అమరావతి : పాకిస్తాన్ ఆల్ రౌండర్ ఇమాద్ వసీం అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పారు. శుక్రవారం ఎక్స్‌వేదికగా తన నిర్ణయాన్ని వెల్లడించారు. సుదీర్ఘ పోస్ట్ ద్వారా తన నిర్ణయాన్ని ఇమాద్ వసీం వివరించారు.
” గత కొన్ని రోజులుగా నా ఇంటర్నేషనల్ కెరీర్ గురించి సుదీర్ఘంగా ఆలోచిస్తున్నాను. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలకడానికి ఇదే సరైన సమయమని నేను భావించాను. నాకు అండగా నిలిచిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు ధన్యవాదాలు. పాకిస్థాన్‌కు ప్రాతినిథ్యం వహించడం నాకు దక్కిన గొప్ప గౌరవం. వన్డే, టీ20ల్లో కలిపి పాకిస్థాన్ తరఫున ఆడిన 121 మ్యాచ్‌ల్లో ప్రతీ గేమ్ నా కల నిజమైన క్షణమే. కొత్త కోచ్, కొత్త సారథి నాయకత్వంలో పాకిస్థాన్ అద్భుతాలు సఅష్టిస్తుందని భావిస్తున్నాను. పాకిస్థాన్ అసాధారణ విజయాలు అందుకోవడం నేను చూడాలని కోరుకుంటున్నాను. నాకు అండగా నిలిచిన పాకిస్థాన్ అభిమానులకు కృతజ్ఞతలు. అత్యున్నత స్థాయి క్రికెట్ ఆడేలా నాకు అండగా నిలిచిన నా కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులందరికీ ధన్యవాదాలు. ఇక నేను ప్రపంచవ్యాప్తంగా జరిగే ఫ్రాంచైజీ లీగ్స్‌పై ఫోకస్ పెట్టాలనుకుంటున్నాను.” అని ఇమాద్ వసీం ఎక్స్ వేదికగా సుదీర్ఘ పోస్ట్‌ను షేర్ చేశారు.
వన్డే ప్రపంచకప్ జట్టులోకి ఇమాద్ వసీంను తీసుకోకపోవడంతో ఆ టీమ్ స్పిన్ విభాగం బలహీనమైంది. ఇమాద్ వసీంను జట్టులోకి తీసుకోకపోవడంపై పాకిస్థాన్ మాజీ చీఫ్ సెలెక్టర్ ఇంజమామ్ ఉల్ హక్‌ను ప్రశ్నించగా.. అతను గత మూడేళ్లుగా వన్డే ఫార్మాట్ ఆడ లేదని చెప్పాడు. జట్టులోకి రావాలంటే డొమెస్టిక్ క్రికెట్లో సత్తా చాటాలని సూచించారు. భారీ అంచనాలతో ప్రపంచకప్ బరిలోకి దిగిన పాకిస్థాన్ కనీసం సెమీస్ చేరకుండానే ఇంటిదారి పట్టింది. ఇక 34 ఏళ్ల వయసుకే ఇమాద్ వసీం అంతర్జాతీయ క్రికెట్ వీడ్కోలు పలకడం చర్చనీయాంశమైంది. తన రిటైర్మెంట్ వెనుక ఉన్న బలమైన కారణాన్ని అతను వెల్లడించకపోయినా.. పీసీబీ రాజకీయాలకు విసుగు చెందే అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది.