ఎన్ని కలలు మోసానో ఈ కళ్ళతో
ఎన్ని తలంపులు చేశానో మనసుతో
బురద నుండి తామరలాగా ఎదగాలని
ఎన్నో కన్నీటి బొట్లను జారవిడిచాను..!
లేత కిరణాల స్పర్శ కోసం తపించి
శ్రమతో సూర్యుని వెంట పరిగెత్తుకుంటూ
ఇనుడిని సాగనంపుతూ ఇల్లు చేరా
బతుకు బండిని చెమట చుక్కలు అమ్మి లాగాను..!
అక్షర ముక్కల మేతకోసం బాల్యమంతా నడిచా
దీపం ముందు ముఖాన్ని కాల్చి చదివా
చిలిపి బాల్యంలో చిందులేస్తూ తిరిగితే
యవ్వనమంతా పుస్తకాల ప్రేమలో గడిచిపోయే..!
కళ్ళ ముందు సంఘటన కవిత్వమై నడిచే
నేర్చిన చదువు అక్షరాలను పేర్చి గర్జించే
గొంగళిపురుగు సీతాకోకచిలుకలా ఎగిరితే
సమాజంలోని రంగులు సాహిత్యమై ఆకర్షించే..!
రేపటి ఆశలతో నిత్యం ప్రయాణం సాగిస్తూ
ఆకాశవీధిలో గాలిపటంలా ఎగురుతూ
గమ్యం తెలియని దారుల్లో ఇంకా తిరుగుతూ
ఎన్నో కావ్యాలను నిత్యం నెమరువేసుకుంటున్నాను..!
ఇంటికి అతిథుల్లా పుస్తకాలు చేరుతున్నాయి
గూటి నిండా అక్షరాలు తెచ్చిన జ్ఞాపికలు
తరగని ఆస్తులై నిత్యం మనసులో పలకరిస్తుంటే
ప్రతి క్షణం అదో లోకంలో జీవనం గడిపేస్తున్నాను!
సంఘంలో కవి ముద్రను వేసుకున్నా
కలం కాగితం స్నేహంతో కలిసిపోయి జీవిస్తూ
హృదయ ఉద్రేకాలను అక్షరబద్ధం చేస్తూ
నేనొక కావ్యమై సమాజ క్షేమం కాంక్షిస్తున్నా..!
– కొప్పుల ప్రసాద్, 9885066235