ఫొటో : తమగోడు చెప్పుకుంటున్న బాధితులు
కులధ్రువీకరణ లేక విద్యకు దూరం
ప్రజాశక్తి-ఉదయగిరి : వందేళ్ల ప్రస్థానంలో ఎస్సి మోచీ తెగకు కులధ్రువీకరణ కరువు కావడంతో ప్రభుత్వ పథకాలు విద్యార్థులువిద్యకు దూరమయ్యారని కుటుంబ సభ్యులు వాపోతున్నారు. శనివారం స్థానిక యూనియన్ రోడ్ సమీపంలోని ఎస్సి మోచీ 10 కుటుంబాలు రోడ్డెక్కి వారి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉదయగిరి ప్రాంతాన్ని నావాబులు పరిపాలన సాగించే క్రమంలో రాజులకు, ధనవంతులకు ఖరీదైన పాదరక్షలు కుట్టి ఇచ్చే వృత్తితో తమ పూర్వీకులు ఉదయగిరి సామ్రాజ్యంలోకి కర్ణాటక నుండి వలస వచ్చారని అదే వృత్తి బ్రిటీష్ పాలనలోనూ కొనసాగించామని, అప్పటి నుండి ఇప్పటి వరకూ ఉదయగిరిలో తమ కులం పేరుతో ఒక వీధి ప్రత్యేకంగా ఉన్నప్పటికీ తమకు కుల ధ్రువీకరణ నేటికీ జరగలేదని ఉదయగిరిలోని మోచీ తెగకు చెందిన వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రత్యేక కులగణన ప్రారంభించే క్రమంలో తమను గుర్తించి కుల ధ్రువీకరణ పత్రాలు మంజూరు చేయించాలని ఎక్కడికక్కడ అందరూ వలసలు పోగా కేవలం ఒక పది కుటుంబాల వాళ్లం మాత్రమే ఇక్కడ ఉంటున్నామని తెలిపారు. మగవాళ్లు కూలి పనులకు వెళితే, ఆడవాళ్లు టిఫిన్ సెంటర్లు నడుపుకుంటూ కుటుంబాలను నెట్టుకొస్తున్నామని వాపోయారు. పిల్లలను చదివించుకున్నప్పటికీ ఉన్నత చదువులకు కులధ్రువీకరణ అడ్డుగా నిలిచిందని కొన్ని సంవత్సరాల నుండి తమ కులం మోచీ అని ప్రభుత్వం దగ్గర నిరూపించుకునే ప్రయత్నం చేస్తూనే ఉన్నామని వారు అంటున్నారు. తాము ఎస్సి మాదిగ కేటగిరికి వర్తిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా కులగణన కార్యక్రమం ప్రారంభించినట్లు ఈ కార్యక్రమంతోనైనా తమ కులాన్ని పరిగణించి ధ్రువీకరణ పత్రాన్ని మంజూరు చేయాలని కోరారు.