‘ఉక్కు’పై బిజెపి అక్కసు

'నవ్వి పోదురుగాక మాకేటి సిగ్గు అన్న తీరు'గా ఉంది బిజెపి నేతల తీరు. ఉత్తరాంధ్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను ప్రయివేటీకరణ చేసే ప్రయత్నాలు సాగిస్తూనే... ప్రయివేటీకరణను అడ్డుకుంటున్న

ప్రజాశక్తి- శ్రీకాకుళం ప్రతినిధి

‘నవ్వి పోదురుగాక మాకేటి సిగ్గు అన్న తీరు’గా ఉంది బిజెపి నేతల తీరు. ఉత్తరాంధ్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను ప్రయివేటీకరణ చేసే ప్రయత్నాలు సాగిస్తూనే… ప్రయివేటీకరణను అడ్డుకుంటున్న వామపక్షాలు, ఇతర ప్రజా సంఘాలపై బిజెపి ఎంపి జివిఎల్‌ నరసింహారావు నోరుపారేసుకోవడంపై తీవ్ర విమర్శలకు దారితీసింది. శ్రీకాకుళంలో ఈ నెల 23న రాజ్యసభ సభ్యులు జివిఎల్‌ నిర్వహించిన విలేకరుల సమావేశంలో విశాఖ ఉక్కు పోరాటంపై తన అక్కస్సు వెళ్లగక్కారు. విశాఖ ఉక్కును కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం దక్షిణ కొరియాకు చెందిన పోస్కో కంపెనీ, అదానీ వంటి కార్పొరేట్లకు కారు చౌకగా అమ్మేసేందుకు ఇప్పటికీ రకరకాల ప్రయత్నాలు చేస్తూనే ఉంది. కేంద్రం తీరును నిరసిస్తూ విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యాన వామపక్షాలు, ప్రజా, కార్మిక, ఉద్యోగ సంఘాల నాయకులు విశాఖపట్నం కూర్మనపాలెంలో వెయ్యి రోజులకు పైగా దీక్షలు సాగిస్తూనే ఉన్నారు. ఓ పక్క దీక్షలు కొనసాగిస్తుండగానే మరోవైపు ప్లాంట్‌ ప్రయివేటీకరణకు కేంద్ర ప్రభుత్వం తన పయత్నాలు సాగిస్తూనే ఉంది. నాడు ప్లాంట్‌ ఏర్పాటు కోసం పోరు సాగిస్తే నేడు దానిని కాపాడుకోవడం కోసం అవిశ్రాంతంగా పోరు సాగిస్తున్నారు. 32 మంది ప్రాణాలు అర్పించడంతో పాటు వామపక్ష ఎంపీల రాజీనామాలతో నాడు విశాఖ ఉక్కును సాధించుకోలిగారు. ఇంతింతై వటుడింతై అన్నట్లు ప్లాంట్‌ ఆస్తుల విలువ ఇప్పుడు లక్షల కోట్లకు చేరింది. పైగా ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్ష మందికి ఉపాధి ఉద్యోగ అవకాశాలను కల్పిస్తోంది. కరోనా కాలంలో దేశ వ్యాప్తంగా ఆక్సిజన్‌ను సరఫరా చేసి ఆపద్బాంధువుగా నిలిచింది. రోగులకు ప్రాణం పోసిన స్టీల్‌ ప్లాంట్‌ ప్రాణాలనే తీసేందుకు బిజెపి ప్రభుత్వం ప్రయత్నాలు సాగిస్తోంది. స్టీల్‌ ప్లాంట్‌కు సొంత గనులు కేటాయించకుండా నష్టాలు బారిన పడేలా చేసి, తర్వాత నష్టాలను సాకుగా చూపి ప్రయివేటీకరణకు తెగబడుతోంది. అలుపు ఎరగని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ పోరాటం వల్లే విశాఖ ఉక్కు ప్రయివేటీకరణ ఆగిందని చెప్పడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు. బిజెపి నేతలు మాత్రం వాస్తవాలను విస్మరించి నోటికొచ్చినట్లు మాట్లాడటం వారికే చెల్లింది. స్టీల్‌ ప్లాంట్‌ ప్రయివేటీకరణ ఆగిందంటూ బిజెపి ఎంపి జివిఎల్‌ చెప్పడం విడ్డూరంగా ఉంది. ఆ మాట చెప్పాల్సింది కేంద్ర ప్రభుత్వం. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఓ వైపు ప్రయివేటీకరణ ప్రయత్నాలు చేస్తూ… మరో పక్క ఆ పార్టీ ఎంపీ మాత్రం ప్రయివేటీకరణ నిలిచిపోయిందని చెప్పడం ప్రజలను వంచించడమే అవుతుంది. దేశంలో 40 మిలియన్‌ టన్నుల స్టీల్‌ను ఉత్పత్తి చేస్తున్న ఓ ప్రయివేట్‌ కంపెనీ కేవలం 4 వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే విశాఖ ఉక్కు పరిశ్రమ 7.3 మిలియన్‌ టన్నులను ఉత్పత్తి చేస్తూ 32 వేల మందికి ఉద్యోగాలను కల్పిస్తోంది. విశాఖ ఉక్కును బిజెపి ప్రభుత్వం పయివేటీకరిస్తే రాబోవు రోజుల్లో జరిగేది ఇదే. వాస్తవాలను తెలుసుకోకుండా కొందరి వల్ల స్టీల్‌ ప్లాంట్‌ ఉద్యోగులు నష్టపోతున్నారంటూ ఎంపీ జివిఎల్‌ నరసింహారావు ముసలికన్నీరు కారుస్తున్నారు. ప్లాంట్‌ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా పోరాడుతున్న వారి నుద్దేశించి ఎంపీ అవాకులు చెవాకులు పేలడంపై జనం మండిపడుతున్నారు ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందిపోతుందంటూ ఎంపీ జివిఎల్‌ చెప్పడం ఆశ్చర్యంగా ఉంది. విశాఖను కేంద్రం గ్రోత్‌ హబ్‌గా తీసుకొందని గొప్పలు చెప్తున్నారు. విభజన చట్టంలో పేర్కొన్న అంశాల అమలు జోలికి మాత్రం వెళ్లడం లేదు. విశాఖకు రైల్వే జోన్‌ ఇవ్వకుండా తొమ్మిదేళ్లుగా జనాన్ని మోసం చేస్తూనే ఉన్నారు. రైల్వే జోన్‌ ఇస్తే ఉత్తరాంధ్ర ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి అదే పెద్ద గ్రోత్‌ హాబ్‌ అవుతుందే తప్ప ఉత్తుత్తి హబ్‌లతో ఏం ప్రయోజనం ఒనగూరుతుంది. విభజన చట్టం ప్రకారం ఉత్తరాంధ్రలోని మూడు, రాయలసీమ జిల్లాలోని నాలుగు జిల్లాలకు ఇవ్వాల్సిన వెనుకబడిన నిధులను ఐదేళ్లుగా బిజెపి ప్రభుత్వం ఆపేసింది. చట్టం ప్రకారం ఈ ప్రాంతానికి రావాల్సిన నిధులు, రైల్వే జోన్‌ ఇవ్వకుండా ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతుందంటూ బిజెపి ఎంపీ చెప్పడం ప్రజలను మోసగించడమే అవుతుంది. ఉత్తరాంధ్రకు తీవ్ర అన్యాయం చేస్తున్న బిజెపిపై ఇప్పటికే ప్రజలు తీవ్ర ఆగ్రహాంతో ఉన్నారు. జనం వద్దకు వెళ్లేందుకు ముఖం చెల్లక కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులతో చేపడుతున్న పనుల పరిశీలన పేరుతో జిల్లాల్లో ఆ పార్టీ రాష్ట్ర నేతలు పర్యటిస్తున్నారు. బిజెపి అధ్యక్షులు పురంధేశ్వరి ఈ నెల 24న జిల్లా పర్యటనకు వచ్చారు. శ్రీకాకుళం నగరంలో మిర్తిబట్టి వద్ద కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపడుతున్న తాగునీటి శుద్ధి కేంద్రం సందర్శించాలని తొలుత నిర్ణయించి… తర్వాత రద్దు చేసుకున్నారు. జిల్లా అభివృద్ధికి కేంద్రం ఎంతెంత మొత్తంలో గ్రాంట్ల రూపంలో ఇస్తుందో విలేకరుల సమావేశంలో ఏకరవు పెట్టారు. దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు, జిల్లాలకు కేంద్రం నిధులు ఇవ్వడం అభివృద్ధి ప్రక్రియలో నిరంతర భాగంగానే చూడాలి. కేంద్రంలో ఇప్పుడు బిజెపి ఇస్తే గతంలో దేశాన్ని పాలించిన పార్టీలు నిధులను కేటాయించాయన్న విషయం గుర్తించాలి. ఇది సర్వసాధారణ అంశం. ఇవి కాకుండా జిల్లాకు ప్రత్యేకంగా ఏమి ఇచ్చారో, విభజన చట్టంలో పేర్కొన్న అంశాలను ఎంత వరకు బిజెపి ప్రభుత్వం అమలు చేసిందనే అంశాలకు మాత్రం బిజెపి నేతల నుంచి సమాధానం రావడం లేదు. ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మాయ మాటలతో జనం మధ్య వచ్చేందుకు వస్తున్న బిజెపిపై ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.

➡️