ప్రజాశక్తి-నార్పల : మండల కేంద్రం నందు బొమ్మలాటపల్లి మిట్ట మీద ఉన్నటువంటి వికలాంగుల కాలనీకి తాగునీటి సమస్యలు వెంటనే తీర్చాలని కోరుతూ శనివారం వామపక్షాల ఆధ్వర్యంలో ధర్నా చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి కుల్లాయప్ప సిపిఐ మండల కార్యదర్శి గంగాధర్ మాట్లాడుతూ వికలాంగుల కాలనీ నందు తాగునీటి సమస్యను అధికారులకు ఎన్నిసార్లు విన్నవించిన పట్టించుకోకపోవడంతో వామపక్షాల ఆధ్వర్యంలో అనంతపురం నార్పల రహదారిపై కాలనీవాసులతో కలసి రోడ్డుపై ధర్నా తెలిపారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు అధికారులు వెంటనే స్పందించి వికలాంగుల కాలనీకి తాగునీటి సమస్య తీర్చాలని లేని పక్షాన పెద్ద ఎత్తున కాలనీవాసులతో కలుపుకొని పంచాయతీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఉన్న కాలనీలకు నీరు లేదు కానీ ఊరిలో ఇంటింటికి కులాయి అంటూ హంగామా చేస్తున్నారంటూ ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి గంగాధర్ సుధాకర్ సీనియర్ నాయకులు నాగరాజు, గోపాల్, సిపిఎం మండల కార్యదర్శి కుల్లాయప్ప, చంద్రమౌ,ళి అమీరు రైతు సంఘం నాయకులు జోసెఫ్ సంజీవరాయుడు తదితరులు పాల్గొన్నారు.