సవాల్‌గా మారిన ప్రాధాన్యతా భవనాలు

రాష్ట్ర వ్యాప్తంగా 2019-20 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం గ్రామ సచివాయాలకు, రైతు భరోసా కేంద్రాలు, వెల్‌నెస్‌ హెల్త్‌ సెంటర్లకు భవన నిర్మాణాలకు

అసంపూర్తిగా నిలిచిన ఆమదాలవలస మండలం గాజులకొల్లివలస సచివాలయం

  • ఒత్తిళ్ల నడుమ పంచాయతీరాజ్‌ ఇంజినీర్లు
  • చెల్లింపుల్లేక అవస్థలు పడుతున్న కాంట్రాక్టర్లు
  • 2019-20 నుంచి ముందుకు సాగని పనులు
  • మంజూరైనవి 1839, రద్దయినవి 385
  • పూర్తి చేసినవి 784, బకాయిలు రూ.8.35 కోట్లు

ప్రభుత్వం మంజూరు చేసిన పాధాన్యతా భవనాలు పంచాయతీరాజ్‌ శాఖ ఇంజినీర్లకు సవాల్‌గా మారాయి. మంజూరు చేసి ఏళ్లు గడుస్తున్నా పనులు పూర్తి కావడం లేదు. నిబంధనలను కాదని మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి చట్టం నిధులతో భవన నిర్మాణాలకు మంజూరు చేశారు. పెరిగిన ధరల ప్రభావం ఈ భవనాలపై పడింది. సకాలంలో చెల్లింపులు చేపట్టకపోవడంతో అనేక నిర్మాణాలు అర్ధాంరంగా నిలిచిపో యాయి. ఈ పనులు పూర్తి చేయకపోతే సస్పెండ్‌ చేస్తామంటూ ఉన్నత స్థాయిలో ఇంజినీరింగ్‌ అధికాకులపై ఒత్తిడి తెస్తున్నారు. వాస్తవానికి భిన్నంగా వీటి నిర్మాణం పూర్తి సాధ్యం కాదని ఇంజినీర్లు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికే ఈ భవన నిర్మాణాల్లో వెనుక బడ్డారన్న కారణంతో ముగ్గురు ఎఇలకు సస్పెన్షన్‌, ఇఇకి సరెండర్‌, ఎస్‌ఇకి షోకాజ్‌ నోటీసులకు సిఫార్సు చేశారు.

ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌

రాష్ట్ర వ్యాప్తంగా 2019-20 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం గ్రామ సచివాయాలకు, రైతు భరోసా కేంద్రాలు, వెల్‌నెస్‌ హెల్త్‌ సెంటర్లకు భవన నిర్మాణాలకు ఎన్‌ఆర్‌ఇజిఎస్‌ నిధులతో మంజూర్లు ఇచ్చారు. ఈ భవనాలను ప్రాధాన్యతగా ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లాలో గ్రామ సచివాలయ భవనానికి రూ.40 లక్షలు, రైతు భరోసా కేంద్రాలకు రూ.21.8 లక్షలు, వెల్‌నెస్‌ సెంటర్లకు రూ.17.5 లక్షల అంచనాలతో మంజూర్లు ఇచ్చారు. జిల్లాలో ఉన్నతాధికారులు 1839 భవన నిర్మాణాలను అనుమతులు మంజూరు చేశారు. ఈ పనులు స్థానికంగా ఉన్న పాలక పక్షానికి చెందిన నాయకులు, చిన్న చిన్న కాంట్రాక్టర్లకు అప్పగించి పనులు మొదలు పెట్టారు. ఇసుక లభ్యత లేక, సకాలంలో చెల్లింపులు జరగకపోవడం, ఇతర కారణాల వల్ల మొదట్లోనే పనులు ప్రారంభించడం ఆలస్యమైంది. స్థల వివాదాలు, సాంకేతిక పరమైన ఇబ్బందుల వల్ల జిల్లాలో 385 భవన నిర్మాణాలు మొదలు కాలేదు. మిగిలిన 1454 భవనాలకు సంబంధిత వ్యక్తులు పనులు మొదలు పెట్టారు. బిల్లుల చెల్లింపుల్లో జాప్యం వల్ల కొందరు మధ్యలో పనులు నిలుపుదల చేశారు. దీంతో రెండేళ్లు గడచింది. ఎన్‌ఆర్‌ఇజిఎస్‌ నిబంధనలకు లోబడి పనులు మంజూరైన తర్వాత ఏడాది లోపు వాటిని పూర్తి చేయాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం అనుమతిస్తే మరో ఏడాది పాటు ఆ పనులు పూర్తి చేసుకునేందుకు వీలుంటుంది. చెల్లింపులు మాత్రం పనులు మంజూరైన నాటి ధరలకే పూర్తి చేయాల్సి ఉంటుంది. జిల్లాలో నిర్మాణంలోని 1454 భవనాలను 2019-20లో ప్రారంభించిన వారు 2020-21లోగా పూర్తి చేస్తే చెల్లింపులకు వీలుంటుంది. అయితే ఈ నిర్మాణాలు ప్రారంభం నాటికి ఇసుక టన్ను రూ.350 ఉంటే… ఇప్పుడు ఆ ధర రెండింతలైంది. ప్రస్తుతం గ్రామాల్లో రూ.700 నుంచి 800 వరకు ఇసుక అమ్ముతున్నారు. సిమెంట్‌ ధర పనులు మంజూరు నాటికి రూ.210 ఉంటే… ఇప్పుడు బస్తా ధర రూ.350 వరకు ఉంది. ఇనుము ధర టన్ను రూ.25 వేల నుంచి రూ.60 వేలకు పెరిగింది. దీంతో అరకొర పెట్టుబడులు పెట్టి పనులు చేసుకునే కార్యకర్తలు, చిరు కాంట్రాక్టర్లు పనులు పూర్తి చేయలేమని చేతులెత్తేశారు. దీంతో జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 784 భవనాలు మాత్రమే పూర్తి చేయగలిగారు. మరో ఆరు దాదాపు పూర్తి దశలో ఉండగా, 95 రూప్‌ లెవల్లో, అంతకంటే తక్కువగా 332, రెండో రూప్‌ దశలో 146, ప్లాస్టింగ్‌ దశలో 90 భవనాలు ఉన్నాయి. చెల్లింపుల పరిస్థితి చూస్తే జిల్లాలో రూ. 8.35 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. మరో 790 బిల్లు అప్‌లోడ్‌ చేయడానికి సిద్ధంగా ఉంచారు. వీటి విలువ రూ.100 కోట్లు పైనే. పనులు పూర్తి చేయడానికి ఇంకా 670 భవనాలు వివిధ దశల్లో కొనసాగుతున్నాయి. అడ్డంకులుపనులు గతంలో ప్రారంభించిన వారు వాటిని పూర్తి చేయడానికి వెనకడుగు వేస్తున్నారు. ఉపాధి పథకం నుంచి ఈ పనులకు కొత్తగా మంజూర్లు రాకపోవడం, ప్రభుత్వం నుంచి బకాయిలు పేరుకుపోవడం ప్రధాన అడ్డంకిగా మరింది. పెరిగిన ధరలకు అనుగుణంగా చెల్లింపులు జరపడానికి అంచనాలు పెంచుకునే అవకాశం ఉపాధి పనుల్లో లేకపోవడం కూడా అడ్డంకే. దీంతో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. తీనికితోడు ఎన్నికల సమయం దగ్గర పడుతుండడంతో పనులు పూర్తి చేస్తే… మిగిలిన డబ్బులు వస్తాయో? రావో? తెలియని పరిస్థితి ఉంది. గత ప్రభుత్వ హయాంలో అప్పటి టిడిపి కార్యకర్తలు నీరు-చెట్టు, ఉపాధి నిధులతో వేసిన రోడ్లకు రూ.వందల కోట్లు నిలిచిపోయాయి. ప్రస్తుత ప్రభుత్వం వాటిని చెల్లించకుండా నిలుపుదల చేసింది. న్యాయస్థానంలో పోరాడినా ఇంతవరకు వారికి చెల్లింపులు జరగలేదు. ఇప్పుడు పనులు చేస్తే అటువంటి పరిస్థితి ఎదురయ్యే ప్రమాదం ముందని భావించి పనులు చేసేందుకు ముందుకు రావడం లేదు. ఇటువంటి స్థితిలో ఈ పనుల ప్రాధాన్యత గుర్తించడం లేదంటూ పంచాయతీరాజ్‌ శాఖ ఇంజినీర్లపై ఒత్తిడి పెంచుతున్నారన్న భావన సర్వత్రా వ్యక్తమవుతోంది. పెండింగ్‌ పనుల పూర్తికి చర్యలుజిల్లాలో ప్రభుత్వ ప్రాధాన్యత భవనాలను త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. గ్రామాల్లో పనులు చేపట్టేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రావాలి. చెల్లింపులకు ఎటువంటి అడ్డంకి లేకుండా ఉన్నత స్థాయి అధికారుల దృష్టికి ఎప్పటికప్పుడు తీసుకెళ్తున్నాం.

– వి.ఎస్‌.ఎన్‌ మూర్తి, సూపరింటెండెంట్‌, పంచాయతీరాజ్‌ శాఖ

 

➡️