పర్యవేక్షణ పేరుతో వేధింపులా?

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌
పర్యవేక్షణ పేరుతో ఉపాధ్యాయులను వేధింపులకు గురి చేయడం సరికాదని యుటిఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి రెడ్డి మోహనరావు అన్నారు. ఆదివారం స్థానిక జిల్లా పరిషత్తు సమావేశ మందిరంలో యుటిఎఫ్‌ జిల్లా అధ్యక్షులు రమేష్‌చంద్ర పట్నాయక్‌ అధ్యక్షతన నిర్వహించిన యుటిఎఫ్‌ జిల్లా 49వ కౌన్సిల్‌ సమావేశంలో ఆయన ప్రసంగించారు. విద్యార్థులంతా ఒకే సామర్థ్యంతో ఉండరని, దీన్ని పట్టించుకోకుండా ఉపాధ్యాయులను బాధ్యులను చేయడం సరికాదని చెప్పారు. సిపిఎస్‌, జిపిఎస్‌ కాకుండా ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు ఒపిఎస్‌ను అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రాథమిక పాఠశాలలను నిర్వీర్యం చేసే జిఒ 117ను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. సిలబస్‌లో చరిత్ర పాఠాలను, గుజరాత్‌ అల్లర్లను, గాంధీ హత్య, డార్విన్‌ జీవపరిణామ సిద్ధాంతం, ఆవర్తన పట్టిక, పోరాటాలు వంటివి తొలగించడమంటే ఇప్పుడున్న విద్యార్థులకు చరిత్ర గురించి అవగాహన లేకుండా చేయడమేనని అభిప్రాయపడ్డారు. శాస్త్రీయ దృక్పథంలో ఆలోచన లేకుండా చేయడం వంటివి దేశాన్ని తిరోగమన పద్ధతిలో వెళ్లడానికి దారితీస్తుందని, ఇది చాలా ప్రమాదమని చెప్పారు. ప్రభుత్వ విద్యారంగ అభివృద్ధికి సామాజిక బాధ్యతగా యుటిఎఫ్‌ కృషి చేస్తోందన్నారు. పర్యవేక్షణపై ఉపాధ్యాయులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వారికి యుటిఎఫ్‌ అండగా ఉంటుందని భరోసానిచ్చారు. యుటిఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి జెఎవిఆర్‌కె ఈశ్వరరావు కార్యదర్శి నివేదికను ప్రవేశ పెట్టారు. ఎన్నికల రిటర్నింగ్‌ అధికారిగా యుటిఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి బి.రవీంద్ర వ్యవహరించారు. సమావేశంలో యుటిఎఫ్‌ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కె.విజయగౌరి, రాష్ట్ర నాయకులు డి.రాము, కె.శ్రీనివాసరావు, ఎ.సత్య శ్రీనివాస్‌, వి.ప్రసన్నకుమార్‌, జి.పార్వతి, సిహెచ్‌ బాస్కరరావు, ఎం.అప్పలనాయుడు, జి.పద్మావతి, కె.అప్పారావు, తదితరులు పాల్గొన్నారు.జిల్లా అధ్యక్ష, ప్రధానకార్యదర్శులుగా రమేష్‌, ఈశ్వరరావు అనంతరం యుటిఎఫ్‌ జిల్లా నూతన కమిటీని ఎన్నుకున్నారు. జిల్లా గౌరవ అధ్యక్షులుగా మీసాల అప్పలనాయుడు, అధ్యక్షులుగా రమేష్‌చంద్ర పట్నాయక్‌, ప్రధాన కార్యదర్శి జెఎవిఆర్‌కె ఈశ్వరరావు, సహాధ్యక్షులుగా వి.ప్రసన్నకుమార్‌, జి.పార్వతి, కోశాధికారిగా సిహెచ్‌ భాస్కరరావు, కార్యదర్శులుగా కె.ప్రసాదరావు, జివి రమణ, పి.త్రినాథ, పి.వాసు, పి.వాసుదేవరావు, సిహెచ్‌ తిరుపతి నాయుడు, ఎం.కేశవరావు, ఎన్‌.సత్యనారాయణ, బి.రామినాయుడు, ఆర్‌ఎవి సూర్యారావు, జి.రాజారావు, శ్రీదేవి, వి.రాధాభవాని, సూరి, శ్రీనివాసరావు ఎన్నికయ్యారు. ఆడిట్‌ కమిటీ కన్వీనర్‌గా ఎ.శంకరరావు, రాష్ట్ర కౌన్సిలర్లుగా కె.విజయగౌరి, డి.రాము, కె శ్రీనివాసరావు, ఎ.సత్యశ్రీనివాస్‌, కె.అప్పారావు, జి.పద్మావతి, సిహెచ్‌ వైకుంఠరావు ఎన్నికయ్యారు.

➡️