ఉప్పు చేపల్లో ప్లాస్టిక్‌ ముప్పు

Nov 24,2023 10:11 #Jeevana Stories

ప్లాస్టిక్‌… మన నిత్య జీవితంలో భాగమైపోయింది. బకెట్లు… డబ్బాలు.. సంచులు… ఇలా ఇంట్లో ఏ మూల చూసినా ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో ప్లాస్టిక్‌ కనిపిస్తూనే ఉంటుంది. ప్లాస్టిక్‌ నేడు భూగోళమంతటా విస్తరించిన భూతంలా ఉంది. మనకు కనిపించకుండా కూడా మనల్ని వెంటాడుతోంది. చెరువులు, నదులు, సముద్రాల్లో పెద్దఎత్తున పోగు పడి, పెను ప్రమాదాన్ని తెచ్చి పెడుతోంది. సముద్రాల్లో చేరిన ప్లాస్టిక్‌ వల్ల సముద్రపు ఉత్పత్తులు కూడా కలుషితమై నేడు ప్రపంచానికే పెద్ద సవాలుగా మారింది. వీటిని తొలగించి మహా సాగరాలను పరిశుభ్రంగా మార్చటానికి ఎన్నెన్నో ప్రయోగాలు జరుగుతున్నాయి. తాజాగా ఇలాంటి ప్రయోగమే యూరోపియన్‌ యూనియన్‌ కమిషన్‌ సహాయంతో ఆంధ్ర విశ్వవిద్యాలయం మెరైన్‌ లివింగ్‌ రిసోర్సెస్‌ విభాగం ద్వారా జరుగుతోంది. ఆ పరిశోధన గురించి ఆ మెరైన్‌ ప్రాజెక్టు ప్రిన్సిపల్‌ ఇన్వెస్టిగేటర్‌ ఆచార్య పసుపులేటి జానకీరామ్‌ మాటల్లో తెలుసుకుందాం.

”ప్లాస్టిక్‌లో అనేక రకాలు ఉన్నాయి. మనం వాటిని వినియోగించిన తర్వాత పారేస్తుంటాం. అవి వివిధ ప్రవాహ మార్గాల ద్వారా చివరకు చెరువులు, నదులు, సముద్రాల్లో చేరుతుంటాయి. రోడ్డు మీద ఉండే చెత్త, వాహనాల టైర్లు, వాటి నుంచి అరుగుదలతో ఉత్పన్నమయ్యే రేణువులు భూమిపై పడుతుంటాయి. ప్లాస్టిక్‌ వాటర్‌ బాటిల్‌ వంటివి కాలక్రమంలో రేణువులుగా మారిపోతుంది. భూమిపైనా, నీటిలోనూ, ఇసుకలోనూ ఆ రేణువులు కలిసిపోతాయి. కాలక్రమంలో ఇలాంటివన్నీ సముద్రాల్లో చేరుతాయి. సముద్ర జీవులు తినే ఆహారంలోనూ, తీసుకునే నీటి ద్వారా వాటి శరీరాల్లోకి వెళ్లిపోయి అలా ఉండిపోతాయి. మా పరిశోధనలో ఇలాంటి అంశాలే వెలుగులోకి వచ్చాయి.

వృక్ష, జంతు ప్లవకాలతోనే సముద్ర జీవులకు ఆక్సిజన్‌

సముద్రాల్లోని చేపలు, ఇతర జలచర జీవులు సముద్రంలోని నాచు మొక్కలు (మైక్రో ఆల్గే) వంటి వృక్ష ప్లవకాలను తింటాయి. వీటి ద్వారా విడుదలయ్యే ఆక్సిజన్‌ను పొందుతుంటాయి. జంతు ప్లవకాలను చిన్న చేపలు, వాటిని పెద్ద చేపలు తింటుంటాయి. ఇలా తిన్న క్రమంలో వాటిలో ఉన్న ప్లాస్టిక్‌ రేణువులు జలచరాల్లోకి చేరిపోతున్నాయి. మా పరిశోధనల్లో సముద్రంలో చేపల జీర్ణకోశం, లివర్‌, కిడ్నీ, మొప్పలు (గిల్స్‌), చేప కండరాలు (మజిల్‌)ల్లో మైక్రో ప్లాస్టిక్‌ ఉండటాన్ని గమనించాం. ఇప్పటివరకూ కంటికి కనిపించే ప్లాస్టిక్‌ ఒక ఎత్తయితే, కనిపించని సూక్ష్మ కణాలుగా మారిన మైక్రో ప్లాస్టిక్‌ మరింతగా భయపెడుతోంది. దీనికి కారణం సముద్రాలు సూప్‌ ఆఫ్‌ మైక్రోప్లాస్టిక్స్‌గా మారడమే! ఏళ్ల తరబడి పేరుకుపోయిన ప్లాస్టిక్‌ వస్తువులు సూక్ష్మ కణాలుగా విభజన చెంది జల చరాల శరీరంలో చేరుతున్నాయి. సీపుడ్‌ను మానవులు పెద్దఎత్తున ఆహారంగా తింటున్న క్రమంలో మైక్రో ప్లాస్టిక్‌ క్రమేణా వారి శరీరాల్లోకి వచ్చి చేరుతోంది. ఇది రకరకాల వ్యాధులకు కారణమవుతాయి. సముద్ర జీవుల్లో చేరే మైక్రో ప్లాస్టిక్‌ను గుర్తించటం, గణించటం, అధ్యయనం చేయటం ద్వారా పై విషయాలు మా పరిశోధనల్లో వెలుగులోకి వచ్చాయి. ఈ రంగంలో నిపుణులను తయారు చేసేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాం. మా యూనివర్శిటీ పరిధిలో 50 మందిని ఎంపిక చేసి 25 మంది చొప్పున రెండు బ్యాచ్‌లలో శిక్షణ ఇచ్చాం. విశ్వ విద్యాలయ పరిశోధకులు, అధ్యాపకులు, మత్స్యశాఖ సిబ్బంది, అధికారులు, జీవీఎంసీ అధికారులూ ఇందులో భాగస్వాములయ్యారు.

వివిధ ప్రాంతాల్లో పరిశోధన

విశాఖ తీరంలోని గంగవరం నుంచి భీమునిపట్నం వరకూ సముద్రంపై నుంచి, మధ్యస్తంగానూ, అట్టడుగు ప్రాంతం నుంచి శాంపిళ్లను సేకరించాం. ఎంపిక చేసిన 50 మందీ నేరుగా ఈ పరిశోధనలో పాల్గొన్నారు. ప్రత్యక్ష నైపుణ్య శిక్షణతో ప్రతి ఒక్కరిలో దీనిపై విస్తృత అవగాహన ఏర్పడింది. తొలి మూడు రోజుల శిక్షణలో భాగంగా రెండు రకాల చేపల్లో మైక్రో ప్లాస్టిక్స్‌పై అధ్యయనం సాగింది. ఐదు మైక్రాన్ల కంటే తక్కువ మంది కలిగిన సూక్ష్మ ప్లాస్టిక్‌ కణాలు సముద్రపు నీటిలో, ఇసుకలో, చేపల్లో ఉండటాన్ని ఈ శిక్షణలో ప్రత్యక్షంగా అధ్యయనం చేశారు. నూనె కవళ్లు, పండుగప్పలో అవశేషాలు సేకరించిన సముద్రపు నీటిని వడబోసి, వ్యర్థాలను వేరుచేసి ఫొరియర్‌ ట్రాన్స్‌ఫామ్‌ ఇన్‌ఫ్రారెడ్‌ స్పెకోట్రస్కోపీ (ఎఫ్‌టీఐఆర్‌) సహాయంతో మైక్రో ప్లాస్టిక్‌ పరిమాణాన్ని గణించారు. ఇసుకలో ఉన్న మైక్రో ప్లాస్టిక్‌ను కూడా ఇలాగే గణించారు. చేపల్లో మైక్రో ప్లాస్టిక్‌ను గుర్తించేందుకు శరీర భాగాలను వేరుచేసి జీవ పదార్థం జీర్ణమయ్యేలా రసాయనాల ప్రక్రియ చేపట్టారు. మిగిలిన పదార్థాలను ఎండబెట్టి ఎఫ్‌టిఐఆర్‌లో పరీక్షించారు. ప్రజలు ఎక్కువగా తినే నూనె కవ్వళ్లు (ఆయిల్‌ సార్డయిన్స్‌), పండుగప్ప (లాటిస్‌) చేపల్లో ఈ ప్రయోగం సాగింది. వాటి లివర్‌, కిడ్నీల్లో పెద్దఎత్తున మైక్రో ప్లాస్టిక్‌ను గుర్తించారు. ఈ పరిశోధనల్లో ప్రాజెక్టు కో ఇన్వెస్టిగేటర్‌ డాక్టర్‌ కె.ఉమాదేవి, రీసెర్చ్‌ స్కాలర్లు డి.చంద్రశేఖర్‌, ఎస్‌.గీత తదితరులు పాల్గొన్నారు. మన దేశంలో ఆంధ్రా, కేరళ విశ్వవిద్యాలయాల ఆధ్వర్యంలో ఇలాంటి పరిశోధనలు జరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా చూస్తే- సైప్రస్‌, జర్మనీ, మలేషియా, స్పెయిన్‌, గ్రీసు దేశాల్లో కూడా కొనసాగుతున్నాయి.

ఏం చేయాలి?

ప్లాస్టిక్‌ కాలుష్యాన్ని తగ్గించాలంటే ప్రధానంగా దాని వినియోగాన్ని తగ్గించాలి. తొలుత సింగిల్‌ యూజ్డ్‌ ప్లాస్టిక్‌ స్థానే మల్టీయూజ్డ్‌ ప్లాస్టిక్‌ని వాడడం పెంచాలి. దాని వల్ల ప్లాస్టిక్‌ వ్యర్థాల ఉధృతిని తగ్గించవొచ్చు. తరువాతి క్రమంలో ప్లాస్టిక్‌ వాడకాన్ని, తయారీనీ నిషేధించాలి. ప్లాస్టిక్‌ వల్ల కలిగే దుష్పలితాలపై ప్రజలకు అవగాహన కల్పించాలి. ఎయు మెరైన్‌ లివింగ్‌ రీసోర్సెస్‌ విభాగం ఆధ్వర్యాన ఈ మేరకు కొంత కృషి చేస్తున్నాం. బీచ్‌లో ప్రజలకు అవగాహన కల్పించటం, స్వచ్ఛతపై చైతన్య కార్యక్రమాలు, కరపత్రాల పంపిణీ వంటివి చేపడుతున్నాం.

మైక్రో ప్లాస్టిక్‌ను తినే రోబో చేప

భూమిపై అన్ని సముద్రాల్లో సుమారు 20 కోట్లు పైబడి టన్నుల ప్లాస్టిక్‌ వ్యర్థాలు ఉన్నట్లుగా నిపుణులు అంచనా వేశారు. అమెరికాలోని నార్త్‌వెస్ట్రన్‌ యూనివర్శిటీ పరిశోధకులు నదులు, సముద్రాల్లోని ప్లాస్టిక్‌ను తినేసే ఎంజైమ్‌ను 2016లో కనిపెట్టారు. మెంటానా స్టేట్‌ యూనివర్శిటీ, యూనివర్శిటీ ఆఫ్‌ పోర్ట్స్‌మౌత్‌ పరిశోధకులు టీపీఎడీఒ ఎంజైమ్‌ను అభివృద్ధి చేశారు. 2015లో ఆస్ట్రేలియాలో రూపొందించిన బిసిన్‌ వ్యాక్యూమ్‌ క్లీనర్లు నేడు ప్రపంచవ్యాప్తంగా 860 వరకూ వాడుకలోకి వచ్చాయి. కృత్రిమ మేథతో పనిచేసే బగ్గీలు, మ్యాగటిక్‌ నానో స్కేల్‌ స్ప్రింగ్‌లు కూడా ప్లాస్టిక్‌ వ్యర్థాలను సేకరించడానికి వాడుతున్నారు. అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ (నాసా) సైక్లోన్‌ గ్లోబల్‌ నావిగేషన్‌ శాటిలైట్‌ సిస్టమ్‌ (సివైజిఎన్‌ఎన్‌ఎస్‌) ద్వారా ప్లాస్టిక్‌ వ్యర్థాల కదలికలను తెలుసుకుంటున్నారు. చైనాలోని సిచువాన్‌ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు మైక్రో ప్లాస్టిక్‌ను తినే రోబోచేపను తయారు చేశారు.

ఇంటర్వూ ్య : యడవల్లి శ్రీనివాసరావు

➡️