కనబడుట లేదు !

Nov 26,2023 09:30

కళ్ళున్నా.. చూపులేదు
బహిరంగంగా చూడడం మానేశాక
అంతర్గత అల్లకల్లోలం
మరెప్పుడు చూస్తానో !
అక్కడన్ని కిరాతకంగా
కుతికె పిసికి చంపిన
మరణాలే అగుపిస్తాయి!
అచ్చం మేకపిల్లను హలాల్‌ చేసినట్లు
జీవగంజి ఆశ చూపి
జీవం తీసుకున్న క్షణాలెన్నో..!
కంచంలోకి మెతుకులు రావాలంటే
కాసిన్ని కుట్రలు నేర్వాలని
పూటకో పాటందుకున్న రోజులెన్నో..!
నిజమే వేశ్య వేషమేసినా
వ్యవస్థలెన్నో..!
దొంగ కొడుకుల రాజ్యాన
మూగబోయిన నన్ను..
సందులో దాచిన..
చిన్నప్పటి పలక చీదరించుకొని
చెంప ఛెళ్లుమనిన సందర్భాలెన్నో !
నేరం నాదే..
నేరస్థుడే కనపడటం లేదు
లెక్కతేలని కత్తిపోట్లతో
కొన ఊపిరితో తప్పిపోయిన నేను
నాకు కనపడుట లేదు

– రామ్‌ పెరుమాండ్ల, 9542265831

➡️