‘బాగోలేదు.. కడుపులో నొప్పిగా ఉంది.. అన్ ఈజీగా ఉంది.. రాలేకపోతున్నా..’ అంటూ ఏవేవో కారణాలు చెప్పి కాలేజీకి సెలవు పెడుతుంటారు చాలామంది. ఎవరూ నేరుగా పీరియడ్స్ వచ్చాయి.. ఇబ్బందిగా ఉంది.. రాలేకపోతున్నామని ధైర్యంగా చెప్పేవారు అరుదు. ఇలా తమ విద్యార్థినులు ఇబ్బందిని అర్థంచేసుకున్న సంస్థలు కొన్నిచోట్ల ‘పీరియడ్స్ సెలవు’ ప్రకటించాయి. అలాంటివాటిల్లో గువహటి విశ్వవిద్యాలయ యాజమాన్యం ఒకటి. అయితే ఇప్పటికీ దేశంలో తొలిసారిగా కేరళ వంటి రాష్ట్రాల్లో కొన్ని విద్యాసంస్థలు పీరియడ్స్ సెలవును పాటిస్తున్నాయి. అయితే అవి ఎక్కడెక్కడో.. వాటి విధివిధానాలు ఏమిటో తెలుసుకుందాం..
పీరియడ్స్ సెలవు.. అంతర్జాతీయంగా దీనిపై ఎన్నో సంవత్సరాల నుంచి చర్చ జరుగుతోంది. ఈ క్రమంలోనే కొన్ని దేశాలు దీన్ని చట్టబద్ధంగా అమలు చేస్తున్నాయి. మరికొన్ని దేశ, విదేశీ సంస్థలూ తమ ఉద్యోగినులకు ఈ సెలవును ఇస్తున్నాయి. ఇక ఈ జాబితాలో మన దేశానికి చెందిన కొన్ని విశ్వవిద్యాలయాలూ ఒక్కొక్కటిగా చేరుతున్నాయి. తాజాగా అసోంలోని గువహటి విశ్వవిద్యాలయం తమ విద్యార్థినులకు పీరియడ్స్ సెలవు ఇస్తున్నట్లు ప్రకటించింది. ఈ క్రమంలో అందుకు సంబంధించిన నిబంధనల్ని పేర్కొంది.హాజరులో రెండు శాతం.. మనదేశంలో ప్రస్తుతం పీరియడ్స్ సెలవుకు సంబంధించి చట్టమంటూ ఏదీ లేదు. ఇలాంటి ప్రతిపాదనేదీ తమ పరిశీలనలో లేదని గతంలో స్త్రీశిశు సంక్షేమ శాఖ ఒక సందర్భంలో పేర్కొంది. అయితే విద్యార్థినుల సౌకర్యార్థం వారికి ఈ సెలవును అందించాలని విద్యాసంస్థలు పిలుపునిచ్చిన నేపథ్యంలో.. ఒక్కో విశ్వవిద్యాలయం తమ విద్యార్థినులకు ఈ సెలవును అందిస్తున్నాయి. అసోంలోని గువహటి విశ్వవిద్యాలయం కూడా తమ విద్యార్థినుల ఆరోగ్యానికి ప్రాధాన్యమిస్తూ పీరియడ్స్ సెలవును అందిస్తున్నట్లు ప్రకటించింది. ఈ క్రమంలో విద్యార్థినులకు మొత్తం హాజరులో రెండు శాతం సడలింపు ఇచ్చింది. ఇప్పటికే దీనిపై రూపొందించిన పాలసీ ప్రకారం.. సెమిస్టర్ పరీక్షలు రాయడానికి అర్హత సాధించాలంటే ప్రతి విద్యార్థినికి 73 శాతం హాజరు తప్పనిసరి చేసింది. ‘మహిళల సంపూర్ణ ఆరోగ్యంలో పీరియడ్స్ పరిశుభ్రత – ఆరోగ్యం కీలకపాత్ర పోషిస్తాయి. జీవితంలోని ప్రతి దశపైనా ఇది ప్రభావం చూపుతుంది. అందుకే నెలసరి ఆరోగ్యం విషయంలో వారికి ఎలాంటి ఇబ్బందీ కలగకుండా ఉండడానికి ఈ నిర్ణయం దోహదం చేస్తుంది’ అంటూ ఓ సీనియర్ అధికారి వెల్లడించారు. కేరళ ఫస్ట్ బెస్ట్!ఫస్ట్ ఈజ్ బెస్ట్ అన్నట్లు కేరళ ఈ విషయంలో మొదటి స్థానంలో ఉంది. గువహటి విశ్వవిద్యాలయం కంటే ముందే పీరియడ్స్ సెలవును ఇవ్వనున్నట్లు ఈ ఏడాది జనవరిలోనే ప్రకటించింది. కేరళలోని ‘కొచ్చి యూనివర్శిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ’ ఇందుకు ముందుకు వచ్చింది. తద్వారా దేశంలోనే పీరియడ్స్ సెలవును తెర మీదికి తెచ్చిన తొలి రాష్ట్రంగా కేరళ ఘనత సాధించింది. కొన్నేళ్లుగా అక్కడి విద్యార్థినుల డిమాండ్ నేపథ్యంలో సదరు విద్యాసంస్థ ఈ ప్రకటన విడుదల చేసింది. ఈ క్రమంలో ఆ యూనివర్శిటీకి చెందిన అన్ని విభాగాల్లో కలిపి దాదాపు నాలుగు వేల మందికి పైగా విద్యార్థినులు ఈ సెలవును ఉపయోగించుకునే అవకాశం లభించింది. ఇక ఈ విశ్వవిద్యాలయం రూపొందించిన పాలసీలో భాగంగా.. ప్రతి సెమిస్టర్‌కు కావాల్సిన హాజరులో రెండు శాతం సడలింపును ఇచ్చారు. అలాగే 75 శాతం హాజరు ఉంటేనే పరీక్షలు రాయడానికి అనుమతి ఇచ్చింది యాజమాన్యం. కొచ్చి యూనివర్శిటీ తర్వాత.. అసోంలోని ‘తేజ్‌పూర్ యూనివర్శిటీ’, ‘నేషనల్ లా యూనివర్శిటీ- జ్యుడీషియల్ అకాడమీ’, మధ్యప్రదేశ్ జబల్‌పూర్‌లోని ‘ధర్మశాస్త్ర నేషనల్ లా యూనివర్శిటీ’ తదితర విద్యాసంస్థలు సైతం నెలసరి సెలవును ప్రకటించాయి.కేరళలోని ఎర్నాకుళం జిల్లాలో ఉన్న త్రిపునితుర ప్రభుత్వ బాలికల పాఠశాలలో చదువుకునే విద్యార్థినులకు కూడా పీరియడ్స్ లీవును అందిస్తున్నారు. ఆ పాఠశాలలో చదువుకొనే విద్యార్థినులు, పాఠాలు చెప్పే ఉపాధ్యాయునులకు కూడా పీరియడ్స్ సెలవు తీసుకునే వెసులుబాటును ఎప్పటి నుంచో కల్పిస్తోంది. బీహార్‌లోనూ.. విద్యార్థినులే కాదు.. కొన్ని సంస్థల ఉద్యోగినులూ నెలసరి సెలవుతో లబ్ధి పొందుతున్నారు. ఈ క్రమంలో బీహార్ రాష్ట్ర ప్రభుత్వం 1992 నుంచే ప్రభుత్వ ఉద్యోగినులకు రెండు రోజుల పీరియడ్స్ సెలవును అందిస్తోంది. అక్కడి ప్రభుత్వోద్యోగినుల శారీరక కారణాల దృష్ట్యా ప్రతినెలా రెండు రోజులు ప్రత్యేక సెలవులు తీసుకునే అవకాశం ఉంది. ఇతర సెలవులకు అదనంగా వీటిని అందించడం మంచి నిర్ణయం. ఇలా ప్రభుత్వ ఉద్యోగినులకు ఇక్కడే ‘బయలాజికల్ రీజన్స్’ పేరిట నెలకు రెండు రోజులు సెలవులు అందిస్తోన్నారు. ఇప్పటికే కొన్ని ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సంస్థలు, డిజిటల్ మీడియా సంస్థలు, స్టార్టప్స్.. తదితర ప్రయివేటు కంపెనీలు పీరియడ్స్ సెలవును అందిస్తూ.. మహిళల నెలసరి ఆరోగ్యానికి ప్రాధాన్యతనిస్తున్నాయి.