రైతుకు వెంటనే నష్టపరిహారం అందించాలి

ప్రజాశక్తి- శృంగవరపుకోట: అకాల వర్షాల వల్ల రైతుకు అపార నష్టం వాటిల్లిందని పంట నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం అందించాలని టిడిపి రాష్ట్ర కార్యదర్శి గొంప కృష్ణ అన్నారు. శనివారం మండలంలోని వెంకటరమణపేట గ్రామంలో వర్షం కారణంగా పాడైన వరి పంటలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్నదాతలు ఆరుగాలం కష్టపడి పండించిన పంట అకాల వర్షాల వల్ల నీటిపాలవుతోందని ఒక్క వెంకటరమణ పేట గ్రామంలోనే సుమారు 20 ఎకరాలకు పైగా వరి పంట పూర్తిగా నీటమునిగి పంట నీళ్లలోనే ఉండడంతో వడ్లు మొలకెత్తాయని చెప్పారు. ఎకరాకు రూ.20 వేలకు పైగా ఖర్చు పెట్టి వరి పంట సాగు చేశారని, తీరా పంట చేతికొచ్చే దశలో పంటంతా పూర్తిగా మునిగిపోయి వడ్లు మొలకెత్తాయని, పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని అని కోరారు. నియోజకవర్గ వ్యాప్తంగా దెబ్బతిన్న వరి పంటను సచివాలయ వ్యవసాయాధికారులు పరిశీలించి ఉన్నతాధికారులకు నివేదిక అందించి రైతులను ఆదుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో విశాఖ పార్లమెంటరీ టిడిపి ఉపాధ్యక్షుడు రాయవరపు చంద్రశేఖర్‌, మండల పార్టీ సెక్రెటరీ జుత్తాడ రామసత్యం, పట్టణ చీఫ్‌ సెక్రటరీ ఆడారి రమేష్‌, టౌన్‌ పార్టీ ఉపాధ్యక్షులు మాదిబోయిన మంగరాజు, నాయకులు గనివాడ సన్యాసినాయుడు, కోరుకొండ శ్రీనివాస్‌ రావు, మండా త్రినాధ్‌, శివ, ముక్క రామకృష్ణ, పాల్గొన్నారు. వేపాడ : మండలంలోని పెద్ద కృష్ణరాజపురం గ్రామానికి చెందిన 20 ఎకరాలు పంట కోసిన తర్వాత వర్షం పడడంతో పూర్తిగా తడిసిపోయి మొలకెత్తి, కుళ్ళిపోయింది. నీటిలో మునిగిన పంటను టిడిపి రాష్ట్ర కార్యదర్శి గొంప కృష్ణ శనివారం పరిశీలించారు. పంట నష్టపరిహారం రైతులకు వచ్చేలా కృషి చేస్తానని ఆయన రైతులకు ఈ సందర్భంగా భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నియోజవర్గం టిడిపి మహిళా అధ్యక్షులు గుమ్మడి భారతి, బాణాది ఎంపిటిసి గొంప తులసి, నాయకులు సేనాపతి గణేష్‌, రామకృష్ణ, జి నాగరాజు, అప్పలనా యుడు, గుమ్మడి రాంబాబు, రామన్న దొర, రైతులు పాల్గొన్నారు.

➡️