అక్రమాలకు తావు లేదు

ప్రభుత్వ శాఖల్లో లావాదేవీల విషయంలో ట్రెజరీల ప్రమేయం ఉండబోదని, నిబంధనలకు లోబడి చెల్లింపులకు సిఫార్సులు మాత్రమే చేస్తామని జిల్లా

నిబంధనలకు లోబడి చెల్లింపులకు సిఫార్సు

సిఎఫ్‌ఎంఎస్‌ ద్వారానే చెల్లింపులు

జీతభత్యాల చెల్లింపు అధికారం డిడిఒలదే

ఉద్యోగులు, పెన్షనర్లకు ఇకెవైసి తప్పనిసరి

జిల్లా ఖజానాశాఖ అధికారి కె.రవికుమార్‌

ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌

ప్రభుత్వ శాఖల్లో లావాదేవీల విషయంలో ట్రెజరీల ప్రమేయం ఉండబోదని, నిబంధనలకు లోబడి చెల్లింపులకు సిఫార్సులు మాత్రమే చేస్తామని జిల్లా ఖజానాశాఖ అధికారి కె.రవికుమార్‌ తెలిపారు. జిల్లా కేంద్రంలోని డీడీ కార్యాలయం మొదలు 12 సబ్‌ట్రెజరీ కార్యాలయాల్లో ఎక్కడా నేరుగా చెల్లింపులు ఉండవని స్పష్టం చేశారు. కేవలం చెల్లింపులకు సంబంధించిన బిల్లులను సరిచూసి మంజూరు చేసిన అనంతరం సిఎఫ్‌ఎంఎస్‌కు పంపిస్తామని వివరించారు. గతం కంటే పారదర్శంగా ఉండే ఈ విధానంలో అక్రమాలకు తావు లేదని వెల్లడించారు. పలు అంశాలపై ‘ప్రజాశక్తి’ ముఖాముఖిలో మాట్లాడారు.ఖజానా శాఖ చెల్లింపుల్లో అనేక రకాలైన ఇబ్బందులు పడాల్సి వచ్చేది. ఇప్పుడు ఈ విధానం ఎలా ఉంది?ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలు మొదలు అనేకరకాల బిల్లులకు గతంలో జిల్లా స్థాయిలో జరిగే విధానం ఉండేది. నేరుగా ఖజానాకు ప్రభుత్వం నుంచి నిధులు వస్తే వాటిని ఉద్యోగుల జీతభత్యాలు, ఇతర అవసరాలు, పిఎఫ్‌ రుణాలు, అలవెన్సులు ఒక్కొక్కటిగా బడ్జెట్‌ను అనుసరించి ప్రాధాన్యతా క్రమంలో చెల్లించేవాళ్లం. ఆన్‌లైన్‌ విధానం వచ్చిన తర్వాత అంతా పారదర్శకంగా సాగుతోంది. సింగిల్‌ విండో విధానం వచ్చాక సిఎఫ్‌ఎంఎస్‌ విధానం ద్వారా చెల్లింపులు జరుగుతున్నాయి. ఈ విధానం వచ్చిన తర్వాత కేవలం డిడిఒ నుంచి వచ్చిన బిల్లులను సరిచూసి ఆన్‌లైన్‌లో లోపాలను సరిదిద్ది క్లియరెన్సు ఇవ్వడం మాత్రమే ట్రెజరీల బాధ్యత. డిడిఒ నుంచి బిల్లు సబ్‌ ట్రెజరీ అధికారికి పంపిస్తారు. అక్కడ్నుంచి ఆన్‌లైన్‌లోనే జిల్లా కార్యాలయానికి వస్తుంది. ఇక్కడ లాగిన్‌లో ఓకే చేస్తే చెల్లింపులంతా నేరుగా సిఎఫ్‌ఎంఎస్‌ ద్వారా లబ్ధిదారుల ఖాతాలకు చెల్లించడం జరుగుతుంది.పెన్షన్‌ ప్రపోజల్‌ విధానాన్ని ఎలా అమలు చేస్తున్నారు? ప్రతి ఉద్యోగి తన ఉద్యోగ విరమణ సమయంలో సంబంధిత శాఖ ఉన్నతాధికారుల నుంచి పెన్షన్‌ ప్రపోజల్‌ను పంపిస్తారు. వాటిని సబ్‌ ట్రెజరీలో ఎస్‌టిఒ స్థాయి అధికారి ఆథరైజ్‌ చేసి ప్రభుత్వానికి సమర్పించాలి. డిడిఒ నుంచి వచ్చిన ప్రతిపాదనల్లో కొన్నిసార్లు అసంపూర్తిగా ఉంటే వాటిని సరిచేసుకోవాల్సిన బాధ్యత సంబంధిత ఉద్యోగి, డిడిఒపై ఉంటుంది. సిఎఫ్‌ఎంఎస్‌ నిబంధనలకు లోబడి బిల్లులు పంపించాల్సి ఉంటుంది. వాటిని సకాలంలో పంపించకపోయినా బిల్లు పాస్‌ చేయడం సాధ్యం కాదు. సిఎఫ్‌ఎంఎస్‌లో ఆ బిల్లు అనుమతి పొందకపోవడం వల్ల చెల్లింపులు సాధ్యం కాదు. నిబంధనలకు లోబడి వాటిని పంపిస్తే పాస్‌ చేసేందుకు ఎటువంటి అభ్యంతరాలు ఉండవు.ఇకెవైసి అనుసంధాన ప్రక్రియ ఎంతమేరకు పూర్తయింది?ప్రభుత్వ ఉద్యోగితో పాటు కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్‌ విధానాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల ఖాతాలకు ఆధార్‌ను అనుసంధానం చేయాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు ఉన్నాయి. జిల్లాలో 12 ఉప ఖజానా కార్యాలయాల ద్వారా పెన్షన్‌ తీసుకుంటున్న పింఛనుదారులకు పెన్షనర్‌ సిఎఫ్‌ఎంఎస్‌, ఐడి నంబర్లతో ఆధార్‌ నంబరును ఇకెవైసి లింక్‌ చేయాలని ప్రభుత్వం గతంలో ఆదేశాలు ఇచ్చింది. ఈ ప్రక్రియ దాదాపు పూర్తయింది. అనారోగ్య కారణాలతో ఉన్న వారికి ఇకెవైసి కొంత ఆలస్యమవుతోంది. అనుసంధానం చేసేందుకు ఆధార్‌ కార్డు, లింకు చేసిన ఫోన్‌, సిఎఫ్‌ఎంఎస్‌ ఐడి, పిపిఒ కాపీ, బ్యాంకు పాస్‌ పుస్తకం తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది.పెన్షనర్లు వార్షిక జీవన ధ్రువీకరణ ఎప్పట్లోగా సమర్పించాలి?పెన్షనర్ల జీవన ధ్రువీకరణ పత్రాలను ఏటా ఫిబ్రవరి 28వ తేదీ లోగా ఆన్‌లైన్‌ ద్వారా పంపించాల్సి ఉంటుంది. సబ్‌ ట్రెజరీ కార్యాలయాల్లో నేరుగా కూడా అందజేయవచ్చు. ఆన్‌లైన్‌లో సమస్యలు ఎదురైతే జీవన ధ్రువీవకరణ పత్రం సబ్‌ ట్రెజరీలో అందజేయాలి. అలా అందజేయని వారికి మార్చిలో పెన్షన్‌ చెల్లింపునకు ఇబ్బందులు వస్తాయి.

➡️