‘బీచ్‌శాండ్‌’ వెనుక కేంద్రం !

ఏడాది క్రితమే అదాని సంస్థల ఏర్పాటు
ఇప్పటికే ఆప్‌షోర్‌ మైనింగ్‌ ప్రైవేటుకు అప్పగింత
ఎంఎండిఆర్‌ చట్టంలో పలు సవరణలు
న్యూఢిల్లీ : రాష్ట్రంలోని బీచ్‌శాండ్‌ మైనింగ్‌ను అదాని గ్రూపు సంస్థలకు అప్పగించడానికి జరుగుతున్న ప్రయత్నాల వెనుక కేంద్ర ప్రభుత్వ ప్రమేయం కూడా ఉన్నట్లు తెలిసింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం బీచ్‌శాండ్‌ మైనింగ్‌లో ప్రైవేటు రంగానికి అనుమతించే దిశలో కేంద్ర ప్రభుత్వం దాదాపుగా ఒకటి. రెండేళ్ల నుండే అడుగులు వేస్తోంది. దానిలో భాగంగా ఆఫ్‌షోర్‌ మైనింగ్‌లో ప్రైవేటు రంగానికి అనుమతించింది. దీనికోసం మైన్స్‌ అండ్‌ మినరల్స్‌ (డెవలప్‌మెంట్‌ అండ్‌ రెగ్యులేషన్‌ )చట్టం -ఎంఎండిఆర్‌ఎలో సవరణ చేసింది. బీచ్‌శాండ్‌ నిర్వచనాన్ని మార్చడం ద్వారా సాధ్యమైనన్ని ఎక్కువ ఖనిజాలను ‘అణు మూలకాల’ జాబితా నుండి తొలగించడానికి కసరత్తు చేస్తోంది. ఈ ఆర్థికసంవత్సరాంతంలోగా ఈ ప్రక్రియ పూర్తవుతుందని భావిస్తున్నారు. కేంద్రం నుండి ఇంత స్పష్టమైన సంకేతాలు ఉన్నాయి కాబట్టే అదానీ గ్రూపు బీచ్‌శాండ్‌ మైనింగ్‌ లక్ష్యంగా రెండు సంస్థలను ఏర్పాటు చేసింది. వీటిని ఏర్పాటు చేసి కూడా సంవత్సరం దాటి పోయింది, వీటిలో ఒకటి ఆంధ్రప్రదేశ్‌ కేంద్రంగా ఏర్పాటుకాగా, మరోకటి ఒడిషాలో ఏర్పాటు చేశారు.ఆ రాష్ట్ర ప్రభుత్వాలతో కూడా చర్చలు జరుపుతున్నారు. గత ఏడాది ఏప్రిల్‌ 14, 27 తేదీల్లో ముంబాయిలోని బాంబే స్టాక్‌ ఎక్స్చేంజ్‌ (బిఎస్‌ఇ)కి బీచ్‌శాండ్‌ మైనింగ్‌కోసం రెండు సంస్థలను ఏర్పాటు చేస్తున్నటుఅ అదాని గ్రూపు లేఖ రాసింది. ‘అలువైల్‌’ పేరుతో ఆంధ్రప్రదేశ్‌లోనూ, పూరి నేచురల్‌ రిసోర్సెస్‌ లిమిటెడ్‌ పేరుతో ఒడిషాలోనూ బీచ్‌శాండ్‌ మైనింగ్‌ కోసం సంస్థలను ఏర్పాటుచేస్తున్నట్లు తెలిపింది. ‘ఈ సంస్థలు బీచ్‌శాండ్‌ను ప్రాసెస్‌చేసి మినరల్స్‌ను తయారుచేస్తాయి. వీటిలో ముఖ్యమైనది టైటానియం డైయాక్సైడ్‌ (ుఱఉ2) ‘ అని లేఖలో స్పష్టం చేసింది. దీని గురించి, బీచ్‌శాండ్‌పై కేంద్ర ప్రభుత్వ వైఖరి గురించి అప్పట్లోనే మీడియాలో కథనాలు వచ్చాయి. ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే బీచ్‌శాండ్‌ కంపెనీల ఏర్పాటు గురించి అదాని గ్రూపు బిఎస్‌ఇకి సమాచారం ఇచ్చిన సరిగ్గా నెలరోజులకు బీచ్‌శాండ్‌ మైనింగ్‌లో ప్రైవేటు రంగాన్ని నిషేదిస్తూ 2019 ఫిబ్రవరిలో చేసిన చట్టసవరణపై తన వైఖరిని మోడీ ప్రభుత్వం మార్చుకుంది. మే 25వ తేదిన విడుదల చేసిన ముసాయిదాలో ప్రైవేటు మిగతా 2లో రంగాన్ని అనుమతించాలని పేర్కొంది. ఇలా మోడీ సర్కారు వైఖరి మారడానికి కారణమేంటో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

గుట్టుచప్పుడు కాకుండా…!

ఆగస్టులో జరిగిన పార్లమెంటు సమావేశాల్లో ఆఫ్‌షోర్‌ మైనింగ్‌ను ప్రైవేటు రంగానికి అప్పగిస్తూ మైన్స్‌ అండ్‌ మినరల్స్‌ చట్టంలో సవరణ తీసుకువచ్చింది. ప్రతిపక్ష సభ్యులందరు మణిపూర్‌ దారుణాలపై చర్చ జరగాలని పట్టుబడుతున్న సమయంలో ఈ సవరణ బిల్లును కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టి ఆమోదం పొందింది. ఈ మైనింగ్‌ పరిధిలోకి 12 రకాల ఆప్‌షోర్‌ ఖనిజాలను తీసుకురావడంతో పాటు 50 సంవత్సరాల లీజుకు ఇవ్వడానికి కేంద్రం ప్రతిపాదించింది. అయితే, అటమిక్‌ మినరల్స్‌ను మినహాయిస్తున్నట్లు దీనిలో పేర్కొన్నప్పటికీ ఒక్కసారి ఆఫ్‌షోర్‌లో కార్పొరేట్‌ రంగం తిష్టవేసిన తరువాత ఏం జరుగుతుందో తెలుసుకోవడం అంత సులభం కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

నిర్వచనం మార్పు

బీచ్‌శాండ్‌ నిర్వచనం మార్చడం ద్వారా అదాని గ్రూపునకు అనుకూల నిర్ణయం తీసుకోవడానికి కేంద్రం కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. మైన్స్‌ అండ్‌ మినరల్స్‌ చట్టం ఖనిజాలను ఎ.బి.సి అనే మూడు రకాలుగా విభజిస్తోంది. పార్ట్‌బిలో ఆటమిక్‌ మినరల్స్‌ ఉంటాయి. దేశ భద్రత దృష్ట్యా వీటి వెలికితీతను ప్రైవేటు రంగానికి ఇవ్వకూడదని 2019లో చేసిన చట్ట సవరణలో పేర్కొన్నారు. తాజాగా మోడీ ప్రభుత్వం పార్ట్‌బినుండి కొన్ని ఖనిజాలతో డి గ్రూపును ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. ‘క్రిటికల్‌ అండ్‌ స్ట్రాటజిక్‌ మినరల్స్‌’ పేరిట ఏర్పాటు చేయనున్న ఈ గ్రూపులో మొత్తం ఎనిమిది ఖనిజాలు ప్రతిపాదించారు. ఇవి దాదాపుగా అదాని గ్రూపు ఆసక్తి చూపిన ఖనిజాలే అని ఆ రంగానికి చెందిన నిపుణులు అంటున్నారు. కొత్త గ్రూపులోకి మార్చడంతో ఇవి కూడా ప్రైవేటు రంగాన్ని అనుమతించిన ఆఫ్‌షోర్‌ మైనింగ్‌ పరిధిలోకే రానున్నాయి. ఈ ప్రక్రియ ఈ ఆర్థిక సంవత్సరాంతంలోగా పూర్తవుతుందని భావిస్తు న్నారు. అంటే అదానికి రెడ్‌కార్పెట్‌ పరిచినట్టే !

రాష్ట్రంలో ఏం జరిగింది ?

రాష్ట్రంలోని రెండు బీచ్‌శాండ్‌ మైన్‌లు ఎసిఎండిసి పేరిటే ఉన్నాయి, అయితే, ‘ప్రాజెక్టు డెవలపర్‌ కమ్‌ ఆపరేటర్‌’ పేరిట 92 శాతం వాటాను ఆఫర్‌ చేస్తూ టెండర్లు పిలిచారు. దీంతో అదాని కోసమే ప్రభుత్వం ఈ చర్యకు తెగబడిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల గౌతమ్‌ అదాని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డితో భేటీ అయిన సంగతి తెలిసిందే. ఆ భేటీలోనే ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. అయితే, రాష్ట్ర ప్రభుత్వాలు ‘ ప్రాజెక్టు డెవలపర్‌’ను ఏర్పాటు చేసుకోవచ్చని ఆఫ్‌ఫోర్‌ మైనింగ్‌లో ప్రైవేటు రంగాన్ని అనుమతిస్తూ కేంద్రం తీసుకువచ్చిన చట్ట సవరణలో పేర్కొనడం గమనార్హం.!

➡️