– మహిళలపై హింసను వ్యతిరేకించండి
– డ్రగ్స్ ను మత్తుపదార్థాలను అరికట్టాలి
ప్రజాశక్తి – బాపట్ల రూరల్
మహిలలపై హిసా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో స్థానిక శ్రీ చైతన్య బాలికల జూనియర్ కళాశాలలో సెమినార్ శనివారం నిర్వహించారు. సెమినార్‌కు ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఆర్య అధ్యక్షత వహించారు. సెమినార్లో బార్ అసోసి యేషన్ ప్రెసిడెంట్ బీమా లీలా కృష్ణ, సీనియర్ అడ్వకేట్ నందవనం ప్రసాదరావు, కిరణ్ కుమార్, ఐద్వా జిల్లా నాయకురాలు టి సుభాషిని మాట్లాడారు. ప్రపంచవ్యాప్తంగా మహిళలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై పరిష్కారానికి ఐక్యరాజ్యసమితి ప్రతి సంవత్సరం నవంబర్ 25న హింస వ్యతిరేక దినోత్సవంగా ప్రకటించిందని అన్నారు. ప్రస్తుతం భారతదేశంలో ప్రతి గ్రామంలోనూ మహిళలు ఏదో ఒకచోట హింసకు గురవుతుందని అన్నారు. సామాజికంగా ఆర్థికంగా, రాజకీయంగా, మానసికంగా జరుగుతున్న వేధింపులు ఎక్కువ అవుతున్నాయని అన్నారు. పాఠశాల స్థాయి నుంచి యూనివర్సిటీ విద్యార్థుల వరకు డ్రగ్స్‌కు విపరీతంగా అలవాటు పడుతున్నారని అన్నారు. విద్యావ్యవస్థలో అమలవుతున్న సరళీకృత ఆర్థిక విధానాలు విద్యార్థుల భవిష్యత్తును అగమ్య గోచరంగా మార్చాయని అన్నారు. మద్యాన్ని నియంత్రించాల్సిన ప్రభుత్వాలు మద్యంతో వ్యాపారం చేస్తున్నాయని అన్నారు. విద్యాబుద్దులు, క్రమశిక్షణ నేర్పాల్సిన ఉపాధ్యాయులను మద్యం దుకాణాల వద్ద కాపలా పెట్టే ప్రభుత్వాలు విద్యావ్యవస్థను ఎలా చూస్తున్నాయో అర్దం చేసుకోవాలని అన్నారు. యువతలో అవగాహన కార్యక్రమాలు మరెన్నో జరగాల్సిన అవసరం ఉందని అన్నారు. అటువంటి కార్యక్రమాన్ని ఎస్ఎఫ్ఐ ముందుకు తీసుకురావడం సంతోషకరమైన పరిణామమని అభినందించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ మోహనరావు, అధ్యాపకులు, విద్యార్థినిలు పాల్గొన్నారు.
రేపల్లె : మహిళలపై హింసా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో స్థానిక శ్రీ చైతన్య జూనియర్ కళాశాలలో శనివారం సదస్సును నిర్వహించారు. సదస్సుకు ఎస్ఎఫ్ఐ రేపల్లె గర్ల్స్ కో కన్వీనర్ హేమ అధ్యక్షత వహించింది. సదస్సులో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు పి మనోజ్ కుమార్ మాట్లాడుతూ 75ఏళ్ల స్వతంత్ర దేశంలో స్త్రీ లైంగిక వస్తువుగాని మారిపోయిందని అన్నారు. మహిళలపై హింస ఏదో ఒకచోట జరుగుతూనే ఉందని అన్నారు. లెక్కల పరిశీలిస్తే 2011లో రెండు లక్షల ఇరవై ఎనిమిది వేల మందిపైగా మహిళలు హింసకు గురైనట్టు కేసులు నమోదైతే 2022నాటికి నాలుగు లక్షల ఇరవై ఎనిమిది వేలపైగా కేసులు నమోదైనట్టు రికార్డులు చెబుతున్నాయని అన్నారు. హింసకు గురై పోలీస్ స్టేషన్ వరకు రానటువంటి కేసులు లక్షల్లో ఉంటాయని అన్నారు. మహిళలపై జరుగుతున్న హింసను అరికట్టేందుకు ప్రభుత్వాలు రక్షణ వ్యవస్థతో పాటు సమాజంలో పౌరులుగా విద్యార్థులు కూడా కృషి చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. బడి, గుడి, బహిరంగ ప్రదేశం అనే తేడా లేకుండా మహిళలపై హింస జరుగుతుందని అన్నారు. గంజాయి, మద్యం, మత్తు పదార్థాల విచ్చలవిడి వల్లనే హింస అధికమైందని అన్నారు. మానవ అక్రమ రవాణాలో 50శాతం భారత దేశంలో ఉందని అన్నారు. ఇటువంటివి నిర్మూలించేందుకు పటిష్టమైన రక్షణ చర్యలు చేపట్టాలని కోరారు. సిఐటియు బాపట్ల జిల్లా అధ్యక్షులు సిహెచ్ మణిలాల్ మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాలలో పురోగమిస్తున్నప్పటికీ ఇంకా అణిచివేత, హింసకు గురవుతున్నారని అన్నారు. కాలేజీ, స్కూలు, ఆఫీసు, పోలీస్ స్టేషన్ కూడా మినహాయింపు కాదని అన్నారు. ఒంటరి మహిళలకు రక్షణ లేకుండా పోతుందని అన్నారు. రాజ్యాంగం అందరికీ సమాన హక్కులు ఇచ్చినప్పటికీ అవి కేవలం కాగితాలకు పరిమితం అయ్యాయని అన్నారు. మహిళలు, యువతలపై దాడుల వార్త లేని రోజు లేదని అన్నారు. వీటిని నియంత్రించడానికి విద్యార్థుల పాత్ర కీలకమైందని అన్నారు. కానీ ఆ విద్యార్థులే మద్యం, డ్రగ్స్ వంటివి తీసుకోవడం ద్వారా విచక్షణ కోల్పోయి హింసకు పాల్పడుతున్న ఘటనలు ఉన్నాయని అన్నారు. ప్రభుత్వాలు తక్షణం గంజాయి, మద్యం, మత్తు పదార్ధాల విక్రయాలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో శ్రీ చైతన్య జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ రజనీబాబు, ఎస్ఎఫ్ఐ నాయకులు నవీన్ మహాలక్ష్మి, వరలక్ష్మి, నాగరాజు, చిరంజీవి పాల్గొన్నారు.