వంట కార్మికులకు కనీస వేతనం అమలు చేయాలి

మధ్యాహ్న భోజనం పథకంలో పనిచేస్తున్న వంట కార్మికులకు కనీస వేతనాలు అమలు

మాట్లాడుతున్న మాట్లాడుతున్న మహాలక్ష్మి

ప్రజాశక్తి- రణస్థలం

మధ్యాహ్న భోజనం పథకంలో పనిచేస్తున్న వంట కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలని, మెనూ ఛార్జీలు పెంచాలని ఎపి మధ్యాహ్నం భోజన పథకం కార్మిక యూనియన్‌ జిల్లా గౌరవ అధ్యక్షులు అల్లు మహాలక్ష్మి ప్రభుత్వానికి డిమాండ్‌ చేశారు. యూనియన్‌ మండల కార్యదర్శి వి.లక్ష్మి అధ్యక్షతన స్థానిక హైస్కూల్‌ ఆవరణలో మధ్యాహ్నం భోజన పథకం కార్మికుల సమావేశం శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 20 ఏళ్లుగా పనిచేస్తున్న వంట కార్మికులకు కనీస వేతనాలు, పిఎఫ్‌, ఇఎస్‌ఐ ఉద్యోగ భద్రత, పెన్షన్‌ వంటివి అమలు చేయాలన్నారు. ప్రపభుత్వాలు లక్ష్యానికి విరుద్ధంగా పథకాన్ని నీరుగార్చేందుకు నిరంతరం బడ్జెట్లో కోతలు పెడుతున్న పరిస్థితి ఉందన్నారు. వంట చేస్తున్న సమయంలో అగ్ని ప్రమాదాలకు గురయ్యే అవకాశాలు ఉన్నా… ఎలాంటి వైద్య బీమా సౌకర్యం లేకపోవడం అన్యాయమన్నారు. అనేక స్కూళ్లలో ప్రథమ చికిత్స కూడా ఉండడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వంట షెడ్లు, వంట పాత్రలు, తాగునీరు, గ్యాస్‌ సరఫరా వంటి మౌలిక సదుపాయాలు ప్రభుత్వం కల్పించకపోవడం అన్యాయమన్నారు. జగనన్న గోరుముద్ద పేరుతో ఇస్తున్న మెనూ ఛార్జీలకు సంబంధం లేకుండా రోజుకో వంటతో ప్రభుత్వం మెనూ తయారు చేసి వర్కర్లపై భారాన్ని మోపుతుందన్నారు. రాగి జావా తయారీకి గ్యాస్‌ వంటపాత్ర ఎంతైనా అవసరమని, ప్రభుత్వం వీటిని సరఫరా చేయాలని డిమాండ్‌ చేశారు. నూతన విద్యా విధానం అమలు వల్ల వంట కార్మికులు ఉపాధి కోల్పోతున్నారని అన్నారు. ప్రతినెలా 5 లోగా వేతనాలు, బిల్లులు చెల్లించాలన్నారు. ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలన్నారు. డిమాండ్ల సాధనకు కార్మికులు పోరాటాలకు సిద్ధం కావాలన్నారు. అలాగే ఈ నెల 27,28 తేదీల్లో విజయవాడలో జరిగే కార్మిక, కర్షక ధర్నాలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో మండల నాయకులు రాము, సుగుణ, జ్యోతి, లక్ష్మి, బుల్లమ్మ, ఈశ్వరమ్మ, సింహాచలం, రాములమ్మ, నారాయణమ్మ శాంతమ్మ, భవాని, ఎం.రామలక్ష్మి, కె.అన్నపూర్ణ పాల్గొన్నారు.

 

➡️