గ్రీన్ ఛానల్ ద్వారా తరలిస్తున్న అవయవాలు
* మరో ఇద్దరి జీవితాల్లో వెలుగులు
*బ్రెయిన్ డెడ్‌తో విఆర్‌ఒ మౌనిక మృతి
* అవయవ దానానికి అంగీకరించిన తల్లిదండ్రులు
*గ్రీన్‌ఛానల్ ద్వారా అవయవాల తరలింపు
ప్రజాశక్తి – శ్రీకాకుళం రూరల్, అర్బన్
శ్రీకాకుళం నగరంలోని నానుబాలవీధి సచివాలయంలో విఆర్‌ఒగా పనిచేసిన బొనిగి మౌనిక తాను మరణిస్తూ అవయవ దానంతో ముగ్గురికి ప్రాణం పోసింది. మరో ఇద్దరి జీవితాల్లో వెలుగులు నింపింది. నాలుగు రోజుల కిందట డేఅండ్‌నైట్ కూడలి వద్ద రోడ్డు ప్రమాదానికి గురైన ఎచ్చెర్ల మండలం కొత్తపేటకు చెందిన మౌనికను నగరంలోని ప్రభుత్వ సర్వజనాస్పత్రి, మెడికవర్, విశాఖ అపోలో ఆస్పత్రుల్లో మెరుగైన చికిత్స అందించినా కోలుకోలేదు. దీంతో కుటుంబ సభ్యులు ఆమెను రాగోలులోని జెమ్స్ ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఆదివారం ఉదయం బ్రెయిన్ డెడ్ అయినట్లు నిర్ధారించిన వైద్యులు, విషయాన్ని కుటుంబసభ్యులకు తెలిపారు. బ్రెయిన్ డెడ్ కేసులో అవయవాలు దానం చేయొచ్చని, మీరిచ్చే అవయవ దానంతో మరికొంత మందికి జీవితాన్ని ఇవ్వవచ్చని జెమ్స్ ఆస్పత్రి వైద్యులు, ఎపి జీవన్‌దాన్ సమన్వయకర్తలు మృతురాలి తల్లిదండ్రులు గోవిందరావు, ఉమాదేవికి అవగాహన కల్పించారు. దు:ఖ సాగరంలో మునిగిపోయి ఉన్నా… వారు తీసుకున్న నిర్ణయం ఐదుగురి కుటుంబాల్లో వెలుగులు నింపింది.మృతురాలి గుండె, రెండు మూత్రపిండాలు, రెండు కళ్లను దానం చేయడంతో, వైద్యులు శస్త్రచికిత్స చేసిన అనంతరం వాటిని తరలించేందుకు పోలీసు సిబ్బంది ప్రత్యేక వాహనాలతో గ్రీన్ ఛానల్‌ను ఏర్పాటు చేశారు. గుండెను తిరుపతి స్విమ్స్ ఆస్పత్రికి, ఒక మూత్రపిండం విశాఖకు, మరొకటి జెమ్స్ ఆస్పత్రికి, రెండు కళ్లను రెడ్‌క్రాస్‌కు తరలించారు. మౌనికకు మంత్రి ధర్మాన నివాళిమౌనిక మృతిపై రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతురాలి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అవయవదానం చేసేందుకు కుటుంబ సభ్యులు ముందుకు రావడంపై కృతజ్ఞతలు తెలిపారు. ఆపద సమయంలోనూ గొప్ప స్ఫూర్తిని చాటడం ఆదర్శనీయమన్నారు. మౌనిక చనిపోయినా మరికొందరి రూపంలో జీవించి ఉంటుందని తెలిపారు.